* లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా వెల్లడి
* ఎంపీ సీతారాం నాయక్ ప్రశ్నకు మంత్రి సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం కింద ఫ్లోరైడ్ సమస్య ఉన్న జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని చెబుతున్నందున ఆయా ప్రాం తాల్లో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలి పారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విష యం చెప్పారు.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, అనేకమంది శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారని సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య నుంచి ప్రజలను రక్షించడానికి వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టిందని, దీనికి కేంద్రం ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సమాధానమిస్తూ, దేశంలో సుమారు 230 జిల్లాల్లో ఈ సమస్య ఉందని తెలిపారు.
రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని వివరించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్లోరోసిస్ నివారణ పథకం అమలులో ఉందని చెప్పారు. 2017 నాటికి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలన్నిటికి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తు తం 3 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ పథకం అమలులో ఉందని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో రివర్స్ ఆస్మోసిస్(ఆర్‌వో) విధానంలో నీటిని శుద్ధి చేస్తుందని తెలిపారు. వాటర్ గ్రిడ్‌క సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు.
‘ఫ్లోరైడ్’జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం నిధులు
Published Sat, Dec 20 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement