
రబీకి కరువు దెబ్బ
♦ రెండు శాతం కూడా మించని వరి నాట్లు
♦ నవంబర్‌లో 92% లోటు వర్షపాతం నమోదు
♦ వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు వెంటాడుతోంది. పంటల సాగు విస్తీర్ణం ఎన్నడూ లేనంత భారీగా తగ్గిపోయింది. రబీ మొదలై రెండున్నర నెలలు దాటినా... వరి నాట్లు కనీసం రెండు శాతానికి మించి పడలేదు. మొత్తంగా రబీ సీజన్‌లో 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 8.67 లక్షల ఎకరాల (28%)కే పరిమితమైంది. ఇందులో ఆహార ధాన్యాలు 25.20 లక్షల ఎకరాల్లో సాగుకావాల్సి ఉండగా... 5.37 లక్షల ఎకరాల్లోనే వేశారు. ప్రధాన పంట అయిన వరి సాధారణ సాగు 16.12 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటి వరకు 30 వేల ఎకరాల్లోనే నాట్లు పడడం పడ్డాయి.
అత్యంత దారుణంగా రెండు శాతానికి మించి నాట్లు పడకపోవడం రాష్ట్రంలోని దారుణ పరిస్థితికి కళ్లకు కడుతోంది. ఇక 3.45 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3.05 లక్షల ఎకరాల్లో (88%) వేశారు. ఇది మాత్రమే కాస్త ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నూనె గింజల సాగు 51 శాతం జరిగింది. ప్రభుత్వం ఎంత ప్రోత్సహించినా ఉల్లి సాగు విస్తీర్ణం 34 శాతానికి మించకపోవడం గమనార్హం. దీంతో వచ్చే సీజన్‌లో ఆహార ధాన్యాలతోపాటు ఉల్లి కొరత కూడా రాష్ట్రాన్ని వేధించనుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
గత నెల 92 శాతం లోటు
ఎన్నడూ లేని స్థాయిలో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రబీ ప్రారంభమైన అక్టోబర్ నెలలో సాధారణంగా 98.7 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. కురిసింది 24.4 మిల్లీమీటర్లే. అంటే 75 శాతం లోటు నమోదైంది. నవంబర్‌లో సాధారణంగా 27.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... అత్యంత దారుణంగా 2.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే ఏకంగా 92 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. మొత్తంగా రబీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 75 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. నవంబర్ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.69 మీటర్ల అదనపు లోతులోకి వెళ్లిపోయాయి. దీంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. మొత్తంగా రబీ పంటల సాగు పడిపోయిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.