maining department
-
మా అనుచరులు రాక్షసులు: జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. తాడిపత్రి పోలీసులను హేళనగా మాట్లాడుతూ నోరు పారేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... ముచ్చుకోటలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన క్వారీల్లో మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ మైనింగ్‌పై అధికారులు వివరాలు సేకరించారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు. అక్కడకు వచ్చిన పోలీసులను హేళన చేస్తూ మాట్లాడారు. (దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్) సీఐ తేజోమూర్తిని పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డి బెదిరించారు. మీ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘మా అనుచరులు రాక్షసులు. టీడీపీ అధికారంలోకి వస్తే రెచ్చిపోతారు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉంటారు. పోలీసులు మీ భవిష్యత్ పాడు చేసుకోవద్దు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా విధుల్లో ఉన్న సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. (మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి) -
సోన్‌భద్రలో భారీగా బంగారం నిల్వలు
సోన్‌భద్ర: ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు బయటపడ్డాయి. దాదాపు 3 వేల టన్నుల ముడి బంగారం నిల్వలను గుర్తించామని జియాలజీ, మైనింగ్ విభాగం శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత ధరల ప్రకారం వాటి విలువ రూ. 12 లక్షల కోట్లు ఉంటుంది. సోన్‌భద్ర దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటి. బంగారం నిల్వలను గుర్తించిన పర్వతం 108 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాన్ని వేలం వేసేందుకు ఈ– టెండర్లను కూడా ఆహ్వానించారు. 2005లోనే ఇక్కడ ఖనిజ నిక్షేపాలను గుర్తించే కార్యక్రమం ప్రారంభించామని సోన్‌భద్ర జిల్లా మైనింగ్ ఆఫీసర్ కేకే రాయ్ తెలిపారు. బంగారం గనికి సంబంధించిన నివేదిక ఈ రోజే అందిందన్నారు. ఈ ప్రాంతం లో యురేనియం సహా విలువైన ఖనిజ నిక్షేపాలు కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. -
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం
సాక్షి, వికారాబాద్: అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో శనివారం ఆయన జిల్లా అధికారులతో మైనింగ్, మినరల్స్, హరితహారం తదితర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి తదితరాలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నవాబుపేట, ధారూరు, యాలాల, బషీరాబాద్, పరిగి తదితర మండలాల్లో ఇసుక, ఇతర మైనింగ్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. అక్రమార్కులతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా రోడ్లు దెబ్బతింటున్నాయని మంత్రి చెప్పారు. అక్రమ మైనింగ్, రవాణా విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించరాదని సూచించారు. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్‌తో పర్యావరణ సమత్యులం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిట్ల గడువు పూర్తయినా ఇంకా కొందరు అక్రమంగా గనులను తవ్వడం, ఒకచోట పర్మిట్లు తీసుకొని మరోచోట తవ్వకాలు చేపట్టడం వంటివి చేస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్మిట్ తీసుకున్న విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలను నిర్వస్తున్న వారిపై నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో గనుల ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 150 కిలోమీటర్ల మేర రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిని నాణ్యతా ప్రమాణాలతో బాగు చేయాలంటే రూ.35 కోట్లు అవసరమవుతాయన్నారు. జిల్లాలో మైనింగ్‌పై ఏటా ప్రభుత్వానికి రూ.47.81 కోట్ల ఆదాయం వస్తుందని, ఇందులో మైనింగ్ ప్రభావిత గ్రామాలకు 30 శాతంమేర నిధులను అందించనున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. గనుల ప్రభావిత ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ ప్రాంతాల్లో రెండేసి చొప్పున ఆరు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకను అందించాలని సూచించారు. జిల్లాలో 125 మైనింగ్ లైసెన్సులు రెన్యూవల్ దశలో ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు. మైనింగ్ నిధులతో జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ స్థలంలో రూ.2.5 కోట్ల వ్యయంతో సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం నిర్మించే ప్రతిపాదనలకు మంత్రి మహేందర్‌రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వానికి వచ్చే మైనింగ్ ఆదాయాన్ని అన్ని ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న బయో మరుగుదొడ్లు నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయన్నారు. వీటి స్థానంలో సాధారణ మరుగొదొడ్లను నిర్మించేందుకు అనుమతించాలని సూచించారు. కలెక్టర్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. మైనింగ్‌కు సంబంధించి ఇప్పటికే 40 ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు జీపీఎస్‌తో అనుసంధానం చేశామని తెలిపారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు సంజీవరావు, రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, జేసీ అరుణకుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జాన్సన్, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కుప్పెయ్.. కుమ్మెయ్
జిల్లాలో వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నదులు, వాగులు, వంకలు ఇసుక అక్రమరవాణాకు కేంద్ర బిందువుగా మారాయి. సులభంగా కాసులు కురుస్తుండటంతో ఇసుకమాఫియాకు కాసులు కురిపిస్తున్నాయి. చోటామోటా నేతలు, కొందరు నేరచరిత్ర కలిగిన వ్యక్తులు అక్రమరవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తున్నారు. దీంతో పోగేసిన ఇసుకడంప్లను రాత్రికిరాత్రే లారీల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలోని కృష్ణా, తుంగభద్రతో పాటు దుందుబీ, ఊకచెట్టువాగు తదితర వాగులు, వంకలు జిల్లాలో సుమారు రెండువేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు మైనింగ్‌శాఖ లెక్కలు చెబుతోంది. వీటిలో వేలకోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక మేటలు ఉన్నాయి. భూగర్భజలాలు తగ్గుతాయనే ఉద్ధేశంతో జిల్లాలో ఇసుక క్వారీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. ప్రభుత్వం అధికారింగా ఇంకా నూతన ఇసుక విధానాన్ని ప్రకటించాల్సి ఉంది. నదులు, వాగుల నుంచి ఇసుకను తోడి తీర ప్రాంతాల్లోని పొలాలు, గ్రామాల్లో కుప్పలుగా పోస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక డంప్‌లు గుట్టలను తలపిస్తున్నాయి. రాత్రివేళ ల్లో నకిలీ పర్మిట్లతో కొందరు, దొంగచాటున మరికొందరు లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏదో ఒక సంస్థ పేరిట పర్మిట్లు సృష్టించి ఒకే పర్మిట్‌పై వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా కర్నూలు నుంచి రోజూ వందల లారీలు హైదరాబాద్‌కు జిల్లా మీదుగా వెళ్తున్నాయి. ఇసుకను అక్రమంగా నిల్వ చేయడం, అధికారులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించడం, ఆ ఇసుకను అలాట్ చేయించుకుని హైదరాబాద్‌కు తరలించడం అనే ప్రక్రియను కొన్ని ముఠాలు కానిచ్చేస్తున్నాయి. 40 టన్నుల సామర్థ్యం ఉన్న ఒక్కోలారీ ఇసుకధర హైదరాబాద్ మార్కెట్లో రూ.లక్ష పైనే పలుకుతున్నట్లు సమాచారం. అక్రమ రవాణాకు తలోచేయి ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నా, పరోక్షంగా వారే ఇసుక మాఫియాకు తరలిస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ముఠాలకు స్వయంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే నాయకత్వం వహిస్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు తమకు రావాల్సిన మామూళ్ల కోసం స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా అక్రమ ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ మండల, జిల్లా స్థాయి పోస్టింగుల్లో అధికారుల నియామకాన్ని ఇసుక మాఫియాలే శాసిస్తున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుపడే అధికారులకు ఉన్నతస్థాయిలో బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తుండటంతో చేతులెత్తేస్తున్నారు. ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చే విషయంలోనూ ఇటీవల జిల్లా స్థాయిలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మండల, డివిజన్ స్థాయిలో కాకుండా మైనింగ్ అధికారులు ఇసుక పర్మిట్లు జారీ చేస్తారని తొలుత ప్రకటించారు. రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకోలేక మైనింగ్ అధికారి ఒకరు సెలవుపై వెళ్లారు. దీంతో తిరిగి ఇసుక పర్మిట్ల జారీ అధికారాన్ని కలెక్టరేట్‌కు కట్టబెట్టడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించినా, కేవలం మామూళ్ల వసూలుకే పరిమితం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆగని అక్రమరవాణా వడ్డేపల్లి మండల పరిధిలో ప్రవహించే తుంగభద్ర నదీతీరం నుండి ఇసుక అక్రమరవాణా జోరుగా సాగుతోంది. మండలంలోని రాజోలి, పడమటి గార్లపాడు, తుమ్మలపల్లి, తూర్పుగార్లపాడు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ గ్రామాల సమీపంలోని తుంగభధ్ర నది నుండి ట్రాక్టర్లద్వారా తెచ్చి కుప్పలుగా పోస్తున్నారు. ఈ డంప్‌ల నుంచి రాత్రివేళల్లో లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. కాగా, ఇటీవల జేసీ ఎల్.శర్మన్ ఇటీవల రాజోలి గ్రామాన్ని సందర్శించి ఇళ్లముందు ఉన్న ఇసుక డంప్‌లను చూసి నివ్వెరపోయారు. కేవలం రాజోలిలోనే అక్రమంగా నిల్వచేసిన సుమారు 50 ఇసుక డంప్‌లను చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయమై స్థలం యజమానులు, ట్రాక్టర్లు, లారీ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని తహశీల్దార్ శాంతకుమారి, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, గద్వాల డీఎస్పీని ఆదేశించి వెళ్లినా నేటికీ చర్యలు తీసుకోవడంలేదు.