టీచర్ చుట్టూ చేరి విలపిస్తున్న విద్యార్థులు
కేసముద్రం(మహబూబాబాద్): ‘మేడమ్ మీరు ఎక్కడికీ పోవద్దు.. మాతోనే ఉండాలి.. మీరే మాకు పాఠాలు చెప్పాలి.. మీరులేని ఈ బడికి మేము రాం’ అంటూ బదిలీపై వెళ్తున్న టీచర్‌ను పట్టుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన మహబూబా బాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం గ్రా మంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఈ పాఠశాలలో 54 మంది విద్యార్థులు చదువుతున్నారు.
హెచ్‌ఎం జిలుకర శ్రీనివాస్‌తో పాటు టీచర్లు తేలుకుంట్ల సునీత, శ్రీను, శారద, అనురాధ, ఆరీఫ్, సూర్యప్రకాశ్ పనిచేస్తున్నారు. వీరిలో ఒక్క టీచర్ మినహా అందరూ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎనిమిదేళ్లుకు పైగా ఇక్కడ పనిచేస్తున్న సునీత టీచర్ నిబంధన ల ప్రకారం బదిలీపై వెళ్లాల్సి ఉంది. అయితే ఎనిమిదేళ్లకు పైగా పాఠశాలలో పనిచేస్తున్న ఆమె పిల్లలు, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మెదులుతూ ఉన్నారు.
పిల్లలు బడికి రాకుండా మారాంచేస్తుంటే వారి ఇళ్లకు వెళ్లి నచ్చచెప్పి తీసుకువచ్చేది. బడిలో విద్యాబుద్ధులు నేర్పుతూ, మధ్యాహ్న భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిండంతోపాటు రోజూ ఒక రూపాయి చొప్పు న పొదుపు చేయడం నేర్పి నెలకు జమైన డబ్బులతో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులను కొనిస్తుండేవారు. ఇలా పిల్లలతో మమేకమయ్యా రు. ఈ క్రమంలో మేడమ్ బదిలీ అవుతుందనే విషయాన్ని తోటి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న పాఠశాల విద్యార్థులంతా ఆమె ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మేడమ్ మీరు పోవద్దూ, మీరు వెళ్తే మేము బడికి రాలేమంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు.
పిల్లలు తనపై పెంచుకున్న ప్రేమకు మేడమ్ కన్నీళ్లు పెట్టుకుంది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా బడికి చేరుకున్నారు. పిల్లలు టీచర్‌ను తలుచుకుంటూ రోదిస్తున్న తీరు చూసి తల్లిదండ్రులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. సునీత మేడమ్‌ను ఇక్కడే ఉంచాలంటూ విద్యార్థులందరూ నినాదాలు చేస్తూ పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అయితే విషయాన్ని గ్రామానికి చెందిన ఎంపీపీ కదిర రాధిక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా నిబంధనల మేరకు ఎనిమిదేళ్లు పూర్తయ్యిందని, బదిలీ నిలిపివేయలేమని చెప్పినట్లు తెలిసింది.
అయితే ఎక్కడైనా బడిలో పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తే వారికి సన్మానం చేయడం, ఆరోజు వరకు తమ బాధను వెళ్లగక్కడం సహజం గా చూస్తుంటాం. అయితే ఒక ఉపాధ్యాయురాలి కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం వారి మధ్య ఉన్న అనుబంధం గొప్పతనాన్ని గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment