నీటిని వృథా చేయొద్దు..
► ప్రాణికోటికి నీరు ఎంతో అవసరం
► నీటిని పొదుపుగా వాడుకోండి కొమరంభీమ్ ఆ రోజుల్లోనే చెప్పారు
► కలెక్టర్ జగన్మోహన్ దత్తత గ్రామంలో జలదినోత్సవం
ఆదిలాబాద్ రూరల్ : భూగర్భ జలాలు అడుగుంటి పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయవద్దని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. నీటిని వృథా చేయమని, అవసరం ఉన్నంత మేరకే వాడుతామని జిల్లా కలెక్టర్ అంకోలి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మంగళవారం జల దినోత్సవాన్ని పురస్కారించుకొని కలెక్టర్ దత్తత తీసుకున్న అంకోలి గ్రామంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కొమరం భీం ఆ రోజుల్లోనే నీటి విలువను తెలపడం జరిగిందన్నారు. ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు.
గ్రామంలో ఎవరూ చదువు చెప్పడం లేదని, ఇలా అయితే తామెలా చదువుకునేదని అంకోలి గ్రామానికి చెందిన వయోజనులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ చాకటి భారతి, ఎంపీటీసీ కనక రమణ, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డ్వామా పీడీ శంకర్, డీఎఫ్‌వో గోపాల్‌రావు, ఎంపీడీవో రవిందర్, ఈవోపీఆర్డీ సుదర్శన్ బానోవత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రణాళికబద్ధంగా చదువాలి...
అలసత్వాన్ని వీడి ఐక్యతతో ప్రణాళిక బద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించడానికి అస్కారం ఉంటుందని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో స్టార్-30 ఏంసెట్ ఐఐటీ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ మంచి ర్యాంక్ సాధించాలన్నారు. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడడంతోనే గుర్తింపు వస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అగస్టిన్, కోర్సు నోడల్ ఆఫీసర్, కోర్సు కోఆర్డినేటర్ శ్రీనివాస స్వామి, ఏటీడబ్ల్యూవో, సిబ్బంది షరీఫ్ ఉన్నారు.