భూగర్భానికి ఊపిరి | groundwater level Increased in telangana | Sakshi
Sakshi News home page

భూగర్భానికి ఊపిరి

Published Fri, Oct 14 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

భూగర్భానికి ఊపిరి

భూగర్భానికి ఊపిరి

► గత నెలలో సాధారణ వర్షపాతం కన్నా
► 32 శాతం అధికం

 
సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా ప్రతినెలా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురవగా ఈ సెప్టెంబర్‌లో మాత్రం అనూహ్యంగా అదనపు వర్షపాతం కురిసింది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 715 మిల్లీమీటర్లు కాగా ఏకంగా 943 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జలవిభాగం గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

అధికంగా హైదరాబాద్‌లో 60 శాతం, రంగారెడ్డిలో 48, మెదక్‌లో 43, నిజామాబాద్‌లో 42, నల్లగొండలో 37, వరంగల్‌లో 33, మహబూబ్‌నగర్‌లో 24, కరీంనగర్‌లో 21 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే సగటున 6.64 మీటర్ల మేర వృద్ధి ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆగస్టుతో పోలిస్తే 3.49 మీటర్లు, గతేడాదితో పోలిస్తే 2.76 మీటర్ల మేర భూగర్భ మట్టాలు పెరిగాయి. మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి ,నల్లగొండ, హైదరాబాద్‌లో ఆశాజనకంగా భూగర్భజలాలు పెరిగాయి.

మెదక్ జిల్లాలో 8.92 మీటర్లు, హైదరాబాద్‌లో 4.19 మీటర్లు, నల్లగొండ జిల్లాలో 5.57 మీటర్ల చొప్పున భూగర్భ జల మట్టాలు పెరిగాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం 0.91 మీటర్ల జలమట్టం తగ్గిపోయింది. రాష్ట్రంలో 65 మండలాల్లో 2 మీటర్లలోనే భూగర్భ జలాలుండగా, 70 మండలాల్లో 2 నుంచి 5 మీటర్లలో నీటి లభ్యత ఉంది. 95 మండలాల్లో 5 నుంచి 10 మీటర్లలోపు, 113 మండలాల్లో 10 నుంచి 20 మీటర్లలోపు, 56 మండలాల్లో 20 మీటర్ల కింద జలాలున్నాయి. ఇందులో మెదక్‌లో 15, మహబూబ్‌నగర్‌లో 14, నల్లగొండలో 11, నిజామాబాద్‌లో 7 మండలాలు ఉన్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement