ఇసుక బ్లాక్‌! సంక్షోభంలో భవన నిర్మాణ రంగం | Construction sector is in crisis across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇసుక బ్లాక్‌! సంక్షోభంలో భవన నిర్మాణ రంగం

Published Sun, Oct 6 2024 4:15 AM | Last Updated on Sun, Oct 6 2024 8:40 AM

Construction sector is in crisis across Andhra Pradesh

రాష్ట్రమంతటా సంక్షోభంలో భవన నిర్మాణ రంగం 

ఎక్కడికక్కడ అర్ధంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలు

రోడ్డున పడ్డ 45 లక్షల మందికిపైగా కార్మీకులు 

ఉచిత ఇసుక అంటూ అసలే దొరక్కుండా చేసిన టీడీపీ ప్రభుత్వం.. ఇసుక లేదు గానీ.. బ్లాక్‌లో దొరుకుతోంది 

గతం కన్నా మూడింతలు ధర పెంచేసి జేబులు నింపుకుంటున్న కూటమి నేతలు 

2019–24 మధ్య ఇసుక ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఇప్పుడు ఆ ఆదాయం అధికార పార్టీ నేతల జేబుల్లోకి..

వర్షాల సీజన్‌ కోసం ముందుచూపుతో 80 లక్షల టన్నులు నిల్వ చేసిన గత సర్కారు 

కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే 40 లక్షల టన్నులు స్వాహా.. మిగిలిన 40 లక్షల టన్నులు ఉచితం పేరుతో అధిక ధరలకు విక్రయం 

ఇప్పుడు అదీ మాయం కావడంతో ఇసుకకు భారీ డిమాండ్‌.. 18 టన్నుల ఇసుక లారీ రూ.35 వేల నుంచి రూ.60 వేలు

రాష్ట్రంలో స్థానికంగా ఉండే వారు, వలస వచ్చిన వారితో కలిపి 45 లక్షల మంది భవననిర్మాణ రంగంపై ఆధారపడి పని చేస్తున్నారు. తాపీ పనికి అనుబంధంగా రాడ్‌ బెండింగ్, సెంట్రింగ్, ఫ్లంబింగ్, పెయింటింగ్, ఫాల్స్‌ సీలింగ్, మార్బుల్స్, టైల్స్‌ వంటి 36 రకాల వృత్తుల వారు పని చేస్తున్నారు. ఇసుక లేక నిర్మాణాలు నిలిచి పోవడంతో ప్రస్తుతం వీరందరూ ఉపాధి కోసం ఆయా నగరాలు, పట్టణాల్లోని 4 రోడ్ల కూడళ్లలో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా పనికి పిలుస్తారనే ఆశతో పడిగాపులు కాస్తున్నారు. ఇసుక కరువు తమ ఉపాధిని దెబ్బ తీసిందని, నోట్లోకి నాలుగు వేళ్లు పోవడం లేదని వాపోతున్నారు. గతంలో మాదిరిగా ఇసుక సరఫరా యధావిధిగా జరిగితే తప్ప వీరందరికీ పని దొరకదన్నది చేదు నిజం.  

కాకినాడలో ఇల్లు కట్టుకుంటున్న రాఘవేంద్రరావు ఇసుక కోసం పది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ట్రక్కు ఇసుక దొరికితే పని ఆగకుండా చేయించవచ్చని చూస్తున్నాడు. ఇసుక అమ్మేవాళ్లు, లారీల వాళ్లని అడిగితే లేదని చెబుతున్నారు. ఇసుక పోర్టల్‌లో నేరుగా బుకింగ్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిందని ఎవరో చెబితే దాన్ని చూశారు. అది ఎప్పుడు ఓపెన్‌ అవుతుందో, ఎలా బుక్‌ చేసుకోవాలో ససేమిరా అర్థం కాలేదు. అయినా తెలుసుకుని ఒక రోజు ప్రయత్నించినా దొరకలేదు. దీంతో అతని ఇంటి నిర్మాణం మధ్యలో అగిపోయింది.

విజయవాడ రామవరప్పాడు సెంటర్‌ లేదా బెంజి సర్కిల్‌లో ఉదయం పూట నిలబడితే భవన నిర్మాణ కార్మికుడు రామారావుకు ప్రతి రోజూ పని దొరికేది. కానీ రెండు నెలలుగా పని దొరకడం ఇబ్బందిగా మారింది. 15 రోజుల నుంచి అది మరీ కష్టమైపోయింది. నిర్మాణాలు ఆగిపోవడంతో పని కోసం పిలిచేవారే కరువయ్యారు. దీంతో అతని ఇల్లు గడవడం కష్టంగా మారింది.

ఇసుక అందుబాటులో లేదని తెలుస్తున్నా, ఎలాగోలా కొనాలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేసి చివరికి నానా కష్టాలు పడి పది టన్నుల లారీని బేరమాడాడు గుంటూరుకు చెందిన శివరామకృష్ణ. గతంలో రూ.15,700 ఉండే ధర ఇప్పుడు రూ.43 వేలు చెప్పారు. గుండె గుభేల్‌మంది. అయినా గత్యంతరం లేక అంత రేటు పెట్టి కొనుగోలు చేయడానికి ఒక రోజు తర్వాత సిద్ధపడ్దాడు. ఆ తర్వాత రోజు అడిగితే రేటు మరో రూ.20 వేలు పెంచి.. రూ.63 వేలు చెప్పారు. ఇలాగైతే ఇల్లు కట్టినట్లేనని బాధను దిగమింగుకుంటున్నాడు.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక బంగారంలా మారిపోయిందని చెప్పడానికి ఈ ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర సహా ఏ ప్రాంతంలోనూ ఇసుక దొరకడం లేదు. పైకి మాత్రం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవంగా దొరకడమే గగనంగా మారిపోయింది. ఎక్కడైనా అతికష్టం మీద దొరికిన చోట దాని రేటు చూసి నివ్వెరపోవాల్సిందే. గత ప్రభుత్వంలో అమ్మిన రేటు కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటోంది. దీనికంతటికీ కారణం ఉచితం పేరుతో కూటమి ప్రభుత్వ నేతల అడ్డగోలు దోపిడీ విధానమే. 

వెరసి రాష్ట్రమంతటా భవన నిర్మాణ రంగం సంక్షోభంలో పడిపోయింది. వాస్తవానికి వర్షాకాలంలో ఇసుక సమస్య రావడం సాధారణం. అయితే ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ఈ సమస్య రాదు. కానీ టీడీపీ ప్రభుత్వానికి ఆ ముందు చూపు లేక గత ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుకను అడ్డగోలుగా దోచేసింది. వర్షాల సీజన్‌లో ఇసుక సమస్య రాకుండా చూసేందుకు 80 లక్షల టన్నులకుపైగా ఇసుకను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంచింది. 

జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మూడు పార్టీల నేతలు ఈ నిల్వలపై బకాసురుల్లా పడ్డారు. ఎక్కడికక్కడ ఇసుక డంప్‌లను కొల్లగొట్టి అమ్మేసుకున్నారు. కేవలం 10–15 రోజుల వ్యవధిలోనే 40 లక్షల టన్నుల ఇసుకను దోచేశారు. మిగిలిన 40 టన్నుల ఇసుకను ఉచితం పేరుతో గత ప్రభుత్వంలో కంటే మూడు నాలుగు రెట్లు అధిక ధరకు విక్రయించారు. గతంలో ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేది. ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి చేరుతోంది.  

దొరికిన చోట 18 టన్నుల లారీ రూ.35 వేల పైనే.. 
ఓ వైపు ఇసుక నిల్వల గురించి పట్టించుకోకుండానే మరోవైపు సీఎం చంద్రబాబు తాపీగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు. దోచేయగా మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తూ.. దానికీ రేటు పెట్టారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఉచితం పేరుతో దోచుకున్నారు. ఇప్పుడూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 టన్నుల ఇసుక లారీ రూ.35 వేలకు పైగా పలుకుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు ఇసుకను దొంగచాటుగా తరలించి, ఏకంగా రూ.60 వేల వరకు అమ్ముకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఉచిత ఇసుక విధానంలో జనానికి ఉపయోగం లేదని, ప్రభుత్వానికీ ఆదాయం లేకుండా పోయిందని.. బాగుపడింది మాత్రం టీడీపీ నేతలు మాత్రమేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇసుక నిల్వలన్నీ తరిగి పోవడంతో అసలు ఇసుకే దొరకడం లేదని చెబుతున్నారు. 

ఇసుక బుకింగ్‌ ఒక ప్రహసనం 
ఎక్కడైనా మిగిలిన కొద్దిపాటి ఇసుకకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ బుకింగ్‌ పెట్టి దాన్ని ప్రహసనంగా మార్చింది. ఇసుక పోర్టల్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చని చెప్పినా, దాని ద్వారా వారానికి ఒకసారి కూడా బుకింగ్‌ చేసుకోవడం కుదరడం లేదు. వారంలో ఎప్పుడో ఒకసారి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇసుక పోర్టల్‌లో బుకింగ్‌ ఓపెన్‌ చేస్తున్నారు. నిమిషాల్లోనే వారం రోజుల బుకింగ్‌లన్నీ అయిపోతున్నాయి. సాధారణ జనం ఎవరైనా దాని కోసం ప్రయత్నిస్తే నిద్ర లేకుండా ఎదురు చూడడం తప్ప ఉపయోగం ఉండడం లేదు. 

నాలుగు వారాలు ప్రయత్నించి ఇటీవల రాజమండ్రి స్టాక్‌ పాయింట్‌ నుంచి 20 టన్నుల ఇసుకను బుక్‌ చేసుకున్న చింతకాయల వీరబాబు అనే వినియోగదారుడి నుంచి భారీగా కట్టించుకున్నారు. ఇక ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నది ఎక్కడన్న ప్రశ్నకు జవాబు లేదు. గతంలో రూ.4 వేలు, 5 వేలకే దొరికే ట్రాక్టర్‌ ఇసుక ఇప్పుడు రూ.15 వేలు, రూ.20 వేలు పలుకుతోంది. మరోవైపు ఇసుక దొరక్కపోవడంతో పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా పెరిగిపోయింది. నదులు, వాగుల నుంచి అక్రమంగా తవ్వి దాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. 



విశాఖ పరిసర ప్రాంతాలకు ఒడిశా నుంచి భారీ ఎత్తున అక్రమంగా రవాణా అవుతోంది. మన రాష్ట్రంలో దొరక్క పోవడంతో అక్కడి నుంచి కొందరు అక్రమార్కులు ఇసుకను రవాణా చేసి విక్రయిస్తున్నారు. వర్షాల వల్ల నదుల్లో ఇసుక తవ్వకాలు జరగడం లేదని అందువల్లే ఇసుక కొరతని ప్రభుత్వం చెబుతోంది. కానీ వర్షాకాలం కోసం నిల్వ చేసిన నిల్వలు ఏమయ్యాయంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు.

నిర్మాణాలన్నీ ఆగిపోతున్నాయి..
ఇసుక అందుబాటులోకి తెచ్చి తమ ఉపాధి కాపాడాలని వేలాది మంది కార్మీకులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సంక్షోభం నెలకొంది. వెరసి రాష్ట్రంలో నిర్మాణ రంగం స్తంభించిపోయింది. చిన్న, మధ్య తరహా నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. ఒక ట్రాక్టర్‌ ఇసుక దొరికినా సాగిపోయే పనులు కూడా ఆగిపోయాయి. 

చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్లు కూడా ఇసుక దొరక్క నిర్మాణాలు ఆపేశారు. కనీసం చిన్నపాటి రిపేర్లు చేయించుకోవడానికి సైతం ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయి. దీంతో దానిపై ఆధారపడి పని చేస్తున్న కార్మీకులు సుమారు 45 లక్షల మంది ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో బిల్డింగ్‌ పనులు చేసే స్థానిక కార్మీకులు 27 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. 

బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది కార్మీకులు బిల్డింగ్‌ పనుల కోసం వలస వచ్చారు. ఒక్క సీఆర్‌డీఏ పరిధిలోనే 8 లక్షల మంది వలస కార్మీకులున్నట్లు అంచనా. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగం బాగా విస్తరించింది. ఈ నేపథ్యంలో ఇసుక లేక నిర్మాణాలు నిలిచిపోవడంతో లక్షలాది మంది కార్మీకుల ఉపాధికి విఘాతం ఏర్పడింది.

100 రోజులైనా ఉచిత ఇసుక లేదు
ఇసుక లభ్యం కాక నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్లాక్‌లో అక్కడక్కడా దొరుకుతున్నా అంత ధర చెల్లించలేక పనులను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధార పడిన కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉచిత ఇసుక ఇస్తామని అధికారంలోకి వచ్చి 100 రోజుల దాటినా, నేటికి ఇవ్వడంలేదు. మరింత రేట్లు పెంచేశారు.
– గొట్టిపాటి సాల్మన్‌ రాజు, సెంట్రింగ్‌ మేస్త్రీ, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా

రాష్ట్రమంతా అదే దందా
⇒ వైఎస్సార్‌ జిల్లాలో ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకోవడానికి వీలవ్వడం లేదు. ఒక వేళ ఎవరికైనా బుకింగ్‌ అయినా సరఫరా కావడం లేదు. జిల్లాలో ఒకే ఒక్క స్టాక్‌ పాయింట్‌ వీరపునాయు­నిపల్లె మండలం ఎర్రబల్లి ప్రాంతంలో మాత్రమే ఉంది. అక్కడ నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఇసుక కొరత వల్ల జిల్లాలో సుమారు 16 వేల వరకు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అన్నమయ్య జిల్లాలో బుడుగుంటపల్లె వద్ద ఒకే ఒక ఇసుక రీచ్, స్టాక్‌ పాయింట్‌ ఉంది. అక్కడా ఇదే పరిస్థితే. దాదాపు 15వేల మంది భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదు.

⇒ పల్నాడు జిల్లాలోని ఆరు స్టాక్‌ పాయింట్స్‌లలో ఇసుక ఖాళీ అయ్యింది. దీంతో ఇసుక బుకింగ్‌ నిలిపివే­శారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భవన నిర్మాణ రంగంపై ఆధార పడిన 90 వేల మంది ఉపాధి కోల్పోయారు. ఇసుక ధర భారీగా పెరగడంతో ఓ మోస్తరు ఇంటి నిర్మాణా­నికి రూ.70 వేల నుంచి రూ.90 వేలు అదనంగా భారం పడుతోంది. సుమారు 20 వేల ఇళ్ల నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది.  

⇒ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలినాళ్లలో పెద్దాపురం స్టాక్‌ పాయింట్‌ నుంచి కాకినాడ జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలు ఐదారు రోజుల వ్యవధిలోనే ఇసుకను ఖాళీ చేసేశారు. ఇప్పుడు బ్లాక్‌ మార్కెట్‌లో తప్ప అధికారికంగా ఎక్కడా దొరకడం లేదు. జగ్గంపేట నియోజకవర్గంలో 18 టన్నుల లారీకి రూ.27–30 వేలు పెట్టాల్సి వస్తోంది. 97 వేల మందికి ఉపాధి కరువైంది.

⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా ఇసుక లభ్యత లేదు. బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. భీమవరానికి లారీ ఇసుక తెచ్చేందుకు రూ.35 వేలు, ఉండికి రూ.32 వేలు, నరసాపురానికి రూ.26 వేలు, తాడేపల్లిగూడేనికి రూ.30 వేలు ఖర్చవుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే లారీకి రూ.10 వేలకు పైగానే అదనపు భారం పడుతోంది. దీంతో పనులు ఆగిపోయాయి. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్లిపోతున్నారు.

⇒ అనంతపురం జిల్లాలోని 31 మండలాలకు ఒకే ఒక ఇసుక స్టాక్‌పాయింట్‌ను రాయదుర్గం మండలం జుంజురాంపల్లిలో ఏర్పాటు చేశారు. అక్కడ సైతం ఇసుక అరకొరగానే అందుబాటులో ఉంది. దీంతో జిల్లా కేంద్రానికి తరలించాలంటే అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో 25 వేల ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.

⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారికంగా ఇసుక లభ్యత లేదు. విజయవాడలో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక రూ.30 వేలు పలుకుతోంది. అంత ధర పెట్టలేక సుమారు 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలు ఎడ్ల బండ్లతో ఇసుకను బయటకు తెప్పించి, అధిక ధరతో విక్రయిస్తున్నారు.

⇒ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఇసుక లభ్యత లేదు. గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ పాయల్లో వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రస్తుతం ఇసుక ర్యాంపులు తెరిచేందుకు అవకాశం లేదు. కూటమి నేతలు అనాలోచితంగా జూలై నాటికే స్టాక్‌ పాయింట్లలోని ఇసుకను కాజేశారు. ప్రస్తుతం చిన్న చిన్న రిపేర్ల పనులు మాత్రమే సాగుతున్నాయి. కొంత మంది దళారులు ఇసుక నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. సుమారు లక్ష మందికి ఉపాధి కరువైంది.

⇒ ఉమ్మడి కర్నూలు, విజయనగరం జిల్లా గుంటూరు, తూర్పుగోదావరి, ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లా , శ్రీకాకుళం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖ జిల్లా, ప్రకాశం జిల్లాల్లో కూడా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. గతంలో కంటే ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో నిర్మాణాలను ఆపేస్తున్నారు. కొత్తగా నిరి్మస్తున్న ఒక్కో ఇంటిపై రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు అదనపు భారం పడుతోంది. ఒక్కో అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అదనంగా రూ.30 లక్షల వరకు ఖర్చవుతోంది.

ఉపాధి కోల్పోతున్నాం
ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇసుక కొరత వేధిస్తోంది. పనులు ఎక్కడిM­ý్కడ నిలిచిపో­యాయి. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నగదు వసూళ్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం?    
– మునస్వామి, భవన నిర్మాణ కార్మికుడు, చిత్తూరు

మాకు ప్రత్యేక భృతి ఇవ్వాలి
భవన నిర్మాణ  పనుల్లో కార్మికులుగా పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇప్పుడేమో ఇసుక కొరత వల్ల పనుల్లేవు. ఇంటి వద్ద ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. మా సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోదు. మా ఇల్లు గడవాలంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా భృతి ఇవ్వాలి. లేదా ఇసుక కొరత అయినా తీర్చాలి. 
– డేవిడ్, భవన నిర్మాణ కార్మికుడు, చిత్తూరు

ఇలా జరగడం ఇదే ప్రథమం
కమ్మి, ఇటుకలు, సిమెంట్‌ దొరక్క ఇంటి నిర్మాణా­లకు ఆటంకా­లు చూశాం. తొలిసారిగా ఇసుక కొరతతో ఇళ్ల నిర్మాణం ఆగి­పో­వడం చూస్తున్నాం. తిరుప­తి జిల్లా వ్యాప్తంగా స్వర్ణముఖి నది నుంచి ఇసుక రావాలి. అధికార పార్టీ నేతలు అనధికారికంగా మాత్రమే ఇసుక తీసి అధిక ధరకు అమ్ముతున్నారు. దీంతో నిర్మాణాలు నిలిచి పనులు కోల్పోయాం. 
– గడ్డం గురవయ్య, తాపీ మేస్త్రీ, వాకాడు

పనులు ఆపేస్తున్నారు
ఇసుక అందుబాటులో లేని కార­ణంగా ఉపాధి కోసం భవన నిర్మాణ కార్మి­కులు వలస వెళ్తు­న్నారు. కూటమి ప్రభు­త్వం హామీ ఇచ్చిన ప్రకారం ఉచిత ఇసుక ఇవ్వలేకపోతోంది. ధర బాగా ఎక్కువగా ఉందని ఇంటి యజమానులు నిర్మాణ పనులు ఆపే­స్తు­న్నా­రు. దీంతో మాకు పనుల్లేక ఇబ్బంది పడుతు­న్నాం.     
– సురేష్, తాపీ మేస్త్రీ, నెల్లూరు

వలస వెళ్తున్నారు 
ఇసుక కొరతతో పను­లు లేక కుటుంబ పోష­ణ భారంగా మారడంతో కార్మికులు పనుల కోసం తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతు­న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. కానీ డబ్బులు పెట్టినా దొరకడం లేదు. 
– షేక్‌ ఖాజావలి, తాపీ మేస్త్రీ, కంభం

ఇసుక కొరత తీర్చకపోతే ఆత్మహత్యే శరణ్యం
నేను 20 ఏళ్లుగా బిల్డర్‌గా కొనసాగు­తున్నాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక కొరత మ­మ్మల్ని వేధిస్తోంది. ఇళ్ల యజ­మానులకు నిర్ణీత సమయంలో భవనం పూర్తి చేసిస్తామని వారి నుంచి కొంత మొత్తం తీసుకున్నాం. ఇసుక దొరక్క బ్లాక్‌లో అధిక ధరలు పలకటంతో భవనాలు మధ్యలో ఆపేశాను. 

ఇంటి యజమానులు మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇసుక బ్లాక్‌లో కొని కట్టిద్దామనుకుంటే ఒక బిల్డంగ్‌పై దాదాపు రూ.2 లక్షలు అధికంగా ఖర్చు వస్తుంది. ఇలాగైతే మాకు లాభాలు రావాల్సింది పోయి భారీగా నష్టాలు వస్తాయి. ప్రభుత్వం ఇసుక కొరత లేకుండా మమ్మల్ని ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం.
– సుధాకర్, బిల్డర్, నంద్యాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement