చదువుల తోట.. | Sitaram Naik meets students leaders in Kakatiya University | Sakshi
Sakshi News home page

చదువుల తోట..

Published Sun, Nov 16 2014 1:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

చదువుల తోట.. - Sakshi

చదువుల తోట..

సీతారాంనాయక్.. ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీ. దేశఅత్యున్నత చట్టసభలో సభ్యుడు. మొన్నటి వరకు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్. యూనివర్సిటీ నుంచి లోక్‌సభకు వెళ్లిన సీతారాంనాయక్.. మళ్లీ ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానం.. యూనివర్సిటీలో పరిస్థితులపై విద్యార్థి నాయకులతో, అధ్యాపకులతో ‘సాక్షి’ ప్రతినిధిగా ముచ్చటించారు.
 
ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ :
తెలంగాణ సాధన ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర సృష్టించిన మాట వాస్తవం. తెలంగాణలో విశ్వవిద్యాల యాలు, విద్యార్థులు, అధ్యాపకులు ఎలా ఉండాలి? మీరు      ఏం కోరుకుంటున్నారు?
బి.వీరేందర్(పార్ట్ టైం లెక్చరర్) : సమైక్య రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు పీజీలు, పీహెచ్‌డీ పట్టాలు తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారు. వీరికి చదువుల తోటఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకురావాలి.

సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలోని చట్టాలే ఇప్పుడు ఉన్నారుు. అప్పటి ఉమ్మడి విధానమే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
మోహన్‌రాజ్(టీఎఫ్‌ఏడీ అధ్యక్షుడు) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ప్రత్యేక రాష్ట్రంతో ఆ ఫలాలు అందుతాయని విద్యార్థులు త్యాగం చేసిండ్లు. కొత్త ప్రభుత్వం నాణ్యమైన విద్యను, కొఠారి కమిషన్ ప్రకారం కామన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిని అడ్డుకోవాలి. విద్యార్థులకు ఎన్నికలు జరగాలి. దీనివల్ల రాజకీయంగా చైతన్యమవుతారు.
 
సీతారాంనాయక్ :  కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు చేస్తున్నాయి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
చల్లా శ్రీనివాస్(కుర్సా అధ్యక్షుడు) : భారతీయ విద్యా విధానం ఇప్పటివరకు శాస్త్రీయంగా ఉంది. పెట్టుబడిదారీ విధానం మన విద్యా విధానంలోకి వస్తే మన విద్య  కుంటుబడుతుంది. మన విద్యార్థుల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల వారు. గ్రామీణ విద్యార్థి ఒకేసారి పెట్టుబడిదారీ విధానానికి అలవాటుపడలేదు. మన ఆచార, సంస్కృతి కూడా భ్రష్టుపడుతుంది.
 
సీతారాంనాయక్ : అటానమస్‌పై మీ అభిప్రాయం ఏమిటి? డిగ్రీ కాలేజీలకు విశ్వవిద్యాలయంతో సంబంధం ఉండదు? ప్రైవేటు కాలేజీలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని అంటున్నారు?
కొంగర జగన్(కుర్సా వర్కింగ్ ప్రెసిడెంట్) : ప్రైవేటు కాలేజీలకు అటానమస్ ఇస్తే విద్య ప్రైవేటు పరమవుతుంది. దీనివల్ల విద్యా వ్యవస్థ, విద్యా విధానం ప్రైవేటు పరమైపోతాయి. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. పీజీ సెంటర్లకు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి ఇస్తే బాగుంటుంది. అకడమిక్ విద్య దెబ్బతినదు. ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఉండదు. విద్య అనేది ప్రభుత్వమే నిర్వహించాలి.
 
సీతారాంనాయక్ : కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, ఇక్కడ ఉన్న కొన్ని పేరున్న సంస్థలు.. అప్‌గ్రేడ్ చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా చేయాలని కోరుతున్నారుు? దీనిపై మీ అభిప్రాయం?
ఎం.చిరంజీవి(పీడీఎస్‌యూ) : ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పోరాటం చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రూ.వేల కోట్లతో వ్యాపారం చేస్తున్నాయి. ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇవ్వొద్దనేది మా అభిప్రాయం.
 
సీతారాంనాయక్ : పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు ప్రైవేటు కాలేజీల్లో నామమాత్రపు జీతాలకు పని చేస్తున్నారు. విద్యార్థులకు క్యాలిబర్‌ను బట్టి ఉపాధి దొరికే పరిస్థితి ఉంది. మీరు ఎలాంటి కోర్సులు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు?
ఓడపెల్లి మురళి(టీబీఎస్‌ఎఫ్) : అన్ని ప్రభుత్వాలు సైన్స్ గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్ట్స్ గ్రూపులు తీసివేయాలని ప్రయత్నించారు. అప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల ఇక్కడ ఆర్ట్స్ గ్రూపులు అలాగే ఉన్నారుు. ఆర్ట్స్ గ్రూపులతో ఉపాధి కల్పించే సంస్థలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
 
వాసుదేవరెడ్డి(టీఆర్‌ఎస్‌వీ): బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే విద్యా విధానంలో మార్పులు చేయాలి. సమైక్య రాష్ట్రంలో భారీగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల కోర్సులకు డిమాండ్ తగ్గింది. ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి. నాణ్యత కొరవడింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన వారు నైపుణ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యంకాదు కాబట్టి వృత్తి విద్యా కోర్సులు రావాలి. హైదరాబాద్‌లో ఇప్పటికే సాఫ్ట్‌వేర్, ఇతర పరిశ్రమలకు పనికి వచ్చే నిపుణత కలిగే కోర్సులను తీసుకురావాలి. ఎంబీబీఎస్‌లాగే.. ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు కాలేజీలకు, పరిశ్రమలకు అనుబంధం ఉండాలి.

సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు విద్యా, ఉపాధి పరంగా ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మీరేం ఆశిస్తున్నారు?
వలీ ఉల్లాఖాద్రీ(ఏఐఎస్‌ఎఫ్) : సమైక్య రాష్ట్రంలో యూనివర్సిటీల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ విషయంలో ప్రతిసారి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను పట్టించుకోలేదు. ఇలాంటి అన్యాయాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా, కేయూలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించాలి. ఉపాధి, జానపద కళలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు ఉండాలి.
 
సీతారాంనాయక్ : కాంట్రాక్టు ఉద్యోగ విధానం ఎందుకొచ్చింది? దీనివల్ల ప్రయోజనాలు ఏమిటీ? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి?
దుర్గం సారయ్య(పీడీఎస్‌యూ) : చంద్రబాబు హయూంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేక.. కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చారు. కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం చేస్తున్న వారు.. కుటుంబానికి తిండిపెట్టలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి. విద్యా, ఉపాధి విషయాలు ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. సీఎం కొడుకు, పేద పిల్లవాడు ఒకేచోట చదివేలా కామన్ విద్యా విధానం ఉండాలి.
 
సీతారాంనాయక్ : ప్రాథమిక విద్యా ఎలా ఉండాలి? కులాల పేర్లతో హాస్టళ్లు ఉన్నాయి. ఇలా ఉంటే విద్యార్థుల్లో న్యూనత భావం ఏర్పడుతుంది. దీనిని ఎలా చేస్తే బాగుంటుంది?
సుత్రపు అనిల్(పీడీఎస్‌యూ) : ప్రాథమిక విద్య అనేది కుల, మత బేధం లేకుండా అందరికీ ఒకే విద్యా విధానం ఉండాలి. ప్రస్తుతం ప్రీప్రైమరీ, ఆశ్రమ, గురుకుల, సాంఘిక సంక్షేమం, ఐటీడీఏ స్కూళ్లు ప్రాథమిక విద్యలో 12 రకాలు ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో ఈ విధానాన్ని మార్చాలి. ఉపాధ్యాయులకు కూడా ఏకీకృత సర్వీసు రూల్స్‌ను తీసుకురావాలి.
 
సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లో హాస్టల్స్‌పై మీ అభిప్రాయం ఏమిటీ? హాస్టళ్ల ప్రైవేటీకరణ ఉండాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎలా ఉంటే బాగుంటుంది?
మాతంగి మురళి(టీఎన్‌ఎస్‌ఎఫ్) : తెలంగాణలోని యూనివర్సిటీల్లో చదుకునేవారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే. కాంట్రాక్టు, ప్రైవేటు మెస్ విధానాల వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోంది.
 
రంజిత్(టీఆర్‌ఎస్‌వీ) : వర్సిటీల్లో గ్రామీణ, పేద విద్యార్థులే ఉంటున్నారు. విద్యార్థులతో మెస్ కమిటీలు లేకపోవడం వల్ల ప్రైవేటు కాంట్రాక్టర్లు లాభమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ పెడితే బాగుంటుంది.
 
సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అపాయింట్‌మెంట్లు జరగడం లేదు. వీసీలుగా వచ్చిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయి. నాట్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ విషయంలో ఎలా వ్యవహించాలి?
పి.కొండల్‌రెడ్డి(ఉద్యోగుల జేఏసీ చైర్మన్) : ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్‌లో అర్హత, నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు రావాలి. కేయూలో ఏడాదిగా నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ జరగలేదు. వైస్ చాన్సలర్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఉండాలి. దీని వల్ల అక్రమాలను నివారించవచ్చు.
 
సీతారాంనాయక్ : వర్సిటీలో వీసీలను ఘెరావ్ చేయడం లేదా రిజిస్ట్రార్లను బయటపెట్టడం తరచుగా చూస్తున్నాం. ఇలాంటి గొడవలకు కారణమేమిటీ?
కె.శంకర్(ఎన్జీవోస్, కేయూ, అధ్యక్షుడు) : వ్యవస్థ అన్నప్పుడు అన్ని రకాల వ్యక్తులు ఉంటరు. యూనివర్సిటీలోనూ స్వార్థపరులు ఎక్కువైనప్పుడు పరిపాలన సరిగా ఉండదు. ఉన్నతాధికారులు పరిపాలన విషయంలో నిక్కచ్చిగా ఉంటే ఏమీ జరగదు. కేయూలో నియామకాలు, బదిలీలు పారదర్శకంగా జరగడంలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటిని మార్చుకోవాలి.
 
సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయం పరిరక్షణ విషయంలో అకుట్ ఏ రకమైన బాధ్యత నిర్వర్తిస్తోంది?
డాక్టర్ వెంకయ్య(అకుట్) : ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో అకుట్ ముందుంటోంది. ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతుంటే మేం స్పందించి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు లేఖలు రాశాం.
 
సీతారాంనాయక్ : కేయూలో ఉత్తరాలు రాయడం మొదటి నుంచి ఉంది. ఉత్తరాలు రాస్తే ప్రయోజనం ఏమిటి? కేయూ భూమి 554 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 500 ఎకరాలు కూడా లేదు. భూ ఆక్రమణల విషయంలో మీరు ముందుండడం లేదు?
డాక్టర్ వెంకట్ : గతంలో పరిపాలన పరంగా తప్పులు దొర్లారుు. యూనివర్సిటీ వైపు నుంచి సరైన చర్యలు తీసుకోలేదు. వీసీ, రిజిస్ట్రార్ సరిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.
 
సీతారాంనాయక్ : వాళ్లు చేయలేదు సరే. మీరేం చేశారు? అకుట్‌గా మీరు చేయాల్సి ఉండె కదా?
డాక్టర్ వెంకట్ : జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. ఐదు నెలలుగా వీసీ లేరు. దీనిపై మా వంతుగా చర్యలు చేపడుతాం.
 
సీతారాంనాయక్ : దూరవిద్య అనేది యూనివర్సిటీ నిధుల పరంగా ఉత్పత్తి కేంద్రం. ఎస్‌డీఎల్‌సీఈలో అక్రమాలు జరుగుతున్నాయని చాలాసార్లు పేపర్లలో చూస్తుంటాం. ఇలాంటివి జరుగుతాయా? జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
వల్లాల తిరుపతి(ఉద్యోగి) : యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఎస్‌డీఎల్‌సీఈని నడుపుతోంది. కొందరు అధికారులు మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ బంగారుబాతులాగే చూస్తున్నారు. రెవెన్యూ తీసుకుంటున్నారుగానీ, అక్కడ ప్రక్షాళన జరగడం లేదు.
 
సీతారాంనాయక్ : మీకూ అధికారాలు ఉన్నారుు కదా? డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ అందరు ఉన్నారు కదా? అలాంటివి ఎందుకు జరుగుతాయి. అపనిందలు ఎందుకు వస్తాయి?
వల్లాల తిరుపతి : వీరికి నామమాత్రపు అధికారాలే ఇచ్చారు. ఏదీ చేయాలన్నా మళ్లీ వీసీ, రిజిస్ట్రారు అనుమతి తీసుకోవాల్సిందే.
 
సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లోని పరిశోధనల విషయంలో నానారకమైన భావనలు వ్యక్తమవుతున్నాయి. సూపర్‌వైజర్ల లోపం ఏమైనా ఉందా? ఇటీవల కొత్త నామ్స్ వచ్చాయి. గైడ్‌గా నియమించిన వారి వద్దే విద్యార్థి పరిశోధన పూర్తి చేయాలని ఉంది. ఇది మంచిదా? పాత విధానమే మంచిదా?
డాక్టర్ ముస్తఫా(అసిస్టెంట్ ప్రొఫెసర్) : పరిశోధనకు సంబంధించిన విద్యార్థులకు మెరిట్ కంటే ముఖ్యంగా ఆసక్తి ఉండాలి. ఎవరికీ బిగినింల్‌లో ఏమీ రాదు. నేర్చుకుంటే అనుభవపరంగా ఎంతో వస్తుంది. ఆసక్తి ఉన్న వారికే అవకాశం కల్పించాలి. ప్రొఫెసర్ తెలిసిన విద్యార్థులకు గైడ్‌లుగా ఉంటే మంచిది. కొత్త వారితో అయితే కొంత గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న వసతులు సరిపోవు. ఉన్నత ప్రమాణాలతో ఉండాలి. దీని కోసం ప్రయత్నించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement