భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బంజారాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామని మానుకోట ఎంపీ సీతారామ్ నాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రు నాయక్ అన్నారు. భద్రాచలంలోని హతీరాం బావాజీ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం భోగ్‌బండారో ఆత్మీయ సభ జరిగింది. అతిధిలుగా వీరిద్దరూ పాల్గొన్నారు.
సభలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 35లక్షల వరకూ బంజారా జాతి ఉందన్నారు. సమైక్య రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా బంజారాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని అన్నారు. వీరిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకు ఆదరణ చూపుతోందని అన్నారు. ఇందులో భాగంగానే 500 జనాభాగల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపారని అన్నారు. తెలంగాణ అమర వీరులలో 60 మంది బంజారాలే ఉన్నట్టు చెప్పారు.
రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది బంజరా ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరంతా జాతి అభివృద్ధికి పాటుపడతారని అన్నారు. భద్రాచలంలో హతీరాం మఠం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రాద్రి ఆల యాన్ని సందర్శిస్తున్న ప్రతి వందమందిలో 30 మంది బంజారాలే ఉంటున్నట్టుగా తేలిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ హతీరాం మఠాన్ని అభివృద్ధి చేస్తామని, భక్తులకు వసతి కోసం సత్రాల నిర్మాణానికి నిధులు విడుదలయ్యే లా చూస్తామని అన్నారు.
భద్రాచలం కేంద్రంగా బంజారా కల్చర్ హట్‌గా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీని కోసం భద్రాచలం ప్రాంతంలో రెండెకరాలు భూమి కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు చెప్పారు. బంజారా ఆడబిడ్డలు తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో జరుపుకునే తీజ్ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పండుగ రోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రభత్వాన్ని కోరారు. వారు హతీరాం బావాజీకి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కు చెందిన వైరా, ములుగు ఎమ్మెల్యేలు మదన్‌లాల్, చందూలాల్, సభ నిర్వాహకులు హరిశ్చంద్ర నాయక్, భద్రాచలం సర్పంచ్ శ్వేత పాల్గొన్నారు.
బంజారాల అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం
Published Mon, Sep 22 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement