మధిర.. దాహార్తి | water froblom in madira area | Sakshi
Sakshi News home page

మధిర.. దాహార్తి

Published Thu, Mar 24 2016 4:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

మధిర.. దాహార్తి

మధిర.. దాహార్తి

వైరానది..మున్నేరు.. కట్లేరు.. మధిర నియోజకవర్గ దాహార్తిని తీర్చే ప్రధాన నీటి వనరులు..కానీ ఇప్పుడవి ఎడారిని తలపిస్తున్నాయి. వీటిలో చుక్కనీరు లేక దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. చెరువులు, కుంటల్లోనూ నీరు లేక భూగర్భజలాలు పడిపోయాయి. బావులు, బోర్లు ఎండిపోయాయి. చేతిపంపులు సైతం నిరుపయోగంగా మారాయి. అక్కడక్కడ ఒకటి రెండు చేతిపంపులు పనిచేస్తున్నా ఫ్లోరైడ్ ప్రభావంతో ఆ నీరు తాగడానికి పనికి రావడం లేదు. రూ.15 వెచ్చించి మినరల్ వాటర్ కొనుక్కుంటే కానీ దాహం తీరేలా లేదు.
 

మధిర: మధిర నియోజకవర్గం దాహంతో అల్లాడుతోంది. ఎండలు మండుతుండటంతో భూగర్భజలాలు అడుగంటి చెరువులు, కుంటలు, నదులు ఎడారిని తలపిస్తున్నాయి. మంచినీటి పథకాలు, చేతిపంపులు నిరుపయోగంగా మారాయి. నియోజకవర్గంలో మున్నేరు, వైరానది, కట్టలేరు నదులు ఉన్నాయి. ఆరు నెలలుగా వర్షాలు లేకపోవడంతో వీటిలో చుక్కనీరు లేకుండా పోయింది. తాగునీటి ఇబ్బందులు రెట్టింపయ్యాయి.

నగర పంచాయతీలో...
మధిర నగర పంచాయతీలో 40వేల జనాభా ఉంది. బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా గతంలో నీరందేది. ఈ పథకం మూలన పడటంతో మధిర టూటౌన్‌కు తాగునీటి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఇటీవల రూ.5 లక్షలకుపైగా నిధులతో వైరానదిలో 4 బోర్లు వేశారు. వాటిలో రెండు బోర్లు ఫెయిలయ్యాయి. రెండు బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. సుదూర ప్రాంతం నుంచి పైప్‌లైన్లు వేసి పంపుహౌజ్‌కు నీరు ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి మోటార్ల ద్వారా మధిర వన్‌టౌన్‌కు తాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతానికి రెండు, మూడురోజులకోసారి అరకొరగా నీరు సరఫరా అవుతోంది. పట్టణంతోపాటు పలు గ్రామాల్లో పైప్‌లైన్లు, గేట్‌వాల్వులు, సంపులకు లీకులు ఏర్పడి తాగునీరు వృథాగా పోతుంది. పట్టణానికి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మధిర  ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో వాటర్‌గ్రిడ్ నిర్మిస్తున్నారు. ఈ పథకానికి కూడా వైరా రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ల ద్వారా నీరు సరఫరా  చేయాల్సి ఉంది. ఈ నిర్మాణం జరిగి తాగునీరు అందించాలంటే ఇంకా సంవత్సరకాలం పట్టే అవకాశం ఉంది. 

 మధిర మండలంలో..
మధిర మండలంలో 29 గ్రామాలు ఉండగా 85 వేలకు పైగా జనాభా ఉంది. మధిర, బోనకల్ మండలంలోని 51 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.40 కోట్లతో మధిర మండలంలోని జాలిముడి వద్ద  నిర్మించిన రక్షిత మంచినీటి  పథకానికి నీర ందట్లేదు. మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు రూ.82 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. గతంలో సీఆర్‌ఎఫ్ కింద రూ.2 లక్షలు మంజూరయ్యాయి. గ్రామపంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధులను తాగునీటికి వినియోగిస్తున్నారు. వైరాలోని బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా వచ్చే నీరు కూడా నెలరోజులుగా మధిర మండలానికి విడుదల కావడం లేదు.

మధిర మండలంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అంబారుపేట, మాటూరు, దెందుకూరు తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మరికొన్ని గ్రామాల్లో ఫ్లోరైడ్ ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మినరల్ వాటర్ పేరుతో 20 లీటర్ల క్యాన్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు.

 బోనకల్‌లో..
బోనకల్ మండలంలో 44,789 జనాభా ఉంది. మండలంలోని 14 గ్రామాలకు బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా తాగునీరు సరఫరా చేయాలి. వారానికి ఒక్కరోజు కూడా నీరొచ్చే పరిస్థితి లేదు. నక్కలగరుబు, చిలుకూరు గ్రామస్తులు సమీపంలోని వైరానదికి వెళ్లి చెలమ నీరు తెచ్చుకుంటున్నారు.

 చింతకానిలో..
చింతకాని మండలంలో 48 వేల జనాభా ఉంది. 25 తాగునీటి పథకాలున్నాయి. నాగిలిగొండ, చింతకాని రక్షిత తాగునీటి పథకాలు ఉండగా తీవ్ర ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి ఇవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. చింతకాని నల్లచెరువు ఎండిపోవటంతో మండల కేంద్రంలో సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రక్షిత తాగునీటి పథకం ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది.

 ముదిగొండలో..
భూగర్భజలాలు అడుగంటి ముదిగొండ మండలంలో నీటి సమస్య ఏర్పడుతోంది. రూ.70 లక్షల యాక్షన్ ప్లాన్ అమలుకాక పోవడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలో 60వేల జనాభా ఉంది. వీరికి 6 లక్షల గ్యాలన్‌ల నీరు అవసరముండగా అందులో సగం మాత్రమే అందుతోంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఏ ఒక్క గ్రామంలో నీటి సమస్య గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

 ఎర్రుపాలెంలో..
ఎర్రుపాలెం మండలంలో సుమారు రూ. 40 కోట్లతో నిర్మించిన మామునూరు మంచినీటి ప్రాజెక్టు నుంచి ట్యాంకులకు తాగునీరు సరఫరా కావడం లేదు. ఈ ప్రాజెక్టులో నీరు ఉండాలంటే సమీపంలోని చెరువు నిండాల్సిందే. సాగర్ జలాలతో చెరువులను నింపి, కట్లేరు ప్రాజెక్టుకు నీరు విడుదల చేస్తేనే వేసవిలో దాహార్తి తీరుతుంది.

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
ఎండలు మండుతున్న నేపథ్యంలో మధిరలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. దుకాణాల్లో ఒక్కో బాటిల్ రూ.5 పెట్టి కొనాలంటే భారం అవుతోంది. అధికారులు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. - తోక చిన్నపుల్లయ్య, రిటైర్డ్ టీచర్

వారానికి ఒక్కసారీ నీరు రావడం లేదు
మండలకేంద్రంలో వారానికి ఒక్కసారి కూడా బోడేపూడి సుజల స్రవంతి నీరు రావడం లేదు. ఫ్లోరైడ్ ప్రభావంతో చేతిపంపుల్లో నీరు తాగడానికి పనికి రావడం లేదు. రూ.15కు ఓ క్యాన్ చొప్పున 20 లీటర్ల క్యాన్‌ను కొని దాహం తీర్చుకుంటున్నాం. కొన్ని చేతిపంపుల నుంచి కూడా నీరు రావట్లేదు. -బాణోతు సూరమ్మ , ఎస్టీ కాలనీ, బోనకల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement