కాలుష్యం జడలు విప్పుతోంది.. విష జలాలు ఏరులై పారుతున్నాయి.. వర్షం వచ్చిందంటే వరదలై ఉరకలెత్తుతున్నాయి.
భూగర్భంలోనూ కాలుష్య జలాలే..
- పరిశ్రమల ఇష్టారాజ్యమే కారణం
- యథేచ్ఛగా వ్యర్థ జలాల ప్రవాహం
- నిఘా శూన్యం..పీసీబీ విఫలం
- పాలకులు కళ్లప్పగించి చూస్తున్న వైనం
కాలుష్యం జడలు విప్పుతోంది.. విష జలాలు ఏరులై పారుతున్నాయి.. వర్షం వచ్చిందంటే వరదలై ఉరకలెత్తుతున్నాయి. ప్రజల జీవితం ప్రాణసంకటంగా మారుతోంది.. నిఘా పెట్టాల్సిన పీసీబీ చోద్యం చూస్తోంది.. భూగర్భంలోంచి సైతం కాలకూటం చిమ్ముతోంది.. పారిశ్రామిక వాడలు కాలుష్యకాసారంలో చిక్కుకుంటున్నాయి. అయినా పాలకుల్లో చలనంలేకపోవడం గమనార్హం.
మెదక్(జిన్నారం):
జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 200 వరకు వివిధ రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య జలాలను నిబంధనలకు విరుద్ధంగా, యథేచ్ఛగా బహిరంగ ప్రదేశాలకు వదులుతుంటాయి. వర్షాకాలం పరిశ్రమల యాజమాన్యాలకు ఇందుకు వేదికగా మారుతున్నాయి. వర్షం పడుతున్న సమయంలోనే వర్షం నీటితో కలిపి కాలుష్య జలాలను బయటకు వదులుతున్నారు. దీంతో గ్రామాలు పూర్తిగా కాలుష్య మయంగా మారుతున్నాయి.
ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం పారిశ్రామిక వాడలతో పాటు కిష్టాయిపల్లి, అల్లీనగర్, చెట్లపోతారం తదితర గ్రామాల భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యంగా మారాయి. వ్యవసాయం కోసం భూగర్భ జలాల నుంచి నీటిని తోడితే పసుపు, నీలి రంగుల్లో నీటి ప్రవాహం ఉందంటే ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలుష్య జలాల ప్రవాహాన్ని సైతం నివారించటంలో పీసీబీ టాస్క్‌ఫోర్స్, పీసీబీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య జలాలను బయటకు వదలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
86 పరిశ్రమలకు నోటీసులు
వర్షా కాలంలో అప్రమత్తంగా ఉండాలని, కాలుష్య జలాలను బయటకు వదలవద్దని సూచిస్తూ మండలంలోని సుమారు 86 రసాయన పరిశ్రమలకు నోటీసులు జారీ చేశాం. కాలుష్య జలాలను బయటకు వదలకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తాం.
- నరేందర్, పీసీబీ ఈఈ