వేసవికి ముందే ఎక్కిళ్లు!
అప్పుడే మొదలైన నీటి కష్టాలు
- పడిపోతున్న భూగర్భ జలమట్టాలు
- గ్రామాలు, తండాల్లో తాగునీటి తిప్పలు
- నీటిఎద్దడి ప్రాంతాలను గుర్తించే పనిలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
వేసవికి ముందే జిల్లాలో తాగునీటి సమస్య నెలకొంది. భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుముఖం పట్టడం.. నీటి వనరులు వట్టిపోతుండటంతో గ్రామాలు, గిరిజన తండాల్లో తాగునీటి కొరత ఏర్పడుతోంది. దీనికితోడు గ్రామాల్లోని చేతిపంపులు పనిచేయకపోవటం, మరమ్మతులకు సైతం నోచుకోకపోవటంతో నీటి సమస్యకు దారితీస్తోంది. ప్రజలు తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావులను ఆశ్రయిస్తున్నారు. చిన్నశంకరంపేట మండలం జప్తిశివనూరు గ్రామంలోని ఎస్పీకాలనీ వాసులు ఇటీవల తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారంటే నీటి సమస్య ఎంత తీవ్రంగా తెలుస్తోంది.
కలుషిత నీరే దిక్కు
బోరు మోటారు చెడిపోయి 15 రోజులవుతున్నా.. మరమ్మతు చేయించకపోవడంతో కాలనీలో నీటి ఎద్దడి నెలకొంది. ఫలితంగా కలుషిత నీరే దిక్కవుతోంది. తాము రోజూ రాత్రివేళలో బాలవికాస్‌కు చెందిన నీటి శుద్ధి యంత్రం ద్వారా పడిపోతున్న వృధా నీటిని పట్టుకుంటున్నాం. వెంటనే బోరును మరమ్మతు చేయించాలి.
– శ్రీదేవి, నిజాంపేట
సాక్షి, మెదక్ : జిల్లాలో మొత్తం 320 గ్రామాలు, వందకుపైగా గిరిజన తండాలున్నాయి. వీటిలో సుమారు 80 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. వర్షా కాలం చివరలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో జిల్లాలో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. అయితే డిసెంబర్ మాసం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో 14 మీటర్ల మేర ఉన్న భూగర్భ జలమట్టాలు ప్రస్తుతం 22 మీటర్లకు చేరుకున్నాయి. రబీలో బోరుబావుల కింద పంటల సాగు గణనీయంగా పెరగటంతో భూగర్భజలాల వాడకం పెరుగుతోంది. దీనికితోడు పట్టణ ప్రాంతాల్లో సైతం భూగర్భజలాలను ఎడాపెడా తోడేస్తున్నారు. దీంతో జల మట్టాలు పడిపోతున్నాయి. అల్లాదుర్గం మండలంలో 22 మీటర్లు, కొల్చారంలో 21.25, టేక్మాల్‌లో 19.69, మెదక్‌లో 15.24, హవేళిఘనపూర్‌లో 14.80 మీటర్ల మేర లోతుకు భూగర్భజలాలు చేరుకున్నాయి. దీంతో ఆయా మండలాల్లో తాగునీటి సమస్య ప్రారంభమైంది. భూగర్భ జలమట్టాలు పడిపోవటానికి తోడు జిల్లాలోని నీటి వనరులు సైతం ఎండిపోతున్నాయి. ఇది కూడా తాగునీటి సమస్యకు దారితీస్తోంది.
నీటి కోసం తిప్పలు
చిన్నశంకరంపేట మండలంలోని జప్తిశివనూర్ గ్రామ ఎస్సీ కాలనీ, గిరిజన తండాలో మంచినీటి సమస్య నెలకొంది. స్థానికులు మంచి నీటి కోసం వ్యవసాయ బోరుబావులతో పాటు స్థానిక చెరువులోంచి బిందెల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించాల్సిల్సిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులుగాని పట్టించుకోవడంలేదని కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అలాగే మండలంలోని జంగరాయి నాగులమ్మ తండాలోను నీటి సమస్య నెలకొంది. గిరిజనులు వ్యవసాయ బోర్లపై ఆధారపడి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. రామాయంపేట మండలంలోని కాట్రియాల, దంతెపల్లి, పర్వతాపూర్ పంచాయతీల పరిధిలోని గిరిజన తండాల్లో పదేళ్లక్రితం నిర్మించిన వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా ఉండటంతో, ఈమూడు తండాల్లో తీవ్రస్థాయిలో నీటి ఎద్దడి నెలకొంది. తండాల్లోæ ఉన్న చేతిపంపులు చెడిపోవడంతో నీటికోసం ఇబ్బందుల పాలవుతున్నారు.
రేగోడ్ మండలం దోసపల్లి గ్రామ పంచాయతీలోని సంగమేశ్వర తండాలో సుమారు 225 మంది జనాభా ఉంది. ఇందులో రెండు చేతి పంపులు ఉన్నా నీళ్లు సరిగ్గా పనిచేయటంలేదు. ఇరవై రోజులుగా తాగునీటికి కోసం తండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దశంకరంపేటకు రేగోడ్ మండలం బోరంచ నుంచి మంజీర సరఫరా అవుతుంది. గత ఏడాది నుంచి నూతనంగా పైప్‌లైన్లు వేస్తుండడంతో పాటు, రహదారి విస్తరణ వల్ల పాత పైపులైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో పెద్దశంకరంపేటకు తాగునీరు నీరు సరఫరా కావడం లేదు. కమలాపూర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.
ఈ వేసవిలో మాత్రం తాగునీటికి ఇబ్బందులు తప్పేలాలేవు. మండల పరిధిలోని బూర్గుపల్లితాండాలలో మంచినీటి ట్యాంకులు ఉన్నా నీరు సరఫరా లేదు. తండా వాసులు పంట పొలాల్లోంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. చేగుంట మండల కేంద్రమైమైన బుడగ జంగాల కాలనీలో ఏళ్ల నుంచి నీటి తిప్పలు పడుతూనే ఉన్నారు. కాలనీలో 40 కుటుంబాలు ఉండగా కాలనీ సమీపంలోనే ఓ వాటర్ ట్యాంకుతో పాటు మినీ ట్యాంకులను నీటి సరఫరా కోసం నిర్మించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. నీటి సమస్యను తీర్చడానికి కాలనీ సమీపంలో బోరుబావిని తవ్వించినా నీరు రాలేదు.
నీటి సమస్యను గుర్తించే పనిలో అధికారులు
జిల్లాలో నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మండలాల వారీగా నీటి సమస్య ఉన్న గ్రామాలను, పనిచేయని బోరుబావుల వివరాలు సేకరిస్తున్నారు. నీటి సమస్య నెలకొంటే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు గురించి ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
నీటి ఇబ్బందులు తప్పడం లేదు
తండాలో కొత్తగా బోరు వేసినా తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. ఉన్న రెండు చేతిపంపుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. తాగునీటి సమస్య ఎప్పటిలాగే ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– రవి, తండావాసి, రేగోడ్ మండలం.
నీళ్ల కోసం పొలాల వద్దకు పోతున్నాం
మా కాలనీలో నీళ్ల కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. బోర్లలో నీరు లేకపోవడంతో పొలాల దగ్గర బోర్లవద్ద నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఎండాకాలం వస్తే నీటి కోసం ఎంత కష్టపడాలో అర్థమైతలేదు. కాలనీలో ఉన్న ట్యాంకుల్లోకి నీళ్లు వచ్చేలా చేసి మావాడలో నీటి సమస్యను తీర్చాలి. అందరం కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లమే ఉన్నాం. నీటి ఇబ్బందులతో ఒక్కో సారీ పనులకు కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే కాలనీలోకి నీళ్లు వచ్చేలా చేయాలి
– కడమంచి సత్తమ్మ, బుడగజంగాల కాలనీ, చేగుంట.