బోరుమంటున్నాయి
తెలంగాణలో అడుగంటిన భూగర్భజలాలు
38 మండలాల్లో దుర్భర పరిస్థితి, మరో 59 మండలాల్లో తీవ్ర ఎద్దడి
జాబితా రూపొందించిన రాష్ర్ట ప్రభుత్వం
దేశవ్యాప్తంగా తాగు నీటి సమస్యపై దృష్టి సారించిన కేంద్రం
కార్యాచరణపై నేడు రాష్ట్రాలతో సమావేశం.. కేటీఆర్ హాజరు
హైదరాబాద్: తెలంగాణలో భూగర్భ జలా లు అడుగంటుతున్నాయి. వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో తాగునీటికీ ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు పాతాళానికి చేరిన జలాలను వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫ్లోరైడ్‌తోపాటు పలు రకాల జబ్బులకు కారణమయ్యే మలినా లు, ఖనిజాల అవశేషాలు భూగర్భ జలాల్లో పెరిగిపోతున్నాయి. బావులు, బోర్లు ఎండిపోవడంతో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎందుర్కొం టున్న గ్రామీణ ప్రజలు సుదూరాలకు వెళ్లి చెలి మల్లో నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సి వస్తోం ది. ఇలాంటి బాధిత గ్రామాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కొన్ని చోట్ల తీవ్ర నీటి ఎద్దడి సర్వ సాధారణంగా కూడా మారింది. ఒక్క తెలంగాణ రాష్ర్టంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను తీర్చడానికి రాష్ర్ట ప్రభుత్వాలు సైతం ఎక్కువగా బోర్లపైనే ఆధారపడుతుండటంతో భూగర్భ జలాలు అందనంత లోతుల్లోకి చేరుతున్నాయి. మంచి నీటి పథకాలు రూపొందించే సమయంలో తాగునీటి వనరుల లభ్యతను పట్టించుకోకపోవడం వల్ల ప్రతి వేసవిలోనూ తాగునీటి సమస్య పునరావృతమవుతోంది. ఎక్కడికక్కడ దగ్గర్లోని చెరువులు, డ్యాములు, రిజర్వాయర్ల నుంచి గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ప్రస్తుతం తెలంగాణలోని ఆరు జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి.
వీటిలోని మండలాలను సమస్యాత్మకం, అతి సమస్యాత్మకం, దుర్భర మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి మండలాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్థిక సంవత్సరంలోనే 20 వేల ఆవాస ప్రాంతాలకు తాగునీటిని అందించే ందుకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ అంశంపై చర్చించడానికి సోమవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో రాష్ట్రాలతో సమావేశం జరగనుంది. ఆయా రాష్ట్రాల గ్రామీణ తాగునీటి శాఖల మంత్రులు దీనికి హాజరుకానున్నారు. రాష్ర్టం తరఫున మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు.
సమీప నీటి వనరుల నుంచే సరఫరా
తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మండలాల్లోని గ్రామాలకు దగ్గర్లోని డ్యామ్‌లు, భారీ చెరువుల నుంచి తాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు మరింతగా పడిపోతున్నందున కేంద్రం ఈ కార్యాచరణ చేపట్టింది. ఇకపై తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 20 వేల ఆవాస ప్రాంతాలకు ఉపరితల మార్గంలో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోని ప్రభావిత మండలాల జాబితాను రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో భూగర్భ జలాలు అతిగా వినియోగించిన 38 మండలాల్లో దుర్భర పరిస్థితులు ఉండగా, 14 మండలాలను అతి సమస్యాత్మకమైనవిగా, మరో 45 మండలాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఈ జాబితాలో ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని మండలాలే అధికంగా ఉన్నాయి.
ఐదేళ్లకు వంద కోట్లూ ఇవ్వలేదు
రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు సకాలంలో విడుదల అవుతాయనే ఉద్దేశంతో చేపట్టిన పథకాలు నిధులు లేక మధ్యలోనే ఆగిపోయాయి. ఐదేళ్లలో తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ తాగునీటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా రూ. 1128.50 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ. 99.89 కోట్లు మాత్రమే ఇచ్చింది.. ఇంకా రూ. 1,028.61 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో తొమ్మిది జిల్లాల్లో పలు పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు వినియోగించుకోవడం మినహా.. రాష్ట్రం తన వాటా నిధులు విడుదల చేయలేదు.