మంచినీరే మహాభాగ్యం | pure drinking water is the most precious thing | Sakshi
Sakshi News home page

మంచినీరే మహాభాగ్యం

Published Wed, Mar 16 2016 1:29 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

మంచినీరే మహాభాగ్యం - Sakshi

మంచినీరే మహాభాగ్యం

విశ్లేషణ

తెలంగాణలో పరిశుభ్రమైన మంచి నీటి వనరులు లేవు. భూగర్భ జలాలే ప్రధాన వనరు కావడం ఇందుకు కారణం. చాలా ప్రాంతాలలో చెరువుల ద్వారా లభించే ఉపరితల నీటి వనరులే ఇప్పటికి మంచివని తేలింది. ఫ్లోరైడ్ విషయం వరకు ఇది నిజమే. కానీ ఇలాంటి నీటిలో బాక్టీరియా సంబంధిత కాలుష్యం కలవర పరిచే స్థాయిలో ఉంది. నిజామాబాద్ జిల్లా జంగమపల్లె గ్రామంలో చేసిన ప్రయోగాల వల్ల ఇదే అంశం తేటతెల్లమైంది. నిజానికి బోర్వెల్ నీటితో ప్రజలు పెద్ద బెడదనే ఎదుర్కొంటున్నారు.

 

మానవ మనుగడకు నీరు అత్యంతావశ్యకమని అందరికీ తెలుసు. కానీ మంచి ఆరోగ్యానికి పరిశుభ్రమైన తాగునీరు కూడా అంతే ఆవశ్యకమన్న వాస్త వాన్ని గుర్తించవలసి ఉంది. ఆ వాస్తవాన్ని ఆచరణలో పెట్టవలసిన తరుణ మిది. తాగునీరు బాక్టీరియా సంబంధిత కాలుష్యం లేనిదై ఉండాలి. తాగు నీటిలో ఫ్లోరైడ్, ఆర్సెనిక్ (పాషాణ సంబంధమైనవి) వంటి రసాయనాల శాతం తగుమాత్రంగానే ఉండాలి. తెలంగాణ జిల్లాల వరకు మంచినీటి సమ స్యకు అనేక కోణాలు ఉన్నాయి. కానీ ఆర్సెనిక్ ఇక్కడ తీవ్రమైన సమస్య కాక పోవచ్చు. కానీ ఫ్లోరైడ్ రాష్ట్రానికి గడ్డు సమస్యగానే పరిగణించాలి. కలవరా నికి గురి చేసే స్థాయిలో ఇక్కడి నీటిలో ఫ్లోరైడ్ కనిపిస్తున్నది. తేనీరు, వంటకు ఉపయోగించే నీరు, ఇతర పానీయాల ద్వారా; తాగునీటి కారణంగా అధిక శాతం ఫ్లోరైడ్ దేహంలో ప్రవేశించడం వల్ల మనుషులను జీవచ్ఛవాలను చేసే ఆ వ్యాధి సంక్రమిస్తుంది.

 

పోషకాహార లోపం కూడా తన వంతు పాత్రను నిర్వహించి, ఫ్లోరోసిస్ విజృంభించడానికి ఆస్కారం కల్పిస్తున్నది. నిజానికి పశుపక్ష్యాదులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారతగడ్డ మీద ఫ్లోరోసిస్ తన విషపు గోళ్లను ఇప్పటికే ఎంత లోతుకు దింపేసిందో గణాంకాల ద్వారా చూస్తే గగుర్పాటు కలుగుతుంది. 21 రాష్ట్రాలకు చెందిన ఆరుకోట్ల అరవై లక్షల మంది భారతీయులు దీని కోరలకు అతి సమీపంగా ఉన్నారు. అరవై లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడి శరీరం శిథిలమై, ఎముకలు బలహీనమై మంచమెక్కారు. కాబట్టి భారతదేశానికి సంబంధించి ఫ్లోరోసిస్ వ్యాధి ప్రజారోగ్యానికి అతి పెద్ద బెడదలలో ఒకటిగా మారిపోయిందన్న మాట తిరుగులేని వాస్తవం. అలాగే తెలంగాణలో కూడా.

 

ఫ్లోరోసిస్ గ్రామీణ తెలంగాణ పాలిట శాపంగా మారింది. అక్కడ పోషకాహార లోపం చాలా ఎక్కువ. అందుకే ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. రక్షిత మంచినీటి సరఫరా లేకపోవడం వల్ల బాక్టీరియా సంబంధిత కాలుష్యం ఉన్న నీటి వినియోగం కూడా అక్కడ ఎక్కువే. ఇది కూడా ప్రజారోగ్యానికి సమస్యగా పరిణమించింది. సురక్షితం కాని నీరు వినియోగించడం వల్ల ప్రజలు అతిసారం లేదా విరేచనాల బారిన పడుతున్నారు. ఈ బాధతో మృత్యువాత పడుతున్నవారు దేశంలో 8.1 శాతం ఉన్నారు. అంటే వ్యాధులతో మరణిస్తున్న భారతీయులలో దీని కారణంగా మరణిస్తున్నవారు మూడో స్థానంలో ఉన్నారు. ఇ. కొయిలీ గణన విధానం ద్వారా నీటి వనరులలో బాక్టీరియా సంబంధిత కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. నీటిలో ఫ్లోరైడ్ స్థాయిని గమనించడానికి కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక విధానం ఉంది. ఇది నెట్‌లో దొరుకుతుంది.

 

కొన్ని కొత్త సంగతులు

తెలంగాణలో లభ్యమవుతున్న నీటి గురించిన కొన్ని మౌలిక సత్యాలను చర్చించుకోవాలి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో వినియోగంలో ఉన్న నీరం తటా- ఎక్కువో, తక్కువో ఫ్లోరైడ్ ఉంది. జిల్లాలలో ప్రజలు ప్రస్తుతం వినియోగిస్తున్న నీటి నమూనాలు తీసుకుని అందులో ఫ్లోరైడ్ స్థాయిని ఇటీవల లెక్కించడం జరిగింది. ఇందుకోసం 10,368 నమూనాలు సేకరిం చారు. ఆదిలాబాద్ (297), కరీంనగర్ (1,322), ఖమ్మం (914), మహబూ బ్‌నగర్ (872), మెదక్ (616), నల్లగొండ (3,178), నిజామాబాద్ (203), రంగారెడ్డి (1,219), వరంగల్ (1,747) జిల్లాలలో అవసరం మేరకు వీటిని సేకరించారు. మంజీర, కృష్ణ, గోదావరి జలాలు నగరానికి అందుబాటులో ఉండడం వల్ల, వాన నీటి జలాశయాలు ఉన్నందువల్ల హైదరాబాద్ నగర పరిస్థితిని ఈ అధ్యయనంలో కలపలేదు. వీటిలో ఫ్లోరోసిస్ శాతాన్ని పార్ట్స్ పెర్ మిలియన్ (పీపీఎం) ప్రమాణంతో చూస్తారు. ఇది కనిష్టంగా 0.5 మించరాదు. కానీ ఈ పదివేల పైబడిన నమూనాలు వేటిలోనూ ఈ పీపీఎం 0.5 దగ్గర లేనేలేదు. అన్ని నమూనాలలోను కనిష్టంగా 1.51గా పీపీఎం నమోదైంది. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 297 నమూనాలనే తీసుకున్నారు. ఆ సమస్యతో తీవ్రంగా బాధ పడుతున్న నల్లగొండ జిల్లా నుంచి సహజంగానే ఎక్కువ నమూనాలను సేకరించారు. అయితే విచిత్రంగా ఆదిలాబాద్ సమస్య నల్లగొండను మించి పోయిందని రూఢీ అయింది. తరువాత వరసగా రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాలు తీవ్రత విషయంలో ముందు ఉన్నాయి.

 

1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాటి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్) అధిపతి డాక్టర్ శ్రీకాంతయ్య ఆధ్వర్యంలో ఈ అంశం మీద గోష్టి ఏర్పాటయింది. అందులో కూడా పీపీఎం 0.5కు మించరాదనే నిర్ధారించారు. భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాణమైనా ఒక శాతం పీపీఎం. కానీ, 1970లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్లోరోసిస్ మీద ప్రచురించిన పుస్తకం కోసం రాసిన వ్యాసంలో  ప్రఖ్యాత వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ సిద్దికీ ఒక శాతం పీపీఎం ఉన్న నీటితో కూడా తీవ్ర పరిణామాలు ఎదురైన సంగతి తన అనుభవంలో ఉందని పేర్కొన్నారు. శీతల దేశం కాబట్టి మన పక్కనే ఉన్న చైనా పీపీఎం శాతాన్ని 0.7 వరకు భరించవచ్చునని లక్ష్మణరేఖ పెట్టుకుంది. మనది వేడి దేశం కాబట్టి 0.5 శాతం పీపీఎం మించరాదన్నదే ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం.

 

పరిశుభ్రమైన నీటి వనరులు లేవు

 మొత్తానికి తేలేదేమిటంటే, తెలంగాణలో పరిశుభ్రమైన మంచి నీటి వనరులు లేవు. భూగర్భ జలాలే ప్రధాన వనరు కావడం ఇందుకు కారణం. చాలా ప్రాంతాలలో చెరువులు ద్వారా లభించే ఉపరితల నీటి వనరులే ఇప్పటికి మంచివని తేలింది. ఫ్లోరైడ్ విషయం వరకు ఇది నిజమే. కానీ ఇలాంటి నీటిలో బాక్టీరియా సంబంధిత కాలుష్యం కలవరపరిచే స్థాయిలో ఉంది. నిజామాబాద్ జిల్లా జంగమపల్లె గ్రామంలో చేసిన ప్రయోగాల వల్ల ఇదే అంశం తేటతెల్లమైంది. ఇక్కడ మూడు చెరువులు, మూడు దిగుడు బావులు, మూడు బోర్వెల్స్‌లోని భూగర్భ జలాలను పరీక్షించారు. వీటిలో ఫ్లోరైడ్ శాతం 0.56, 0.63, 0.26, 0.67 - ఇదే ప్రమాణాలలో కనిపించింది. ఒక బోర్వెల్ నీటిలో మాత్రం 1.39 ఫ్లోరైడ్ కనిపించింది. ఈ బోర్వెల్ నీరు తాగుతున్న ప్రజలకు ఆ వ్యాధి బెడద ఉంది. మొత్తంగా చూస్తే జంగమపల్లెలో ఈ సమస్య లేదు.

 

నిజానికి బోర్వెల్ నీటితో ప్రజలు పెద్ద బెడదనే ఎదుర్కొంటున్నారు. ఒకే గ్రామంలో రెండు చోట్ల బోర్వెల్స్ నీటిని పరీక్షిస్తే ఫ్లోరైడ్ శాతం వేర్వేరుగా ఉంది. నల్లగొండ జిల్లా ఎల్లారెడ్డిగూడలో ఒక బోర్వెల్ నీటిలో 1.45 నుంచి 8.8 పీపీఎం కనిపించింది. ఇలాంటి చోట ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉన్న బోర్వెల్ నుంచి నీరు తాగడం తప్పనిసరి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే తేనీటిని కూడా తీసుకోకపోవడం ఉత్తమం. కాబట్టి ప్రతి బావి దగ్గర ఫ్లోరైడ్ ఏ మేరకు ఉన్నదో తెలియచేసే బోర్డులు పెట్టి, ఆ మేరకు ప్రజలలో చైతన్యం తీసుకు రావలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఫ్లోరైడ్ ఉన్న నీటిని నేరుగా తీసుకుంటేనే ఫ్లోరోసిస్ వస్తుందనుకుంటే పొరపాటు. వంట కోసం ఉపయోగించినప్పటికీ సమస్య తప్పదు.

 

ఏ విధంగా చూసినా భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని నివారణ చర్యలను గురించి వెల్లడించడం అవసరం. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ -సి చాలి నంతగా తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అవసరమైన మేర కాల్షి యం తీసుకుంటే దేహంలో తిష్ట వేసిన ఫ్లోరైడ్‌ను తగ్గిస్తుంది. పెరిగే పిల్లల కోసం ఇది మరింత అవసరమని గుర్తించాలి. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెప్పాలి. ఈ సమస్యను తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్న రాష్ట్రా లలో ఇదొకటి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ -సిలను ఉపయోగించడం వల్ల వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్న చిన్నారులు కూడా ఉపశమనం పొందగలి గారు. ఫ్లోరైడ్ బెడద లేని ఉపరితల నీటిని ప్రజలకు అందించాలని ఈ మధ్య ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనించదగినది.

 

కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపడుతు న్నాయి. సంక్షేమం ఇదివరకటి కంటే కొత్త రూపాన్నీ, విస్తృతినీ సంతరించు కుంది కూడా. ప్రభుత్వాల దృష్టి ఇంత విశాలమైనప్పుడు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజల జవజీవాలను తోడేస్తున్న ఈ సమస్య గురించి ఆలోచించక పోవడం మంచిది కాదు.  నగరవాసులకైనా, గ్రామీణ ప్రాంతాలకైనా ఆరోగ్య భద్రత సమంగానే ఉండాలి. రక్షిత మంచినీరో, పరిశుభ్రమైన నీరో పట్టణా లకూ, నగరాలకూ పరిమితం చేయడం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. జీవనదుల నుంచి ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడమే సమస్య పరిష్కారానికి ఉన్న గొప్ప అవకాశం. వాన నీటిని పదిలం చేసే ప్రక్రియను ప్రోత్సహించడం మరొకటి. 1975 నుంచి తీవ్రతను చూపుతున్న ఈ వ్యాధిని నిరోధించడం ఉద్యమ ప్రాతిపదికన జరగాలి. నిరంతర పరిశోధన నేటి అవసరం. ఇందుకు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి. కొత్త నీటి ఒప్పందాలు జరుగుతున్నాయి. తెలంగాణ నేల సస్యశ్యామలమవుతుందని అంతా ఆశిస్తున్నారు. నేల పచ్చగా ఉండడంతో పాటు, ప్రజలు కూడా ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే సమగ్ర అభివృద్ధికి అర్థం.

 

- డా.దేమె రాజారెడ్డి

 (వ్యాసకర్త ప్రముఖ వైద్యులు. ఫ్లోరోసిస్ పరిశోధకులు)

 98480 18660

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement