ఎండలు తీవ్రం కాకముందే తాగునీటి కటకట మొదలైంది. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
జిల్లాలో భూగర్భజలాల పరిస్థితి
మండలం నీటిమట్టం (మీ.)
బంట్వారం 20.97
మొయినాబాద్ 12.11
హయత్‌నగర్ 9.70
గండేడ్ 9.55
మంచాల 7.34
ఎండలు తీవ్రం కాకముందే తాగునీటి కటకట మొదలైంది. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఫలితంగా రోజురోజుకూ భూగర్భ నీటి మట్టాలు భారీగా పడిపోతున్నాయి. కేవలం నెలరోజుల వ్యవధిలోనే జిల్లాలో సగటున నాలుగు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పతనమైనట్లు ఆ శాఖ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం జిల్లాలో సగటు నీటి మట్టం 14 మీటర్లుగా(45 ఫీట్లుగా) భూగర్భజలవనరుల శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే వెయ్యి ఫీట్ల లోతుకు వెళ్లినా నీటి లభ్యత అంతంతమాత్రమే.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో భారీ నీటి ప్రాజెక్టులు లేనికారణంగా సాగు ఆసాంతం బోరుబావులపైనే ఆధారపడింది. ప్రస్తుతం రబీ కీలక దశకు చేరుకోవడంతో నీటి వాడకం పెరిగింది. మరోవైపు తాగునీటికి కీలక వనరు సైతం బోరుబావులే కావడంతో ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో భూగర్భజలాలు క్రమంగా పతనమవుతున్నాయి. గత నెలలో 11 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతుండగా.. ప్రస్తుతం 14 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం.
తాజాగా అధికారుల పరిశీలన ప్రకారం బంట్వారం మండలంలో నీటి మట్టం 28.77 మీటర్లుగా నమోదైంది. అదేవిధంగా మొయినాబాద్‌లో 27.11 మీటర్లు, మల్కాజిగిరి 23.66 మీటర్లు, మర్పల్లిలో 22.70 మీటర్లలోతులో నీరున్నట్లు చెబుతున్నాయి. దాదాపు జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ప్రత్యామ్నాయ చర్యలతో గట్టెక్కించకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముంది.
జాడలేని వేసవి ప్రణాళిక
జిల్లాలో మెజారిటీ గ్రామాలకు ఇప్పటికీ భూగర్భజలాలనే తాగునీటి కింద సరఫరా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జిల్లా తూర్పు డివిజన్ ప్రాంతాలకు కృష్ణా నీటిని అందిస్తుండగా.. ఉత్తర ప్రాంతానికి గోదావరి నీరందిస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో నీటి సరఫరాలో లోటు ఏర్పడింది. ఫలితంగా వాస్తవ సరఫరా కంటే తక్కువ మోతాదులో నీటిని సరఫరా చేస్తుండగా.. వినియోగం మాత్రం రెట్టింపయ్యింది.
దీంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో గ్రామీణ నీటిసరఫరా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. అధికారులు ఇప్పటివరకు ప్రత్యేక ప్రణాళికలేవీ రూపొందించలేదు. ఆ విభాగానికి పూర్తిస్థాయి అధిపతి లేకపోవడంతోనూ ప్రణాళిక రూపకల్పనలో జాప్యం జరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పక్కా ప్రణాళిక లేనందున ఈ సీజన్‌లో జిల్లా ప్రజానీకానికి తాగునీటి ఇబ్బందులు తప్పేలాలేవు.