రైతు కంట్లో ఇసుక!
► కృష్ణా తీరంలో అడ్డగోలు తవ్వకాలు
► అడుగంటుతున్న భూగర్భ జలాలు
► ఉచితం పేరుతో ‘తమ్ముళ్ల ’ ఇష్టారాజ్యం
► పట్టించుకోని అధికారులు
తాడేపల్లి రూరల్:- ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చే సమయంలో అధికారులు నిబంధనలకు నీళ్లొదిలేశారు.. ఉచిత ఇసుక సరఫరా అయినప్పటికీ ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతోంది. దీంతో కృష్ణా ఎగువ, దిగువ ప్రాంతాల్లో భూగర్భ జాలాలు అడుగంటాయి. దీంతో కృష్ణమ్మకు జలకళ తప్పింది. ఇసుక తవ్వకాలతో పచ్చగా ఉన్న ప్రాంతం బీడుగా మారుతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక రీచ్‌ల తవ్వకానికి ప్రథమంగా పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సిఉంది. అది కష్టతరమైన పని కావడంతో అక్రమార్కులు చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని అనుమతులు ఇచ్చే భూగర్భశాఖ, జల వనరుల శాఖ అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు.
జిల్లా అధికారులు 50 వేల క్యూబిక్ మీటర్ల లోపు ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వవచ్చని తెలుసుకున్న ‘మాఫియా’ ఒకే గ్రామంలో నాలుగు, ఐదు చోట్ల అనుమతులు పొందేలా చూసుకుంది. ఇసుక తవ్వకాలు నిర్వహించే ప్రాంతంలో 8 మీటర్ల (25 అడుగుల) మేర ఇసుక ఉండి, దాని కింద జల వనరులు ఉన్నప్పుడు మాత్రమే ఒక మీటరు వరకు ఇసుక తవ్వుకునే అవకాశం ఉంది. ఇసుక మాఫియా అడుగు పెట్టిన టీడీపీ నేతలకు అధికారులు ఇలాంటి సూచనలే వీ చేయలేదు. దీంతో బరితెగించిన నాయకులు రెండు నుంచి నాలుగు మీటర్ల వరకూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భూగర్భజలాలు అడుగంటడమే కాక అన్నదాతలు నష్టపోవాల్సివస్తుంది.
130 అడుగులు తవ్వినా నీళ్లు పడటం లేదు..
బోరులో నిత్యం మూడు అంగుళాల బోరులో రెండున్నర అంగుళాల నీటి ధార వచ్చేది. మేం రోజుకు రెండెకరాలకు నీళ్లు పెట్టేవాళ్లం. ప్రస్తుతం ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో బోర్ల నుంచి వచ్చే నీరు తగ్గుముఖం పట్టింది. గతంలో 80 అడుగుల లోతులో నీళ్లు పడేవి, ప్రస్తుతం 130 అడుగుల్లోనూ నీళ్లు పడటం లేదు. ఈ నెలలో మరీ దారుణం. మున్ముందు పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. - యేసు ప్రసాద్, చిర్రావూరు