- ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్
- వీరయ్య, సీతక్క పద్ధతి మార్చుకోకుంటే ఓడిస్తాం
గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : జాతిని అభివృ ద్ధి చేసుకోవడం ఎవరికైనా బాధ్యతే.. అలా అని ఇతరులను అణగదొక్కాలను కోవడం మూర్ఖత్వం అవుతుంది.. గిరిజనులను అణగదొక్కాల ని చూస్తే ఊరుకునేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ అన్నా రు. ఎల్‌హెచ్‌పీఎస్ మండల అధ్యక్షుడు రసపూత్ సీతారాం నాయక్ అధ్యక్షతన ‘తెలంగాణ పునర్నిర్మాణం-గిరిజనుల డిమాండ్లు’ అనే అంశంపై శనివారం స్థానికంగా నిర్వహించిన గిరిజన గర్జన సభలో ఆయన మాట్లాడారు.
అన్నింటినీ లంబాడీ లు తినేస్తున్నారనేది కేవలం అపోహ మాత్రమేనని, గిరిజనుల హక్కులతోపాటు గిరిజనేతరు ల హక్కులను కూడా కాపాడాలన్నారు. కోయల అభివృద్ధి జరగాలని తాము కూడా కోరుకుం టున్నామని, అందుకోసం మిగతా తెగలను తొక్కేయాలన్న భావన సరికాదన్నారు. పొదెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉండగా ఇద్దరు లంబాడీ సర్పంచ్‌లను కొట్టాడని, దాంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఓటమికి కృషి చేశామని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క సైతం తమ జాతిని అణగదొక్కే విధానాలను అవలంభిస్తోం దని ఆరోపించారు.
వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాతే ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వమని హెచ్చరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించే లంబాడీల రాజ్యాధికార సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం తెలిసిన మూర్ఖులు సీమాంధ్ర ప్రజాప్రతినిధులని ధ్వజమెత్తారు. తెలంగాణకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, 100 శాతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ పోరాటంలో 70 మంది గిరిజనులు ప్రాణాలు వదిలారని, అయితే కొంతమంది గిరిజనులు, ఆదివాసీలను విడదీసే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం లంబాడీలకు ఉపాధి కల్పించకుండా చిన్న తప్పుచేసినా వారిపై కేసులు పెట్టి, కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తండాలలో గుడుంబా తయారీని ఆపి అభివృద్ధివైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రైబల్ జాక్ గౌరవ అధ్యక్షుడు కొర్ర రఘురాంనాయక్, కన్వీనర్ జైసింగ్ రాథోడ్, కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ బానోతు సురేష్‌లాల్, వివిధ పార్టీలలోని నియోజకవర్గ, రాష్ట్ర నాయకులు అజ్మీరా చందూలాల్, పోరిక గోవింద్‌నాయక్, అజ్మీరా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. సభలో లంబాడా గిరిజన చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.