ఇసుక కాదది.. ఎల్లో బురద | Eenadu Ramoji Rao Fake News On Sand Mining Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇసుక కాదది.. ఎల్లో బురద

Published Mon, Sep 12 2022 5:11 AM | Last Updated on Mon, Sep 12 2022 2:18 PM

Eenadu Ramoji Rao Fake News On Sand Mining Andhra Pradesh - Sakshi

అయ్యా... రామోజీరావూ!! కాస్త సలహా చెప్పకూడదూ.. రాష్ట్రంలో ఇసుక ఎలా విక్రయించాలో? ఎవరిద్వారా విక్రయించాలో? ఎంతకు విక్రయించాలో? ఎందుకంటే మీ సలహా సూచనల ప్రకారం.. మీ అదుపాజ్ఞల్లో నడిచే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. కాబట్టి మీ వాటాలు మీకు రావు. ఆ కడుపుమంటతో రగిలిపోతూ మీరు రాసే కథనాలకు విశ్వసనీయత కాదు కదా... వాటిలో వీసమెత్తు విజ్ఞత కూడా ఉండటం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచి జేపీ సంస్థకు అప్పగిస్తే... ఇక్కడి సంస్థలు లేవా అంటూ వాపోయింది మీరే.

ఆ సంస్థ చెన్నైకి చెందిన మరో సంస్థకు సబ్‌ కాంట్రాక్టుకిస్తే... రీచ్‌లన్నీ తమిళనాడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, లేబర్‌ కూడా కనీసం తెలుగువారు లేరని ఆక్రందనలు చేసిందీ మీరే. ఇప్పుడేమో ఏమీ లేకున్నా... చెన్నై సంస్థ తప్పుకుంటోందని, అంతా స్థానిక నేతల చేతుల్లోకి వెళ్లిపోతోందని గుండెలు బాదుకుని రోదిస్తున్నదీ మీరే!!. అసలేంటి మీ బాధ? ప్రభుత్వ వ్యతిరేకత అనే ఏకసూత్ర ఎజెండాతో రోజూ కాలాల కొద్దీ వార్తలు వండి వారుస్తున్న మీకు... మనస్సాక్షి ఉండదా? పోనీ మీ పాఠకులకైనా అది ఉంటుందని మీరనుకోరా? బాబుకు అధికారం లేకపోతే.. ఆయన, మీరు ఇలా పోటీపడి మరీ దిగజారిపోవాలా!? 
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం సమీపంలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు (ఫైల్‌) 

ఈ రాష్ట్రంలో ఏ మంచిపని జరిగినా ‘ఈనాడు’కు నచ్చదు. ‘వైఎస్సార్‌ కళ్యాణమస్తు’ పేరిట నిరుపేదల కళ్యాణానికి ప్రభుత్వం బాసటగా నిలవటమనేది రామోజీ ఒంటిపై తేళ్లూజెర్రులూ పాకించినట్లుంది. అందుకే ఆ వార్తకు ప్రాధాన్యమివ్వకుండా పాఠకుల్ని పక్కదోవ పట్టించడానికి ‘ఇక నేతలదే ఇసుక’ అనే బురద కథనాన్ని పతాక శీర్షికల్లో వార్చేశారు.

అసలు చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన ఇసుక దోపిడీని వర్ణించడం సాధ్యమా? ఉచితమనే పేరుతో టీడీపీ లీడర్లంతా దందా చేస్తూ... జనానికి భారీ రేట్లకు విక్రయిస్తూ సాగించిన అరాచకాలపై ‘ఈనాడు’ ఏనాడైనా ఒక్క అక్షరం ముక్క రాసిందా? అడ్డు వచ్చిన మహిళా అధికారిని టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఈడ్చేసినా... చంద్రబాబు ఇంటి పెరట్లో రాత్రీపగలూ లారీలకొద్దీ ఇసుకను కుమ్మేసినా అదంతా బాబు ఘనతేనని చెబుతూ తరించిపోయారు రామోజీరావు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడంతో పాటు... ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు... అంటే ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు ఆదాయం వచ్చేలా చేశారు. ఆ టెండర్లను కూడా జాతీయ స్థాయిలో... కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. నిజంగా ఇసుక విక్రయం తాను రాసినంత లాభసాటిగా ఉంటుందని భావిస్తే ఆనాడే రామోజీరావు నేరుగా రూ.120 కోట్లు డిపాజిట్‌ కట్టి టెండర్లలో పాల్గొని ఉండొచ్చు. అలా చేయకుండా విమర్శలు చేయటాన్ని ఏమనుకోవాలి?  
ఫైల్‌ ఫొటోలు 

మీకసలు కల్లోనైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? 
ఇప్పుడు ఇసుకపై ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. పైపెచ్చు ప్రజలకు ఏ ధరకు విక్రయించాలో ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఇందుకోసం ‘ఈనాడు’తో సహా పత్రికల్లో ప్రతి ఆదివారం ప్రకటనలిస్తోంది. దీన్లోనే ధరను నిర్దేశించటంతో పాటు... ఆ ధరకు విక్రయించకపోతే ఫిర్యాదు చేయాల్సిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) నెంబర్లూ ఇస్తోంది. ఫిర్యాదులొచ్చిన చోట ఎస్‌ఈబీ దాడులు చేయటమే కాక కేసులూ నమోదు చేస్తోంది.

ఇవి చాలవా రామోజీ... ఇసుక విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో చెప్పటానికి? అసలు చంద్రబాబు హయాంలో వీటిలో ఏ ఒక్కటైనా ఉందా? ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా రాలేదు. అలాగని ప్రజలకూ ఫ్రీగా అందలేదు. ఇప్పటికన్నా ఎక్కువ ధరలకే విక్రయించారు. ఇక నేతల దందాపై ఫిర్యాదు చేసే అవకాశం లేదు. చేసినా పట్టించుకునే దిక్కూ లేదు. నేతలు చెలరేగిపోయి దౌర్జన్యాలకు పాల్పడినా... వాటన్నిటినీ హీరోగారి చర్యల్లానే చూస్తూ తాదాత్మ్యం చెందారు రామోజీరావు. ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... వాటికి లేని రంధ్రాలు వెదుకుతూ మరీ దిగజారుడు కథనాలు అచ్చేయటమే ఘోరాతిఘోరం.  

సబ్‌ కాంట్రాక్టులకివ్వటం తప్పా? 
ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్థలైనా కాంట్రాక్టు ఇచ్చేటపుడు కొన్ని అర్హతలను నిర్దేశించి, కాంట్రాక్టు సంస్థకు కొన్ని నిబంధనలు విధిస్తారు. ఆ అర్హతలకు లోబడి కాంట్రాక్టును సాధించిన సంస్థ... సదరు నిబంధనలను పాటిస్తోందో లేదో పర్యవేక్షించటమే ప్రభుత్వ విధి. ఆ నిబంధనలకు లోబడి సదరు కాంట్రాక్టు సంస్థ ఎవరికైనా సబ్‌ కాంట్రాక్టుకి స్తే వద్దనే హక్కు ఎవరికీ ఉండదు.

ఇవన్నీ రామోజీకి తెలియనివి కావు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను చంద్రబాబు నాయుడు టీడీపీ నేత శ్రీనివాస్‌కు అప్పగిస్తే... ఆయన సదరు పనులను సీఎం రమేష్‌ కంపెనీకి సబ్‌ కాంట్రాక్టుకిచ్చాడు. ఇక పోలవరం పనుల్లో ఏకంగా రూ.3వేల కోట్లకుపైగా పనుల్ని రామోజీ వియ్యంకుల కంపెనీ నవయుగకు కేవలం నామినేషన్‌పై ఇచ్చేశాడు చంద్రబాబు. ఇవన్నీ ‘ఈనాడు’కు సమయోచిత నిర్ణయాలుగా కనిపించటమే దౌర్భాగ్యం.  

నిరంతర పర్యవేక్షణ... అవసరమైన నిల్వలు 
జేపీ సంస్థ నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు, ఇసుక డిపోలను గనుల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.  ఎప్పటికప్పుడు ఇసుక నిల్వలు, ఏ మేరకు అనుమతులకు దరఖాస్తు చేశారనే దానిని గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకోవడం సాధారణం. దీనికి విరుద్ధంగా.. ఇప్పటివరకు గనుల శాఖ రీచ్‌లు, ఇసుక డిపోలను పరిశీలించనే లేదంటూ ‘ఈనాడు’ అచ్చేసిన కథనం లక్ష్యం ప్రభుత్వంపై విషం చిమ్మటమేననటానికి నిదర్శనం... ఆ శాఖ వివరణ కూడా తీసుకోకపోవటమే.

మరో విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో వర్షాకాలం 4 నెలల పాటు ఇసుక లభించక రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయేవి. కారి్మకులు ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీనికి ప్రణాళికాబద్ధంగా అడ్డుకట్ట వేసింది. వర్షాకాలంలోనూ ఇసుక లభ్యమయ్యేందుకు దాదాపు 50 లక్షల టన్నులకుపైగా ఇసుకను డిపోల్లో నిల్వ చేయించారు. దీంతో ఎక్కడా నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడలేదు. ఇవన్నీ ‘ఈనాడు’ చెప్పదు.  

ఇసుక ఆపరేషన్స్‌పై  పటిష్టమైన నిఘా 
రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై పటిష్టమైన నిఘా వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జేపీ వెంచర్స్‌ ఇసుక విక్రయాలకు క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న రశీదులను జారీ చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా సరిహద్దు చెక్‌ పోస్ట్‌ల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఎస్‌ఇబి, గనుల శాఖ, రెవెన్యూ, స్థానిక పోలీస్‌ అధికారులకు అక్రమ తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకునే అధికారమిచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కేసుల్లో రెండు లక్షల జరిమానాతో పాటు రెండేళ్ళ పాటు జైలు శిక్ష కూడా విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రతి జిల్లాకు విజిలెన్స్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి వాస్తవాలతో పనిలేదు కాబట్టి రామోజీ తన మార్కు పాత్రికేయానికి పదునుపెడుతున్నారు.  

ఆ వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? 
ఇప్పుడు ఇసుకను కాంట్రాక్టుకు ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి ఐదేళ్లలో వచ్చే రూ.4వేల కోట్లు అప్పుడు ఐదేళ్లలో ఎవరి జేబుల్లోకి పోయాయన్నది జవాబులేని ప్రశ్నేమీ కాదు. చంద్రబాబు, ఆయన మీడియా మిత్రులైన ట్రిపుల్‌ ఆర్‌ (రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 రవీంద్రనాథ్‌ నాయుడు) చేతుల్లోకేనన్నది ఎవరికీ తెలియనిదీ కాదు.

ఈ చతుష్టయం బరి తెగించేసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అంటూ చెలరేగి పోయిందని, అవన్నీ ఇప్పుడు సాగటం లేదు కనకే ఇసుకపై నిత్యం ఏదో ఒకటి రాస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. అందులో భాగమే... ఆదివారంనాటి కథనం. ఎక్కడో చెన్నైలోని హోటల్లో సమావేశం జరిగిందని, అందులో ఒక నిర్ణయం తీసేసుకున్నారని... అందులో పాల్గొన్నట్టుగా, బల్లకింద ఉండి గమనించినట్లుగా రామోజీ రాసి పారేయడాన్ని ఏమనుకోవాలి? కళ్యాణమస్తు అనే మంచి పథకానికి ప్రచారం కల్పించకుండా ఉండేందుకే ఇలా చేశారనుకోవాలి.

అయినా సబ్‌ కాంట్రాక్టు ఎవరికివ్వాలనే దానిపై జేపీ సంస్థ అత్యంత రహస్యంగా, స్టార్‌ హోటల్‌లో చర్చలు జరపాల్సినంత అవసరం వుందా? ‘ఈనాడు’ రాసినట్లు నిజంగా వైసీపీ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్‌ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి.  

ఇవీ... ఇసుక వెనక నిజాలు 
► పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించిన టెండర్లలో.. రెండేళ్లపాటు రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ నిర్వహించే కాంట్రాక్టును జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థ దక్కించుకుంది. దీనికోసం ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లిస్తోంది.  
► సబ్‌ కాంట్రాక్టుకు ఇవ్వాలా.. వద్దా? ఎవరికివ్వాలి? వంటివన్నీ పూర్తిగా కాంట్రాక్టు సంస్థ ఇష్టం. సబ్‌ కాంట్రాక్టరు ఎవరైనా బాధ్యత మాత్రం జేపీదే.  
► ఇందులో భాగంగానే జేపీ సంస్థ టర్న్‌ కీని ఎంచుకుంది. దీంతో ప్రభుత్వానికెలాంటి సంబంధం ఉండదు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం చెప్పినా... రామోజీ బురద రాతలు మానలేదు.  
► ఇప్పుడు టర్న్‌ కీ సంస్థ తప్పుకుందంటూ... అదికూడా ప్రభుత్వ పెద్దలతో పొసగకనే అంటూ అడ్డగోలు రాతలకు దిగజారారు. అసలు సబ్‌ కాంట్రాక్టరు విషయంలోనే జోక్యం చేసుకోని ప్రభుత్వం, ఆ సబ్‌ కాంట్రాక్టరు పనుల్లో ఎందుకు జోక్యం చేసుకుంటుంది?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement