కరువు సీమలో ఆనందహేల | Heavy rains in Ananthapur | Sakshi
Sakshi News home page

కరువు సీమలో ఆనందహేల

Published Tue, Oct 8 2019 5:00 AM | Last Updated on Tue, Oct 8 2019 5:00 AM

Heavy rains in Ananthapur - Sakshi

అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ కాలువలో నిండుగా నీరు

అనంతపురం అగ్రికల్చర్‌: పాతాళ గంగమ్మ పైపైకి పొంగుతుండగా...బీడువారిన పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గ్రాసం లభించక కబేళాలకు తరలిన మూగజీవాలు కడుపునిండా పచ్చిగడ్డి మేస్తున్నాయి. వర్షాభావంతో పొట్టచేత పట్టుకుని వలస పోయిన జనాలు తమ భూముల సాగుకు తిరుగుపయనమయ్యారు. ఖరీఫ్‌ సీజన్‌లో చాలా ఏళ్ల తరువాత అనంతపురం జల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  

నిండిన చెరువులు... పొంగిన నదులు...
ఎప్పుడూ నెర్రలు చీలి కనిపించే పెద్ద చెరువులు తాజా వర్షాలతో పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని వందలాది చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ఉధృతంతా ప్రవహిస్తున్నాయి. పూర్తిగా ఎండిపోయి ఎడారిలా కనిపించిన పెన్నా, చిత్రావతి, కుముద్వతి, వేదవతి, హగరి, జయమంగళి లాంటి నదుల్లోనూ నీళ్లు పారుతున్నాయి. సెప్టెంబర్‌ మొదటి వారంలో భూగర్భజలాలు 27 మీటర్ల దిగువన కనిష్ట స్థాయిలో ఉండగా అక్టోబర్‌ మొదటి వారంలో 24 మీటర్లకు ఎగబాకడం విశేషం. అక్టోబర్‌ నెల సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ఇప్పటికే 78.9 మి.మీ నమోదైంది.  జిల్లాలో  సాధారణ వర్షపాతం  552.3 మి.మీ కాగా ఈ ఏడాది అక్టోబరు 7వ తేదీ నాటికే 411.7 మి.మీ. వర్షం నమోదయింది. చాలా సంవత్సరాల తర్వాత జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో అన్నదాత ఇంట ఆనందం వ్యక్తమవుతోంది. 

లక్ష హెక్టార్లలో సాగుకానున్న పప్పుశనగ
భారీ వర్షాలతో ఈ రబీలో పప్పుశనగ కనీసం లక్ష హెక్టార్లలో సాగులోకి వచ్చే పరిస్థితి ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పొలాల్లో నీరు చేరడంతో ఇప్పటికే వేసిన కొన్ని పంటలు దెబ్బతినగా రూ. 20 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనా.

ఒకేరోజు 30.2 మి.మీ వర్షపాతం 
వరుణుడి ప్రభావంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 25 రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కరువు సీమ కోనసీమలా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 63 మండలాల్లోనూ ఒకే రోజు 30.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుత్తి, పరిగి, పెద్దవడుగూరు, రొద్దం, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర తదితర మండలాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కిలోమీటర్ల మేర రహదారులు, పదుల సంఖ్యలో కల్వర్టులు దెబ్బతిన్నాయి. రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement