Andhra Pradesh: కాసులకే ఇసుక | TDP Leaders Control All the sand reaches in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: కాసులకే ఇసుక

Published Tue, Oct 29 2024 4:10 AM | Last Updated on Tue, Oct 29 2024 10:35 AM

TDP Leaders Control All the sand reaches in Andhra Pradesh

యధావిధిగా తవ్వకం, లోడింగ్‌ చార్జీలు, జీఎస్టీ.. రవాణా చార్జీలు తడిసి మోపెడు

లారీ ఇసుక రూ.25 వేల నుంచి రూ.45 వేలకు పైనే 

రీచ్‌లన్నీ పచ్చ ముఠాల కనుసన్నల్లోనే

సొంత అవసరాలకు ప్రజల్ని తీసుకెళ్లనివ్వకుండా తిష్ట

ఎవరైనా సరే డబ్బులు కట్టాకే కదలాలని బెదిరింపులు

సర్కారు వింత విధానాలతో నిర్మాణ రంగం కుదేలు.. 

40 లక్షల మంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం  

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో శనివారం 20 టన్నుల ఇసుక కోసం ఓ వినియోగదారుడు అధికారికంగానే రూ.18,570 చెల్లించాడు. ఇదికాకుండా లోడ్‌ చేసినందుకు రూ.3 వేలు, టోల్‌గేట్‌ రూ.660, ఇతరాలన్నీ కలిపి ఇంటికి వెళ్లేసరికి రూ.25 వేలు సమర్పించుకున్నాడు. 

⇒ విశాఖలో 20 టన్నుల ఇసుకను రూ.45 వేలకుపైగా చెల్లించి కొనాల్సి వస్తోంది. విజయవాడలోనూ 20 టన్నుల ఇసుక రూ.25 వేలకు తక్కువ దొరకడం లేదు.

సాక్షి, అమరావతి:
డబ్బులెవరికీ ఊరికే రావు..! 
ఉచిత ఇసుక కూడా ఊరికే రాదు!!
డబ్బులిస్తే మాత్రం ఉచితంగానే వస్తుంది!!
విచిత్రంగా ఉన్నా ఇది నిజం! ఉచిత ఇసుక అంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రీచ్‌లను పచ్చముఠాల చేతుల్లో పెట్టేసి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఉచితంగా ఇస్తున్నామని నమ్మబలుకుతూ వినియోగదారుల ముక్కు పిండి వసూలు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాధారణ ధరకు ఇసుక దొరికే పరిస్థితి లేకుండాపోయింది. 20 టన్నుల లారీ ఇసుక రూ.25 వేల నుంచి రూ.45 వేలకు పైనే పలుకుతోంది. ట్రాక్టర్‌ ఇసుకను రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 

ఇంత డబ్బులు కట్టాక ఇక ఉచితం ఏమిటని వినియోగ­దారులు వాపోతున్నారు. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్‌ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే 40 లక్షల టన్నులను పచ్చముఠాలు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం తెలిసిందే. మిగతా ఇసుకను సైతం ఊడ్చేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేయడంతో 40 లక్షల మందికిపైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. 

వసూళ్లు మామూలే
ఇసుకపై జీఎస్టీ, సీనరేజీ చార్జీలు రద్దు చేశామంటూ ఇటీవల మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి సర్కారు ప్రకటించింది. అయితే వసూళ్లు మాత్రం ఆగ­లేదు. తవ్వకం, లోడింగ్‌ చార్జీలతోపాటు జీఎస్టీ ము­క్కు­­పిండి వసూలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. 

రీచ్‌లన్నీ ప్రైవేట్‌ చేతిలో పెట్టేసి..
ఇసుక రీచ్‌లను టెండర్ల ప్రక్రియ నిర్వహించి మరీ ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించిన కూటమి సర్కారు ఉచితంగా ఇస్తున్నట్లు బుకాయించడం విడ్డూరంగా ఉందని ప్రజాసంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టన్ను ఇసుక తవ్వేందుకు రూ.35 నుంచి రూ.120 వరకూ వసూలు చేసేలా టెండర్‌ వేసి దక్కించుకున్న టీడీపీ నేతలు ఉచితంగా ఎందుకు ఇస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం విచిత్రమైన సమాధానాలు చెబుతోంది. ఇసుక కావాల్సిన వారు రీచ్‌లకు నేరుగా కార్మికులను తీసుకెళ్లి తవ్వించుకుని లోడ్‌ చేయించుకోవాలని ఉచిత సలహాలిస్తోంది! లేదంటే కాంట్రాక్టు సంస్థలకు డబ్బులు కట్టి ఇసుకను తీసుకెళ్లాలంటోంది. 

రీచ్‌లు లేని చోట్ల సొంత మనుషులకు లైసెన్సులు! 
ఒకవైపు రీచ్‌లన్నింటినీ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేసి మరోవైపు వినియోగదారులు లారీలు, కార్మికులను తీసుకెళ్లి ఇసుక తవ్వించుకుని తీసుకెళ్లాలని ప్రభుత్వం చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు రీచ్‌లు అప్పగించిన తర్వాత వినియోగదారులు వారిని కాదని ఇసుకను తవ్వించే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాలి. 

ఉచితంగా ఇస్తున్నట్లు చిత్రీకరించే క్రమంలో ఇలాంటి వింత విధానాలు తెచ్చింది. సాధ్యం కాని రీతిలో ప్రజలే ఇసుకను తవ్వించుకోవాలని చెబుతూ పచ్చ ముఠాల దోపిడీకి లైన్‌ క్లియర్‌ చేసినట్లు తేటతెల్లమవుతోంది. ఇక ఇసుక రీచ్‌లు లేని జిల్లాల్లో తమ సొంత మనుషులకు మినరల్‌ డీలర్‌ లైసెన్సులు ఇచ్చి మరో తరహా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఆయా జిల్లాల్లో ఇందుకు టెండర్లు పిలవనున్నారు. 

తీసుకెళ్లనివ్వని ‘తమ్ముళ్లు’
స్థానిక అవసరాలకు ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఎవరైనా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చన్న ప్రభుత్వ ప్రకటన బోగస్‌ అని తేలిపోయింది. ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇసుకను లోడ్‌ చేయించుకునేందుకు టీడీపీ నేతలు ఎక్కడా ఒప్పు­కోవడం లేదు. సామాజిక అవసరాలు, వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా స్థానికంగా ఎక్కడా అందుకు అవకాశం ఇవ్వడం లేదు. 

ఎవరైనా సరే తమకు డబ్బు కట్టాల్సిందేనని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు వారే ట్రాక్టర్లలో ఇసుకను రీచ్‌ల నుంచి ప్రైవేట్‌ డంప్‌లకు భారీగా తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తు­న్నారు. రీచ్‌ల్లో అమ్మకాల కంటే అక్రమ రవా­ణాయే ఎక్కువగా జరుగుతోంది. ఎవరైనా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలనుకున్నా అది అంత సులభంగా జరిగే ఆస్కారం లేకుండా పోయింది. ఎప్పుడు ఓపెన్‌ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నానా తిప్పలు పడి ఎలాగోలా బుక్‌ చేసుకున్నా స్లాట్‌ రావడానికి నాలుగైదు రోజులు పడుతుండటంతో నిర్మాణదారులు లబోదిబో
మంటున్నారు.

ఉచిత ఇసుక ఊరికే రాదు .. డబ్బులిస్తే మాత్రం .

పూతలపట్టు నుంచి బెంగళూరుకు !
రోజూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీడీపీ నేత
సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమి ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ టీడీపీ నేతలకు వరంగా మారింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్లడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించటంతో ఆ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా నదులు, వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించి సురక్షిత ప్రాంతాల్లో డంపింగ్‌ చేస్తున్నారు. 

అక్కడి నుంచి రాత్రిళ్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఒక టీడీపీ నేత నిర్వాకమే ఇందుకు నిదర్శనం. పూతలపట్టు మండలం వావిల్‌తోట వంకలోని ఇసుకను టీడీపీ నేత తవ్వించి ట్రాక్టర్లలో తరలించి శివారు ప్రాంతంలోని వినియోగంలో లేని క్రషర్స్, వాటి పరిసర ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నారు. 

రాత్రి వేళ ఆ ఇసుకను లారీలు, కంటైనర్ల ద్వారా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా ఎవరైనా అడిగితే... తన సొంతానికి అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా 15 రోజులుగా నిత్యం పెద్ద ఎత్తున ఇసుకను అడ్డగోలుగా తవ్వి బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసింది. సదరు టీడీపీ నేత ఈ దందాలో మరికొందరు టీడీపీ నాయకులు, అధికారులకు వాటా ఇస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

పెన్నా నదిలో ‘వసూళ్ల గేటు’
ఇసుక తీసుకెళుతున్న ఎడ్లబండ్లు, ట్రాక్టర్లకు డబ్బు వసూలు చేస్తున్న టీడీపీ నేత
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం రామా­పురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరుడు గుర్రప్ప అలి­యాస్‌ గురివిరెడ్డి ఏకంగా పెన్నా నదిలో అనధి­కార గేటు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒంటెద్దు బండికి రూ.150, రెండు ఎడ్ల బండ్లకు రూ.300, ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.1,200 చెల్లిస్తే కానీ పెన్నా నదిలోకి అనుమ­తించడం లేదు. 

ఇందుకోసం ప్రత్యేకంగా పెన్నా నదిలో గేటు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధి­లోని కొందరు వ్యక్తులు పెన్నా నదిలోని ఇసుకకు మీకు ఎందుకు గేటు చార్జీలు చెల్లించాలని సోమవారం వాగ్వాదానికి దిగడంతో ఈ పంచాయితీ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. అయినా ఫలితం లేకపోయింది. గేటు దగ్గర వసూళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.

అక్రమ రవాణాకు అడ్డా
రామాపురం గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండటంతో ఇసుక అక్రమ రవాణా కొనసాగు­తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మండల పరిధిలోని పెన్నా నది పరీవాహక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement