
తెలంగాణ అంతటా.. పాతాళ గంటలు!
భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. దీంతో ఇక ముందున్న ఎండా కాలాన్ని తలచుకుంటేనే వణుకుపుడుతోంది.
దారుణంగా పడిపోతున్న భూగర్భ జలాలు
ఫిబ్రవరిలో సగటున 11.73 మీటర్ల లోతులో నీళ్లు
గత ఏడాది మేలో 9.89 మీటర్లలో లభ్యం
ఎండలు మరింత ముదిరితే గడ్డు పరిస్థితే
ఇప్పటికే మెదక్‌లో పాతాళంలోకి జలాలు
18.85 మీటర్లకు పడిపోయిన వైనం
ఈ వేసవిలో తాగునీటి కటకటపై సర్కారు ఆందోళన
తీవ్ర నీటి కరువును సూచిస్తున్న జలవనరుల శాఖ నివేదిక
సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. దీంతో ఇక ముందున్న ఎండా కాలాన్ని తలచుకుంటేనే వణుకుపుడుతోంది. గత ఏడాది మే నెలలో నిండు వేసవితో పోల్చినా ఈసారి మార్చిలోనే గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే జలవనరులు ఆవిరవడంతో రానున్న రోజుల్లో తాగునీటికి కటకట తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరువు విలయతాండవం చేయనుందని సర్కారే కలవరపడుతోంది. రాష్ర్టంలోని జలవనరుల పరిస్థితిపై భూగర్భ జలవనరుల శాఖ సోమవారం సమగ్ర నివేదికను విడుదల చేసింది.
అందులో విస్తుగొలిపే వివరాలను వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ర్టంలో సరాసరి 8.47 మీటర్ల లోతులో నీరు లభిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అవి 11.73 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఏకంగా 3 మీటర్లకుపైగా జలాలు ఇప్పటికే అదనంగా ఆవిరైపోయాయి. ఎంత దారుణంగా అడుగంటాయంటే గత మే నెలలో కూడా 9.89 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితి ఏర్పడిందన్నమాట! ఇటీవలి కాలంలో ఇంతటి దుస్థితి ఎన్నడూ రాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మెదక్ జిల్లాలో దారుణ పరిస్థితి...
భూగర్భ జలాలు అడుగంటిన జిల్లాల్లో మెదక్ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ గత ఏడాది ఫిబ్రవరిలో 11.89 మీటర్ల లోతులో జలాలు లభిస్తే.. ఈసారి ఫిబ్రవరికి 18.85 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే 6 మీటర్లకుపైగా నీళ్లు అదనంగా ఆవిరయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఈ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరిలో 11.40 మీటర్లలో ఉన్న జలాలు.. ఈసారి 11.82 మీటర్లలో లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాలు అత్యధిక స్థాయిలో పడిపోయిన గ్రామాలను సైతం ప్రభుత్వం గుర్తించింది. మెదక్ జిల్లా ములుగు మండల కేంద్రంలో అత్యంత గడ్డు పరిస్థితి నెలకొంది. 33.88 మీటర్ల లోతుల్లోకి నీళ్లు అడుగంటాయి.
అదే జిల్లా తూఫ్రాన్ మండల కేంద్రం పరిస్థితి కూడా ఘోరంగా మారింది. గత ఏడాది ఫిబ్రవరిలో 5.15 మీటర్లలోనే నీరు లభిస్తే.. ఈ ఫిబ్రవరిలో మాత్రం ఏకంగా 33.10 మీటర్లలోకి నీటి నిల్వలు పడిపోయాయి. ఇలాంటి ప్రాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. దీంతో ఇంకా ఎండలు ముదిరితే తాగునీటి సంగతేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నీటి కటకటపై ఇటు ప్రజల్లో, అటు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రచించాల్సి ఉంది.