ఇతర కాంట్రాక్టర్లతో బీటెక్ రవి అనుచరుల వాగ్వాదం
వైఎస్సార్ జిల్లా గుండ్లమూల ఇసుక రీచ్ కోసం ఘర్షణ
కడప కోటిరెడ్డి సర్కిల్: ఇసుక కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు గురువారం సిగపట్లు పట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు, సిద్దవటం మండల జనసేన పార్టీ నాయకుడు అతికారి కృష్ణ వర్గీయులు బాహాబాహీకి దిగారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కలెక్టరేట్‌లోనే ఈ రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణపడ్డాయి. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల గ్రామం వద్ద ఇసుక రీచ్‌కి గనులు, భూగర్భ శాఖ జిల్లా స్థాయి ఇసుక కమిటీ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గురువారం సాయంత్రం 5.30 లోగా టెండర్లు దాఖలు చేయాలని, 17వ తేదీ ఉదయం 10 గంటలకు టెండర్లు తెరుస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. టెండర్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్ ఆవరణలోని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి ఇరువర్గాల నాయకులు గురువారం ఉదయమే చేరుకున్నారు. టెండరు పత్రాల దాఖలు సమయంలోనే వివాదం మొదలైంది.
తమ సొంత మండలమైన సిద్దవటంలో ఇసుక టెండరు తమకే దక్కాలని అతికారి కృష్ణ వర్గీయులు పట్టుపట్టారు. బీటెక్ రవి వర్గీయులు ససేమిరా అన్నారు. అతికారి కృష్ణ వర్గీయుల నుంచి టెండరు ఫారాలు లాగేసుకున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి, అతికారి కృష్ణ వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారి తీసింది.
ఒక దశలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో కార్యాలయం ప్రాంతం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో అక్కడి ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణ వాతావరణంలోనే టెండర్లు వేశారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు సైతం టెండర్లకు హాజరయ్యారు.
టెండర్లను ఖరారు చేస్తారా లేదా తిరిగి నిర్వహిస్తారా అనే విషయం కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా మైన్స్ అండ్ జియాలజీ డీడీ సూర్యచంద్రరావు అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment