సాక్షి, అమరావతి: వ్యవసాయ పనుల్లో సాంకేతిక పరికరాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మనుషులపై దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టింది. వచ్చే రబీ సీజన్‌లోగా డ్రోన్లను అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టింది. వ్యవసాయంలో రైతులకు సాయం చేయడానికి కృత్రిమ మేథస్సుతో కూడిన డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలోని ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్‌సీ) ద్వారానే వీటినీ రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. తొలి దశలో మండలానికి 3 ఆర్బీకేల చొప్పున కనీసం 2 వేల ఆర్బీకేల్లో డ్రోన్లను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మండల పరిధిలో ఎక్కువ విస్తీర్ణం కల్గిన ఆర్బీకేలను ఎంపిక చేస్తున్నారు. వీటి పరిధిలో ఏ పంటల విస్తీర్ణం ఎంత ఉంది? ఏ సీజన్‌లో ఎంత ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తారో అంచనా వేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా డ్రోన్లను ఏర్పాటు చేస్తున్నారు.
సబ్సిడీపై డ్రోన్లు
ఒక్కో డ్రోన్, దాని అనుబంధ పరికరాల అంచనా వ్యయం రూ.10 లక్షలు. వీటి వినియోగానికి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రైతులతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణనిచ్చి, సర్టిఫికెట్లను కూడా ఇస్తారు. డ్రోన్లకు సబ్సిడీ కూడా వస్తుంది. చదువుకోని రైతులకు 40 శాతమే సబ్సిడీ వస్తుంది. అదే చదువుకున్న రైతులతో ఏర్పాటు చేసే సీహెచ్‌సీలకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. డ్రోన్ల నిర్వహణలో ఫలితాలు వస్తాయి. డ్రోన్‌తో మందులు, ఎరువులు చల్లే విధానంతో వీడియోలూ రూపొందిస్తున్నారు.
ప్రయోగాత్మకంగా 30 వేల ఎకరాల్లో
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఇప్పటికే డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పురుగు మందుల పిచికారీకి పుష్పక్–1, ఎరువులు, విత్తనాలు చల్లడానికి పుష్పక్–2 అనే రెండు రకాల డ్రోన్లను తయారు చేశారు. ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో 8 కిలోల బరువుండే అగ్రికల్చర్ డ్రోన్లను రూపొందించారు. వీటికి కేంద్రం నుంచి అనుమతులు పొందారు. పది రకాల పంటల సాగులో వీటి వినియోగంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఒపీ)ను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో ఈ డ్రోన్లతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పురుగుల మందులు, ఎరువులు చల్లిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు పంటల్లో వీటిని వినియోగిస్తున్నారు.
డ్రోన్లతో ఉపయోగాలెన్నో..
► మనుషులతోకన్నా 60 శాతం వేగంగా మందులు, ఎరువులు చల్లొచ్చు
► మోతాదుకు మించి రసాయనాల వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు
► అవసరమైన ప్రాంతంలోనే అవసరమైనంతే పిచికారీ చేయొచ్చు
► తద్వారా రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది
► వైపరీత్యాల కారణంగా నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో సులభంగా, త్వరితగతిన అంచనా వేయొచ్చు
► సులువుగా ఎక్కడికై నా తీసుకెళ్లవచ్చు.
► తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు.
► పంట విస్తీర్ణం. సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు
సాధ్యమైనంత త్వరగా సీహెచ్‌సీల ఏర్పాటు
డ్రోన్ల ఎంపిక, వినియోగంపై కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈలోగా క్షేత్రస్థాయిలో ఆర్బీకేల ఎంపిక, సీహెచ్‌సీల కోసం పట్టభద్రులైన రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాం. సాధ్యమైనంత త్వరగా వీరితో సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే ఎంపిక చేసిన వారికి శిక్షణనిచ్చి గడువులోగా గ్రౌండింగ్ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment