మీనమేషాలు ఇక చాలు | Govt to ensure safe drinking water to tackle fluorosis | Sakshi
Sakshi News home page

మీనమేషాలు ఇక చాలు

Published Sat, Dec 27 2014 4:47 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితుడు - Sakshi

నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితుడు

తాజా గణాంకాల ప్రకారం దేశంలో 676 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 230 జిల్లాలకు ఫ్లోరోసిస్ సమస్య ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా లోక్‌సభలో (డిసెంబర్ 19) ప్రకటించారు. నిజానికి దేశంలోని 20 రాష్ట్రాలలో, 275 జిల్లాలలో ఇది వ్యాపించి ఉందని 2009లోనే తేలింది. దేశంలో మూడు రాష్ట్రాలు -రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఈ వ్యాధి మరీ తీవ్రంగా ఉందని మంత్రి చెప్పారు. అంటే దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న రాష్ట్రాలు మూడైతే, అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కావడం అత్యంత విషాదం.
 
దేశాన్ని పట్టిపీడిస్తున్న తీవ్ర ఆరోగ్య సమస్యల గురించి కేంద్రంలోను, మన రెండు రాష్ట్రాలలోను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆశాజనకమైన ప్రయా ణాన్నే ఆరంభించాయని అనిపిస్తోంది. వాతావరణ కాలుష్యంతో, పర్యావరణం దెబ్బ తినడంతో పాత రుగ్మతలు తీవ్ర రూపం దాల్చడం ఇటీవలి విషాదం. అందుకు గొప్ప ఉదాహరణ ఫ్లోరోసిస్ వ్యాధి. చిత్రం ఏమిటంటే, ఈ వ్యాధికి తెలంగాణలో 1975 వరకు ఉన్న స్వరూపం వేరు. తరువాతే ఇది తీవ్రరూపం దాల్చి కాళ్లూ చేతులూ వంకర్లు పోయే విపరిణామానికి దారి తీసింది.
 
భూగర్భ జలాలు విపరీతంగా కాలుష్యానికి గురికావడం ఇందుకు కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి తగినంత ప్రచారం జరిగింది గానీ, నివారణ చర్యలు చిత్తశుద్ధితో ఆరంభం కాలేదు. కొనసాగలేదు కూడా. తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ వ్యాధిని నివారించడం ఒక బడ్జెట్ కాలంలోనో, ఒక దశాబ్ద కాలంలోనో జరిగేది కాదు. అదొక సుదీర్ఘ ప్రణాళిక . నివారణ పనులు అసలు ఆరంభం కాలేదని చెప్పడం సరికాకపోయినా, ఆ చర్యలన్నీ అరకొర చర్యలేనని చెప్పడం సత్యదూరం కాదు. భారత్‌కు పక్కనే ఉన్న చైనాలోను ఫ్లోరోసిస్ వ్యాధి ఉంది. కానీ వారి అనుభవాలు వేరు. ఎందుకంటే వారు తీసుకున్న చర్యలు కూడా వేరుగానే ఉన్నాయి.
 
భయపెడుతున్న వాస్తవాలు
 2014 నాటి తాజా గణాంకాల ప్రకారం దేశంలో 676 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 230 జిల్లాలకు ఫ్లోరోసిస్ సమస్య ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా లోక్‌సభలో (డిసెంబర్ 19) ప్రకటించారు. నిజానికి దేశంలోని 20 రాష్ట్రాలలో, 275 జిల్లాలలో ఇది వ్యాపించి ఉందని 2009లోనే తేలింది. దేశంలో మూడు రాష్ట్రాలు -రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఈ వ్యాధి మరీ తీవ్రంగా ఉందని మంత్రి చెప్పారు. అంటే దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న రాష్ట్రాలు మూడైతే అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కావడం అత్యంత విషాదం.
 
తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అడిగిన ప్రశ్నతో మంత్రి పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. నిజానికి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా ఈ సమస్య ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కొన్ని చర్యలు తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించడం అత్యాశ కాకపోవచ్చు. తెలంగాణలోని పది జిల్లాలకు 9 జిల్లాలు ఆ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న సంగతిని కూడా మంత్రి వెల్లడించారు. ఇంకా విషాదం ఏమిటంటే, తెలంగాణలోనే వెనుకబడిన నల్లగొండ జిల్లాలోని 59 మండలాల్లో 58 మండలాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఈ వ్యాధి విజృంభిస్తోంది.
 
అదుపుతప్పుతున్న వ్యాధి విస్తృతి?
దేశంలో పది లక్షల మంది ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలియచేశారు కానీ, అది అస్పష్ట సమాచారం. మంత్రి చెప్పిన పది లక్షలు ఈ వ్యాధి బారిన పడి మంచం కూడా దిగలేని స్థితిలో ఉన్న వారి లెక్క కావచ్చు. మాలాంటి నిపుణుల అంచనా ప్రకారం దేశంలో ఆరు కోట్లకు పైనే ఈ వ్యాధిన బారిన పడిన వారు ఉన్నారు. కాళ్లూ చేతులూ పూర్తిగా పట్టు తప్పిన వారు అరవై లక్షల వరకు ఉన్నారు. ఈ వ్యాధిలో దశల వారీగా రోగాన్ని గుర్తించవలసి ఉంటుంది. పళ్లు పసుపు రంగులోకి మారడం తొలి దశ. తరువాత ఎముకలకు వ్యాపిస్తుంది. ఆపై ఎముకలు సుద్దముక్కలంత అల్పంగా మారిపో వడమే కాక, బిగుసుకుపోతాయి. వెన్నెముక బిరుసెక్కి, కాళ్లు చేతులు వంకర్లు పోయి, అవి చెట్టు బెరడు మాదిరిగా తయారు కావడం చివరి దశ. ఈ వ్యాధి స్వరూప స్వభావాలను బట్టే కాదు, అది విస్తరిస్తున్న తీరు కూడా ఘోరమైనద న్న సంగతిని ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాలి.
 
సరైన వ్యూహం ఏదీ?
ఈ గణాంకాలు ప్రభుత్వం వద్ద ఇప్పటిదాకా లేవని కాదు. కానీ ఇంత పెద్ద ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి అవసరమైన వ్యూహం గురించి గట్టిగా ఆలోచించలేదు. దాని ఫలితమే ఈ విపరిణామాలు. ఫ్లోరోసిస్ వ్యాధిని తొలుత భారతదేశంలో 1937లోనే కనిపెట్టారు. కానీ నివారణ కోసం తీసుకున్న చర్యలు తక్కువే. ఈ వ్యాధి ఏటా తీవ్ర రూపం దాలుస్తున్న సంగతిని నిపుణులు వెల్లడిం చడమే ఇందుకు తార్కాణం. ఫ్లోరైడ్ మానవదేహంలోకి అధిక మోతా దులో ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి సోకుతోంది. ఇది తాగునీటితోనే సంక్రమిస్తుందని చాలా కాలం భావించారు.
 
 కానీ ఫ్లోరైడ్ శాతం ఉన్న నీరు ఉన్న ప్రాంతాలలో పండే పంట, తాగే టీ కాఫీల వంటి వాటి వల్ల కూడా ఇది సంక్రమిస్తుందని కొద్ది కాలం క్రితమే తెలుసుకున్నారు. అధిక మొత్తంలో టీ ఇంకా హానిచేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం శరీరంలోకి చేరడం వల్ల, అసలే పోషకాహార లోపంతో ఉండే జనంలో ఫ్లోరోసిస్ తీవ్రమవుతోంది. ఇవన్నీ శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, వైద్యులకు సంబంధించిన సాంకేతిక విషయాలు. కానీ సమస్య పరి ష్కారంలో ఈ వాస్తవాలే కీలక పాత్ర వహిస్తాయి. వ్యాధి బారిన పడకుండా కూడా కాపాడతాయి. కొన్ని జాగ్రత్తల గురించిన స్పృహనూ కలిగిస్తాయి.
 
కొంప ముంచుతున్న బోరుబావులు
 ఫ్లోరోసిస్ సమస్య మూలాల గురించి కొత్త ఆవిష్కరణలు జరిగిన తరువాత ప్రభుత్వాలు కూడా కొత్త దృక్పథంతో ఆలోచించవలసి వచ్చింది. తాగునీటితోనే ఫ్లోరోసిస్ సోకుతోందని అనుకున్నంత కాలం, శుద్ధమైన తాగునీరు అందించ డానికే ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేశాయి. అంటే ప్రవాహ శీలత ఉండే నదీజలాలను వ్యాధిపీడిత ప్రాంతాలకు తరలించేందుకు పథకాలు వేశా యి. ఈ అవకాశం లేనిచోట డిఫ్లోరైడేషన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని యోచించాయి. చాలా చోట్ల ఆ ప్రయత్నం కూడా జరిగింది. ఇలాంటి ప్లాంట్‌ల నిర్మాణానికే ‘నల్లగొండ విధానం’ అని పేరు కూడా వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దిరిశవంచ గ్రామంలో వ్యాధిపీడితులకు కృష్ణాజలాలను అందించే అవకాశం వచ్చింది.
 
 కనిగిరి జలాశయం ద్వారా దీనిని సాధించగలి గారు. అయితే పదహారేళ్ల పాటు కృష్ణా నీరు అందించిన తరువాత చేసిన పరి శోధనలు మళ్లీ శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసే తీరులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో రోగుల ఎముకలు, దంతాలను పరీక్షిస్తే వ్యాధి తీవ్రతలో ఏమీ మార్పు కనిపించలేదు. మళ్లీ కొత్త ప్రశ్నలు ఉదయించాయి. అయితే నల్లగొండ జిల్లాలోని పీడిత ప్రాంతాల మాదిరిగానే, ప్రకాశం జిల్లాలో కూడా క్రమం తప్ప కుండా కృష్ణా నీటిని సరఫరా చేసిన దాఖలాలు లేవు. శుద్ధమైన తాగునీటితోనే ఈ వ్యాధిని అరికట్టలేమని మరోసారి రుజువైంది. ఆయా ప్రాంతాల ప్రజలు తీసుకొనే ఆహార పదార్థాలు, ఇతర పానీయాల విషయంలో కూడా జాగ్రత్త పడవలసిందే.
 
 ఈ ప్రాంతాలలో ఎక్కువ వ్యవసాయం బోరు బావుల ద్వారానే జరుగుతోంది. నిజానికి ఫ్లోరోసిస్ అనే ఈ రుగ్మతా భూతానికి మూలం బోరు బావులే. దీనికితోడు 46 శాతం బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారే. 70 శాతం గర్భిణులు రక్తహీనతతో ఉంటున్నారు. ఇవన్నీ కలసి దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధి విశ్వరూపం దాల్చేటట్టు చేస్తు న్నాయి. దేశంలో ఈ వ్యాధి ఇంత వెర్రి తలలు వేస్తున్నా వైద్య విద్యలో దీని గురించి సరైన అధ్యయనం లేదు. కనీసం పౌష్టికాహార లోపానికీ, ఫ్లోరోసిస్ వ్యాధికీ ఉన్న సంబంధం గురించి కూడా వారి పుస్తకాలలో ఉదహరించడం లేదు. ఆ మధ్య 28 వ్యాధి నిరోధక కార్యక్రమాలను ప్రకటించారు. అందులో ఫ్లోరోసిస్ వ్యాధికి చోటు ఇవ్వలేదు.
 
అనుభవాలు, ఆచరణలు
 మధ్యప్రదేశ్‌లోని జాబువా గ్రామంలో జరిగిన ప్రయత్నం పేర్కొనదగినది. అక్కడ శుద్ధమైన తాగునీరు సరఫరా చేశారు. లేదంటే డిఫ్లోరైడేషన్ ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేసి అందించారు. డిఫ్లోరైడేషన్ కిట్‌ను కాన్పూర్ ఐఐటీ సంస్థ నిపుణులు తయారు చేసి ఇచ్చారు. స్థానికంగా పండే పంటలను ఆహారం గా తీసుకోవద్దని, హెచ్చరించి ప్రభుత్వం గోధుమలు సరఫరా చేసింది. పిల్లలకు సోయా లడ్డులను అందించింది.  దీనితో పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు తగ్గు ముఖం పట్టాయి. దీనిని గమనించడం అవసరం. కాగా, తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకం చేపట్టడం వెనుక ఉన్న ఉద్దేశాలలో ఫ్లోరోసిస్‌ను అరికట్టే ఆశయం కూడా ఉందని ప్రకటించారు.
 
 అలాగే కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డా కూడా 2017 నాటికి దేశంలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలన్నింటికీ పైప్‌లైన్‌ల ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు పంపితే నిధులు ఇస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్లోరోసిస్ వ్యాధి నివారణను కూడా చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఫ్లోరోసిస్ బాధిత తొమ్మిది తెలంగాణ జిల్లాలలో మూడింటిని 2013-14ల నుంచి జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోకి తెచ్చామని చెప్పారు. దీని ప్రకారం అవసరమైతే ఆపరేషన్లు, పునరావాసం, ఇతర వైద్య సదుపాయాలు కల్పిస్తారు. ఇవన్నీ శుభ పరిణామలే.
 
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి సరైన హామీ ఇచ్చారనే అనిపిస్తుంది. 2015 జనవరిలో ఎయిమ్స్ నిర్మాణానికి మంగళగిరిలో శంకుస్థాపన చేయనున్నట్టు కామినేని శ్రీనివాస్ చెప్పారు. కాబట్టి మొదటి నుంచీ ఫ్లోరోసిస్ వ్యాధి గురించిన పరిశోధన కూడా మంగళగిరి ఎయిమ్స్‌లో ఉండేటట్టు చర్యలు తీసుకోవడం అత్యవసరం. శుద్ధ మైన నీరు అందించడం ప్రభుత్వాలు ప్రాథమికంగా చేయగల కార్యక్రమం. అలాగే ఆకుకూరలు, పిల్లలకు పాలు సరఫరా చేసే కార్యక్రమం కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టాలి. ప్రజల్లో చైతన్యం అంతకంటే ప్రధానం.
(వ్యాసకర్త ప్రఖ్యాత వైద్యులు) మొబైల్: 98480 18660
- డాక్టర్  డి. రాజారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement