Sitaram Naik
-
గిరిజనుల దేవుడు సీఎం వైఎస్ జగన్..మాజీ ఎంపీ ప్రశంసలు
-
టికెట్ రాకపోవడం బాధాకరం
మహబూబాబాద్: మహబూబాబాద్ ఎంపీ టికెట్ తనకు రాకపోవడం బాధాకరమని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ.. తనకు టికెట్ రాకపోవడం బాధాకరమంటూ కంటతడి పెట్టారు. వెంటనే మంత్రి దయాకర్‌రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆయనను ఓదార్చారు. అనంతరం సీతారాంనాయక్ మాట్లాడుతూ... పార్లమెంట్లో అనేక సమస్యలను ప్రస్తావించానని అన్నారు. టికెట్ విషయంలో తన పనితనం చూడకుండా సర్వేల పేరుతో అన్యాయం చేశారన్నారు. అయినా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, పార్టీ ఎంపీ అభ్యర్థి విజయానికి సహకరిస్తారనని అన్నారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తారన్నారు. అందుకు సత్యవతి రాథోడ్, కవితలే నిదర్శనమని పేర్కొన్నారు. -
‘రామప్ప’ అభివృద్ధికి సహకరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్‌ను ఎంపీ సీతారాం నాయక్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి కోరారు. సోమవారం ఢిల్లీలో వారు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన ‘ప్రసాద్’పథకంలో రామప్ప ఆలయం, రామప్ప చెరువును కూడా చేర్చాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. స్వదేశీదర్శన్ పథకంలో ట్రైబల్ సర్క్యూట్లో రామప్పను చేర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సందర్శకులతో కళకళలాడుతున్న రామప్ప చెరువులో విహారానికి రెండు హౌజ్ బోట్లను మంజూరు చేయాలని విన్నవించారు. రామప్ప ఆలయాన్ని హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తించాలని, ట్రైబల్ సర్క్యూట్లో ములుగు, లక్నవరం, తాడ్వాయి మేడారం, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం మాత్రమే ఉన్నాయని, ఈ పథకంలో రామప్పను చేర్చితే రామప్ప ఆలయం అభివృద్ధి చెందుతుందని సూచించారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రికి విన్నవించార -
అప్రజాస్వామికంగా లోక్‌సభ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభను కేంద్రం నడుపుతున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని, ప్రతి రోజూ ఉదయం 11 నుంచి 12.. 12 నుంచి రేపు అన్న రీతిలో సభను నడుపుతోం దని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రం ప్రకటన చేసే వరకు తమ నిరసన విరమించబోమన్నారు. బుధవారం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై చర్చకు తమ మద్దతు ఉంటుందని, వైఎస్సార్సీపీ, టీడీపీల పోరాటం కోసం తమను బలిచేయొద్దన్నారు. స్పీకర్‌ను కలసిన టీఆర్ఎస్ ఎంపీలు.. లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం భేటీ అయ్యారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్ లోక్‌సభలోని ఆమె చాంబర్లో కలిశారు. రిజర్వేషన్ల పెంపుపై తాము సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి ఆందోళన చేస్తున్నామని, దీనిపై సభలో కేంద్రంతో ఒక నిర్ధిష్ట ప్రకటన చేయించాలని కోరారు. -
రిజర్వేషన్ల పెంపు చరిత్రాత్మకం
ఎంపీలు సీతారాం నాయక్, బాల్క సుమన్ సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల పెంపు చరిత్రాత్మక మని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొ న్నారు. ఆదివారం అసెంబ్లీకి వచ్చిన ఎంపీలు సీతారాం నాయక్, బాల్క సుమన్‌లు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, రిజర్వేషన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. వాల్మీకి బోయ, కాయితి లంబాడీలను గిరిజ నుల రిజర్వేషన్ జాబితాలో చేర్చడాన్ని ఆహ్వానిస్తున్నామని సీతారాం నాయక్ పేర్కొన్నారు. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ అడ్డుపడిందని, అయితే బిల్లుపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో సభలో లేకుండా ఆ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుందని అన్నారు. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన ఈ బిల్లును కేంద్రం ఆమోదించేలా ఎంపీలంతా కలసి కృషి చేస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారమే ఈ బిల్లును తెచ్చారని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంబేడ్కర్ సిద్ధాంతానికి తూట్లు పొడుస్తోందని విమర్శిం చారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తోందని ఆరోపిం చారు. బీజేపీ తన తీరు మార్చుకోకపోతే 90 శాతం వర్గాలు తగిన గుణ పాఠం చెబుతాయని హెచ్చరించారు. -
కాంగ్రెస్‌ది అమ్ముడు పోయిన చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కోసం పోరాడకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు అమ్ముడుపోవడం వల్లే రాష్ట్ర సాధన ఆలస్య మైందని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి సీఎం చేసిన దీక్షపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నా టీజేఏసీ ముసుగులో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి విమర్శించారు. 2016–17 ఏడాదిలో వివిధ విభాగాల్లో 5,936 పోస్టులను భర్తీ చేసిందని, మరో 11,086 ఉద్యోగాల భర్తీకి మార్చిలో నోటిఫికేషన్ జారీ చేయనున్నదని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేటు రంగంలో 44 వేల ఉద్యోగాలు కల్పించినట్టు ఆయన తెలిపారు. -
గిరిజనుల సమస్యలు పరిష్కరించండి
కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ సీతారాం నాయక్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జ్యుయల్ ఓరంను ఎంపీ సీతారాం నాయక్ కోరారు. తెలంగాణలో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్టోబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న జాతీయ ట్రైబ్స్ కార్నివాల్లో తెలంగాణ గిరిజనుల సంస్కృతి నృత్యాలు ప్రదర్శించడానికి అనుమతినివ్వాలని కోరారు. గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించి గిరిజన సంక్షేమానికి సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు ఎంపీ తెలిపారు. -
‘ఇజ్జత్ స్కీమ్‌లో లోపాలు సవరించండి’
నెలకు రూ. 1500 లోపు ఆదాయం ఉన్న వారు నెలకు రూ. 20 ఖర్చుతో వంద కిలోమీటర్లలోపు రైల్లో ప్రయాణం చేసేందుకు వీలుగా కేంద్రం తెచ్చిన ఇజ్జత్ పథకంలో లోపాలను సవరించాలని టీఆర్ఎస్ ఎంపీ ప్రొఫెసర్ ఎ.సీతారాంనాయక్ కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన ఈ అంశాన్ని లోక్‌సభ జీరోఅవర్‌లో ప్రస్తావించారు. 2013 వరకు ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలకు అధికారం కల్పించారని, అయితే 2013 తరువాత రైల్వే అధికారులకు దీనిని కట్టబెట్టారని పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులకు ఈ అధికారాన్ని కట్టబెట్టడం ద్వారా పేదలకు ఈ పాస్ అందుబాటులోకి తేవాలని కోరారు. అలాగే వార్షిక ఆదాయం రూ. 18,000 పరిమితిగా ఉందని, దీనిని రూ. లక్షకు పెంచాలని కోరారు. -
‘ఫ్లోరైడ్’జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం నిధులు
* లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా వెల్లడి * ఎంపీ సీతారాం నాయక్ ప్రశ్నకు మంత్రి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం కింద ఫ్లోరైడ్ సమస్య ఉన్న జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని చెబుతున్నందున ఆయా ప్రాం తాల్లో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలి పారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విష యం చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, అనేకమంది శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారని సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య నుంచి ప్రజలను రక్షించడానికి వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టిందని, దీనికి కేంద్రం ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సమాధానమిస్తూ, దేశంలో సుమారు 230 జిల్లాల్లో ఈ సమస్య ఉందని తెలిపారు. రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని వివరించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్లోరోసిస్ నివారణ పథకం అమలులో ఉందని చెప్పారు. 2017 నాటికి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలన్నిటికి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తు తం 3 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ పథకం అమలులో ఉందని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో రివర్స్ ఆస్మోసిస్(ఆర్వో) విధానంలో నీటిని శుద్ధి చేస్తుందని తెలిపారు. వాటర్ గ్రిడ్క సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. -
జనాభా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు పెంచాలి
* లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ సాక్షి, న్యూఢిల్లీ: జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లను పెంచాలని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ కేంద్రాన్ని కోరారు. ఎస్సీ జాబితాలో మరికొన్ని కులాలను చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ చట్టానికి సవరణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. గురువారం లోక్‌సభలో ఎస్సీ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా కులాలను ఎస్సీ జాబితాలో చేర్చితే సరిపోదని, ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుతున్నారా.. లేదా.. అన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కొత్త కులాలను చేర్చినప్పుడు రిజర్వేషన్లను సర్దుబాటు చేయకుండా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
చదువుల తోట..
సీతారాంనాయక్.. ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీ. దేశఅత్యున్నత చట్టసభలో సభ్యుడు. మొన్నటి వరకు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్. యూనివర్సిటీ నుంచి లోక్‌సభకు వెళ్లిన సీతారాంనాయక్.. మళ్లీ ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానం.. యూనివర్సిటీలో పరిస్థితులపై విద్యార్థి నాయకులతో, అధ్యాపకులతో ‘సాక్షి’ ప్రతినిధిగా ముచ్చటించారు. ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ : తెలంగాణ సాధన ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర సృష్టించిన మాట వాస్తవం. తెలంగాణలో విశ్వవిద్యాల యాలు, విద్యార్థులు, అధ్యాపకులు ఎలా ఉండాలి? మీరు ఏం కోరుకుంటున్నారు? బి.వీరేందర్(పార్ట్ టైం లెక్చరర్) : సమైక్య రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు పీజీలు, పీహెచ్డీ పట్టాలు తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారు. వీరికి చదువుల తోటఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకురావాలి. సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలోని చట్టాలే ఇప్పుడు ఉన్నారుు. అప్పటి ఉమ్మడి విధానమే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మోహన్‌రాజ్(టీఎఫ్ఏడీ అధ్యక్షుడు) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ప్రత్యేక రాష్ట్రంతో ఆ ఫలాలు అందుతాయని విద్యార్థులు త్యాగం చేసిండ్లు. కొత్త ప్రభుత్వం నాణ్యమైన విద్యను, కొఠారి కమిషన్ ప్రకారం కామన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిని అడ్డుకోవాలి. విద్యార్థులకు ఎన్నికలు జరగాలి. దీనివల్ల రాజకీయంగా చైతన్యమవుతారు. సీతారాంనాయక్ : కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు చేస్తున్నాయి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? చల్లా శ్రీనివాస్(కుర్సా అధ్యక్షుడు) : భారతీయ విద్యా విధానం ఇప్పటివరకు శాస్త్రీయంగా ఉంది. పెట్టుబడిదారీ విధానం మన విద్యా విధానంలోకి వస్తే మన విద్య కుంటుబడుతుంది. మన విద్యార్థుల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల వారు. గ్రామీణ విద్యార్థి ఒకేసారి పెట్టుబడిదారీ విధానానికి అలవాటుపడలేదు. మన ఆచార, సంస్కృతి కూడా భ్రష్టుపడుతుంది. సీతారాంనాయక్ : అటానమస్పై మీ అభిప్రాయం ఏమిటి? డిగ్రీ కాలేజీలకు విశ్వవిద్యాలయంతో సంబంధం ఉండదు? ప్రైవేటు కాలేజీలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని అంటున్నారు? కొంగర జగన్(కుర్సా వర్కింగ్ ప్రెసిడెంట్) : ప్రైవేటు కాలేజీలకు అటానమస్ ఇస్తే విద్య ప్రైవేటు పరమవుతుంది. దీనివల్ల విద్యా వ్యవస్థ, విద్యా విధానం ప్రైవేటు పరమైపోతాయి. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. పీజీ సెంటర్లకు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి ఇస్తే బాగుంటుంది. అకడమిక్ విద్య దెబ్బతినదు. ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఉండదు. విద్య అనేది ప్రభుత్వమే నిర్వహించాలి. సీతారాంనాయక్ : కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, ఇక్కడ ఉన్న కొన్ని పేరున్న సంస్థలు.. అప్‌గ్రేడ్ చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా చేయాలని కోరుతున్నారుు? దీనిపై మీ అభిప్రాయం? ఎం.చిరంజీవి(పీడీఎస్‌యూ) : ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పోరాటం చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రూ.వేల కోట్లతో వ్యాపారం చేస్తున్నాయి. ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇవ్వొద్దనేది మా అభిప్రాయం. సీతారాంనాయక్ : పీహెచ్డీ పూర్తి చేసిన వారు ప్రైవేటు కాలేజీల్లో నామమాత్రపు జీతాలకు పని చేస్తున్నారు. విద్యార్థులకు క్యాలిబర్‌ను బట్టి ఉపాధి దొరికే పరిస్థితి ఉంది. మీరు ఎలాంటి కోర్సులు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? ఓడపెల్లి మురళి(టీబీఎస్ఎఫ్) : అన్ని ప్రభుత్వాలు సైన్స్ గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్ట్స్ గ్రూపులు తీసివేయాలని ప్రయత్నించారు. అప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల ఇక్కడ ఆర్ట్స్ గ్రూపులు అలాగే ఉన్నారుు. ఆర్ట్స్ గ్రూపులతో ఉపాధి కల్పించే సంస్థలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాసుదేవరెడ్డి(టీఆర్ఎస్వీ): బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే విద్యా విధానంలో మార్పులు చేయాలి. సమైక్య రాష్ట్రంలో భారీగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల కోర్సులకు డిమాండ్ తగ్గింది. ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి. నాణ్యత కొరవడింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన వారు నైపుణ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యంకాదు కాబట్టి వృత్తి విద్యా కోర్సులు రావాలి. హైదరాబాద్‌లో ఇప్పటికే సాఫ్ట్వేర్, ఇతర పరిశ్రమలకు పనికి వచ్చే నిపుణత కలిగే కోర్సులను తీసుకురావాలి. ఎంబీబీఎస్లాగే.. ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు కాలేజీలకు, పరిశ్రమలకు అనుబంధం ఉండాలి. సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు విద్యా, ఉపాధి పరంగా ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మీరేం ఆశిస్తున్నారు? వలీ ఉల్లాఖాద్రీ(ఏఐఎస్ఎఫ్) : సమైక్య రాష్ట్రంలో యూనివర్సిటీల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ విషయంలో ప్రతిసారి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను పట్టించుకోలేదు. ఇలాంటి అన్యాయాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా, కేయూలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించాలి. ఉపాధి, జానపద కళలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు ఉండాలి. సీతారాంనాయక్ : కాంట్రాక్టు ఉద్యోగ విధానం ఎందుకొచ్చింది? దీనివల్ల ప్రయోజనాలు ఏమిటీ? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి? దుర్గం సారయ్య(పీడీఎస్‌యూ) : చంద్రబాబు హయూంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేక.. కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చారు. కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం చేస్తున్న వారు.. కుటుంబానికి తిండిపెట్టలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి. విద్యా, ఉపాధి విషయాలు ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. సీఎం కొడుకు, పేద పిల్లవాడు ఒకేచోట చదివేలా కామన్ విద్యా విధానం ఉండాలి. సీతారాంనాయక్ : ప్రాథమిక విద్యా ఎలా ఉండాలి? కులాల పేర్లతో హాస్టళ్లు ఉన్నాయి. ఇలా ఉంటే విద్యార్థుల్లో న్యూనత భావం ఏర్పడుతుంది. దీనిని ఎలా చేస్తే బాగుంటుంది? సుత్రపు అనిల్(పీడీఎస్‌యూ) : ప్రాథమిక విద్య అనేది కుల, మత బేధం లేకుండా అందరికీ ఒకే విద్యా విధానం ఉండాలి. ప్రస్తుతం ప్రీప్రైమరీ, ఆశ్రమ, గురుకుల, సాంఘిక సంక్షేమం, ఐటీడీఏ స్కూళ్లు ప్రాథమిక విద్యలో 12 రకాలు ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో ఈ విధానాన్ని మార్చాలి. ఉపాధ్యాయులకు కూడా ఏకీకృత సర్వీసు రూల్స్‌ను తీసుకురావాలి. సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లో హాస్టల్స్‌పై మీ అభిప్రాయం ఏమిటీ? హాస్టళ్ల ప్రైవేటీకరణ ఉండాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎలా ఉంటే బాగుంటుంది? మాతంగి మురళి(టీఎన్ఎస్ఎఫ్) : తెలంగాణలోని యూనివర్సిటీల్లో చదుకునేవారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే. కాంట్రాక్టు, ప్రైవేటు మెస్ విధానాల వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోంది. రంజిత్(టీఆర్ఎస్వీ) : వర్సిటీల్లో గ్రామీణ, పేద విద్యార్థులే ఉంటున్నారు. విద్యార్థులతో మెస్ కమిటీలు లేకపోవడం వల్ల ప్రైవేటు కాంట్రాక్టర్లు లాభమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ పెడితే బాగుంటుంది. సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అపాయింట్మెంట్లు జరగడం లేదు. వీసీలుగా వచ్చిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయి. నాట్ టీచింగ్ రిక్రూట్మెంట్ విషయంలో ఎలా వ్యవహించాలి? పి.కొండల్‌రెడ్డి(ఉద్యోగుల జేఏసీ చైర్మన్) : ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్‌లో అర్హత, నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు రావాలి. కేయూలో ఏడాదిగా నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జరగలేదు. వైస్ చాన్సలర్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఉండాలి. దీని వల్ల అక్రమాలను నివారించవచ్చు. సీతారాంనాయక్ : వర్సిటీలో వీసీలను ఘెరావ్ చేయడం లేదా రిజిస్ట్రార్లను బయటపెట్టడం తరచుగా చూస్తున్నాం. ఇలాంటి గొడవలకు కారణమేమిటీ? కె.శంకర్(ఎన్జీవోస్, కేయూ, అధ్యక్షుడు) : వ్యవస్థ అన్నప్పుడు అన్ని రకాల వ్యక్తులు ఉంటరు. యూనివర్సిటీలోనూ స్వార్థపరులు ఎక్కువైనప్పుడు పరిపాలన సరిగా ఉండదు. ఉన్నతాధికారులు పరిపాలన విషయంలో నిక్కచ్చిగా ఉంటే ఏమీ జరగదు. కేయూలో నియామకాలు, బదిలీలు పారదర్శకంగా జరగడంలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటిని మార్చుకోవాలి. సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయం పరిరక్షణ విషయంలో అకుట్ ఏ రకమైన బాధ్యత నిర్వర్తిస్తోంది? డాక్టర్ వెంకయ్య(అకుట్) : ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో అకుట్ ముందుంటోంది. ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతుంటే మేం స్పందించి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు లేఖలు రాశాం. సీతారాంనాయక్ : కేయూలో ఉత్తరాలు రాయడం మొదటి నుంచి ఉంది. ఉత్తరాలు రాస్తే ప్రయోజనం ఏమిటి? కేయూ భూమి 554 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 500 ఎకరాలు కూడా లేదు. భూ ఆక్రమణల విషయంలో మీరు ముందుండడం లేదు? డాక్టర్ వెంకట్ : గతంలో పరిపాలన పరంగా తప్పులు దొర్లారుు. యూనివర్సిటీ వైపు నుంచి సరైన చర్యలు తీసుకోలేదు. వీసీ, రిజిస్ట్రార్ సరిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సీతారాంనాయక్ : వాళ్లు చేయలేదు సరే. మీరేం చేశారు? అకుట్గా మీరు చేయాల్సి ఉండె కదా? డాక్టర్ వెంకట్ : జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. ఐదు నెలలుగా వీసీ లేరు. దీనిపై మా వంతుగా చర్యలు చేపడుతాం. సీతారాంనాయక్ : దూరవిద్య అనేది యూనివర్సిటీ నిధుల పరంగా ఉత్పత్తి కేంద్రం. ఎస్డీఎల్సీఈలో అక్రమాలు జరుగుతున్నాయని చాలాసార్లు పేపర్లలో చూస్తుంటాం. ఇలాంటివి జరుగుతాయా? జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వల్లాల తిరుపతి(ఉద్యోగి) : యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఎస్డీఎల్సీఈని నడుపుతోంది. కొందరు అధికారులు మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ బంగారుబాతులాగే చూస్తున్నారు. రెవెన్యూ తీసుకుంటున్నారుగానీ, అక్కడ ప్రక్షాళన జరగడం లేదు. సీతారాంనాయక్ : మీకూ అధికారాలు ఉన్నారుు కదా? డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ అందరు ఉన్నారు కదా? అలాంటివి ఎందుకు జరుగుతాయి. అపనిందలు ఎందుకు వస్తాయి? వల్లాల తిరుపతి : వీరికి నామమాత్రపు అధికారాలే ఇచ్చారు. ఏదీ చేయాలన్నా మళ్లీ వీసీ, రిజిస్ట్రారు అనుమతి తీసుకోవాల్సిందే. సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లోని పరిశోధనల విషయంలో నానారకమైన భావనలు వ్యక్తమవుతున్నాయి. సూపర్వైజర్ల లోపం ఏమైనా ఉందా? ఇటీవల కొత్త నామ్స్ వచ్చాయి. గైడ్‌గా నియమించిన వారి వద్దే విద్యార్థి పరిశోధన పూర్తి చేయాలని ఉంది. ఇది మంచిదా? పాత విధానమే మంచిదా? డాక్టర్ ముస్తఫా(అసిస్టెంట్ ప్రొఫెసర్) : పరిశోధనకు సంబంధించిన విద్యార్థులకు మెరిట్ కంటే ముఖ్యంగా ఆసక్తి ఉండాలి. ఎవరికీ బిగినింల్లో ఏమీ రాదు. నేర్చుకుంటే అనుభవపరంగా ఎంతో వస్తుంది. ఆసక్తి ఉన్న వారికే అవకాశం కల్పించాలి. ప్రొఫెసర్ తెలిసిన విద్యార్థులకు గైడ్లుగా ఉంటే మంచిది. కొత్త వారితో అయితే కొంత గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న వసతులు సరిపోవు. ఉన్నత ప్రమాణాలతో ఉండాలి. దీని కోసం ప్రయత్నించాలి. -
బంజారాల అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం
భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బంజారాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామని మానుకోట ఎంపీ సీతారామ్ నాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రు నాయక్ అన్నారు. భద్రాచలంలోని హతీరాం బావాజీ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం భోగ్‌బండారో ఆత్మీయ సభ జరిగింది. అతిధిలుగా వీరిద్దరూ పాల్గొన్నారు. సభలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 35లక్షల వరకూ బంజారా జాతి ఉందన్నారు. సమైక్య రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా బంజారాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని అన్నారు. వీరిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకు ఆదరణ చూపుతోందని అన్నారు. ఇందులో భాగంగానే 500 జనాభాగల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపారని అన్నారు. తెలంగాణ అమర వీరులలో 60 మంది బంజారాలే ఉన్నట్టు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది బంజరా ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరంతా జాతి అభివృద్ధికి పాటుపడతారని అన్నారు. భద్రాచలంలో హతీరాం మఠం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రాద్రి ఆల యాన్ని సందర్శిస్తున్న ప్రతి వందమందిలో 30 మంది బంజారాలే ఉంటున్నట్టుగా తేలిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ హతీరాం మఠాన్ని అభివృద్ధి చేస్తామని, భక్తులకు వసతి కోసం సత్రాల నిర్మాణానికి నిధులు విడుదలయ్యే లా చూస్తామని అన్నారు. భద్రాచలం కేంద్రంగా బంజారా కల్చర్ హట్‌గా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీని కోసం భద్రాచలం ప్రాంతంలో రెండెకరాలు భూమి కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు చెప్పారు. బంజారా ఆడబిడ్డలు తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో జరుపుకునే తీజ్ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పండుగ రోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రభత్వాన్ని కోరారు. వారు హతీరాం బావాజీకి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కు చెందిన వైరా, ములుగు ఎమ్మెల్యేలు మదన్‌లాల్, చందూలాల్, సభ నిర్వాహకులు హరిశ్చంద్ర నాయక్, భద్రాచలం సర్పంచ్ శ్వేత పాల్గొన్నారు. -
అణగదొక్కాలని చూస్తే ఊరుకోం
ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ వీరయ్య, సీతక్క పద్ధతి మార్చుకోకుంటే ఓడిస్తాం గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : జాతిని అభివృ ద్ధి చేసుకోవడం ఎవరికైనా బాధ్యతే.. అలా అని ఇతరులను అణగదొక్కాలను కోవడం మూర్ఖత్వం అవుతుంది.. గిరిజనులను అణగదొక్కాల ని చూస్తే ఊరుకునేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ అన్నా రు. ఎల్‌హెచ్‌పీఎస్ మండల అధ్యక్షుడు రసపూత్ సీతారాం నాయక్ అధ్యక్షతన ‘తెలంగాణ పునర్నిర్మాణం-గిరిజనుల డిమాండ్లు’ అనే అంశంపై శనివారం స్థానికంగా నిర్వహించిన గిరిజన గర్జన సభలో ఆయన మాట్లాడారు. అన్నింటినీ లంబాడీ లు తినేస్తున్నారనేది కేవలం అపోహ మాత్రమేనని, గిరిజనుల హక్కులతోపాటు గిరిజనేతరు ల హక్కులను కూడా కాపాడాలన్నారు. కోయల అభివృద్ధి జరగాలని తాము కూడా కోరుకుం టున్నామని, అందుకోసం మిగతా తెగలను తొక్కేయాలన్న భావన సరికాదన్నారు. పొదెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉండగా ఇద్దరు లంబాడీ సర్పంచ్‌లను కొట్టాడని, దాంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఓటమికి కృషి చేశామని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క సైతం తమ జాతిని అణగదొక్కే విధానాలను అవలంభిస్తోం దని ఆరోపించారు. వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాతే ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వమని హెచ్చరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించే లంబాడీల రాజ్యాధికార సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం తెలిసిన మూర్ఖులు సీమాంధ్ర ప్రజాప్రతినిధులని ధ్వజమెత్తారు. తెలంగాణకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, 100 శాతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ పోరాటంలో 70 మంది గిరిజనులు ప్రాణాలు వదిలారని, అయితే కొంతమంది గిరిజనులు, ఆదివాసీలను విడదీసే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం లంబాడీలకు ఉపాధి కల్పించకుండా చిన్న తప్పుచేసినా వారిపై కేసులు పెట్టి, కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలలో గుడుంబా తయారీని ఆపి అభివృద్ధివైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రైబల్ జాక్ గౌరవ అధ్యక్షుడు కొర్ర రఘురాంనాయక్, కన్వీనర్ జైసింగ్ రాథోడ్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బానోతు సురేష్‌లాల్, వివిధ పార్టీలలోని నియోజకవర్గ, రాష్ట్ర నాయకులు అజ్మీరా చందూలాల్, పోరిక గోవింద్‌నాయక్, అజ్మీరా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. సభలో లంబాడా గిరిజన చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.