కుప్పెయ్.. కుమ్మెయ్
జిల్లాలో వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నదులు, వాగులు, వంకలు ఇసుక అక్రమరవాణాకు కేంద్ర బిందువుగా మారాయి. సులభంగా కాసులు కురుస్తుండటంతో ఇసుకమాఫియాకు కాసులు కురిపిస్తున్నాయి. చోటామోటా నేతలు, కొందరు నేరచరిత్ర కలిగిన వ్యక్తులు అక్రమరవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తున్నారు. దీంతో పోగేసిన ఇసుకడంప్‌లను రాత్రికిరాత్రే లారీల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలోని కృష్ణా, తుంగభద్రతో పాటు దుందుబీ, ఊకచెట్టువాగు తదితర వాగులు, వంకలు జిల్లాలో సుమారు రెండువేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు మైనింగ్‌శాఖ లెక్కలు చెబుతోంది. వీటిలో వేలకోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక మేటలు ఉన్నాయి. భూగర్భజలాలు తగ్గుతాయనే ఉద్ధేశంతో జిల్లాలో ఇసుక క్వారీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. ప్రభుత్వం అధికారింగా ఇంకా నూతన ఇసుక విధానాన్ని ప్రకటించాల్సి ఉంది.
నదులు, వాగుల నుంచి ఇసుకను తోడి తీర ప్రాంతాల్లోని పొలాలు, గ్రామాల్లో కుప్పలుగా పోస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక డంప్‌లు గుట్టలను తలపిస్తున్నాయి. రాత్రివేళ ల్లో నకిలీ పర్మిట్లతో కొందరు, దొంగచాటున మరికొందరు లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏదో ఒక సంస్థ పేరిట పర్మిట్లు సృష్టించి ఒకే పర్మిట్‌పై వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా కర్నూలు నుంచి రోజూ వందల లారీలు హైదరాబాద్‌కు జిల్లా మీదుగా వెళ్తున్నాయి.
ఇసుకను అక్రమంగా నిల్వ చేయడం, అధికారులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించడం, ఆ ఇసుకను అలాట్ చేయించుకుని హైదరాబాద్‌కు తరలించడం అనే ప్రక్రియను కొన్ని ముఠాలు కానిచ్చేస్తున్నాయి. 40 టన్నుల సామర్థ్యం ఉన్న ఒక్కోలారీ ఇసుకధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.లక్ష పైనే పలుకుతున్నట్లు సమాచారం.
అక్రమ రవాణాకు తలోచేయి
ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నా, పరోక్షంగా వారే ఇసుక మాఫియాకు తరలిస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ముఠాలకు స్వయంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే నాయకత్వం వహిస్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు తమకు రావాల్సిన మామూళ్ల కోసం స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా అక్రమ ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది.
ఈ రెండు విభాగాల్లోనూ మండల, జిల్లా స్థాయి పోస్టింగుల్లో అధికారుల నియామకాన్ని ఇసుక మాఫియాలే శాసిస్తున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుపడే అధికారులకు ఉన్నతస్థాయిలో బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తుండటంతో చేతులెత్తేస్తున్నారు. ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చే విషయంలోనూ ఇటీవల జిల్లా స్థాయిలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మండల, డివిజన్ స్థాయిలో కాకుండా మైనింగ్ అధికారులు ఇసుక పర్మిట్లు జారీ చేస్తారని తొలుత ప్రకటించారు.
రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకోలేక మైనింగ్ అధికారి ఒకరు సెలవుపై వెళ్లారు. దీంతో తిరిగి ఇసుక పర్మిట్ల జారీ అధికారాన్ని కలెక్టరేట్‌కు కట్టబెట్టడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించినా, కేవలం మామూళ్ల వసూలుకే పరిమితం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆగని అక్రమరవాణా
వడ్డేపల్లి మండల పరిధిలో ప్రవహించే తుంగభద్ర నదీతీరం నుండి ఇసుక అక్రమరవాణా జోరుగా సాగుతోంది. మండలంలోని రాజోలి, పడమటి గార్లపాడు, తుమ్మలపల్లి, తూర్పుగార్లపాడు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ గ్రామాల సమీపంలోని తుంగభధ్ర నది నుండి ట్రాక్టర్లద్వారా తెచ్చి కుప్పలుగా పోస్తున్నారు. ఈ డంప్‌ల నుంచి రాత్రివేళల్లో లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు.
కాగా, ఇటీవల జేసీ ఎల్.శర్మన్ ఇటీవల రాజోలి గ్రామాన్ని సందర్శించి ఇళ్లముందు ఉన్న ఇసుక డంప్‌లను చూసి నివ్వెరపోయారు. కేవలం రాజోలిలోనే అక్రమంగా నిల్వచేసిన సుమారు 50 ఇసుక డంప్‌లను చూసి ఆశ్చర్యపోయారు.
ఈ విషయమై స్థలం యజమానులు, ట్రాక్టర్లు, లారీ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని తహశీల్దార్ శాంతకుమారి, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, గద్వాల డీఎస్పీని ఆదేశించి వెళ్లినా నేటికీ చర్యలు తీసుకోవడంలేదు.