illegal sand transport
-
ఇసుక బ్లాక్! సంక్షోభంలో భవన నిర్మాణ రంగం
రాష్ట్రంలో స్థానికంగా ఉండే వారు, వలస వచ్చిన వారితో కలిపి 45 లక్షల మంది భవననిర్మాణ రంగంపై ఆధారపడి పని చేస్తున్నారు. తాపీ పనికి అనుబంధంగా రాడ్ బెండింగ్, సెంట్రింగ్, ఫ్లంబింగ్, పెయింటింగ్, ఫాల్స్ సీలింగ్, మార్బుల్స్, టైల్స్ వంటి 36 రకాల వృత్తుల వారు పని చేస్తున్నారు. ఇసుక లేక నిర్మాణాలు నిలిచి పోవడంతో ప్రస్తుతం వీరందరూ ఉపాధి కోసం ఆయా నగరాలు, పట్టణాల్లోని 4 రోడ్ల కూడళ్లలో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా పనికి పిలుస్తారనే ఆశతో పడిగాపులు కాస్తున్నారు. ఇసుక కరువు తమ ఉపాధిని దెబ్బ తీసిందని, నోట్లోకి నాలుగు వేళ్లు పోవడం లేదని వాపోతున్నారు. గతంలో మాదిరిగా ఇసుక సరఫరా యధావిధిగా జరిగితే తప్ప వీరందరికీ పని దొరకదన్నది చేదు నిజం. కాకినాడలో ఇల్లు కట్టుకుంటున్న రాఘవేంద్రరావు ఇసుక కోసం పది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ట్రక్కు ఇసుక దొరికితే పని ఆగకుండా చేయించవచ్చని చూస్తున్నాడు. ఇసుక అమ్మేవాళ్లు, లారీల వాళ్లని అడిగితే లేదని చెబుతున్నారు. ఇసుక పోర్టల్‌లో నేరుగా బుకింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిందని ఎవరో చెబితే దాన్ని చూశారు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఎలా బుక్ చేసుకోవాలో ససేమిరా అర్థం కాలేదు. అయినా తెలుసుకుని ఒక రోజు ప్రయత్నించినా దొరకలేదు. దీంతో అతని ఇంటి నిర్మాణం మధ్యలో అగిపోయింది.విజయవాడ రామవరప్పాడు సెంటర్ లేదా బెంజి సర్కిల్లో ఉదయం పూట నిలబడితే భవన నిర్మాణ కార్మికుడు రామారావుకు ప్రతి రోజూ పని దొరికేది. కానీ రెండు నెలలుగా పని దొరకడం ఇబ్బందిగా మారింది. 15 రోజుల నుంచి అది మరీ కష్టమైపోయింది. నిర్మాణాలు ఆగిపోవడంతో పని కోసం పిలిచేవారే కరువయ్యారు. దీంతో అతని ఇల్లు గడవడం కష్టంగా మారింది.ఇసుక అందుబాటులో లేదని తెలుస్తున్నా, ఎలాగోలా కొనాలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేసి చివరికి నానా కష్టాలు పడి పది టన్నుల లారీని బేరమాడాడు గుంటూరుకు చెందిన శివరామకృష్ణ. గతంలో రూ.15,700 ఉండే ధర ఇప్పుడు రూ.43 వేలు చెప్పారు. గుండె గుభేల్మంది. అయినా గత్యంతరం లేక అంత రేటు పెట్టి కొనుగోలు చేయడానికి ఒక రోజు తర్వాత సిద్ధపడ్దాడు. ఆ తర్వాత రోజు అడిగితే రేటు మరో రూ.20 వేలు పెంచి.. రూ.63 వేలు చెప్పారు. ఇలాగైతే ఇల్లు కట్టినట్లేనని బాధను దిగమింగుకుంటున్నాడు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక బంగారంలా మారిపోయిందని చెప్పడానికి ఈ ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర సహా ఏ ప్రాంతంలోనూ ఇసుక దొరకడం లేదు. పైకి మాత్రం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవంగా దొరకడమే గగనంగా మారిపోయింది. ఎక్కడైనా అతికష్టం మీద దొరికిన చోట దాని రేటు చూసి నివ్వెరపోవాల్సిందే. గత ప్రభుత్వంలో అమ్మిన రేటు కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటోంది. దీనికంతటికీ కారణం ఉచితం పేరుతో కూటమి ప్రభుత్వ నేతల అడ్డగోలు దోపిడీ విధానమే. వెరసి రాష్ట్రమంతటా భవన నిర్మాణ రంగం సంక్షోభంలో పడిపోయింది. వాస్తవానికి వర్షాకాలంలో ఇసుక సమస్య రావడం సాధారణం. అయితే ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ఈ సమస్య రాదు. కానీ టీడీపీ ప్రభుత్వానికి ఆ ముందు చూపు లేక గత ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుకను అడ్డగోలుగా దోచేసింది. వర్షాల సీజన్లో ఇసుక సమస్య రాకుండా చూసేందుకు 80 లక్షల టన్నులకుపైగా ఇసుకను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మూడు పార్టీల నేతలు ఈ నిల్వలపై బకాసురుల్లా పడ్డారు. ఎక్కడికక్కడ ఇసుక డంప్‌లను కొల్లగొట్టి అమ్మేసుకున్నారు. కేవలం 10–15 రోజుల వ్యవధిలోనే 40 లక్షల టన్నుల ఇసుకను దోచేశారు. మిగిలిన 40 టన్నుల ఇసుకను ఉచితం పేరుతో గత ప్రభుత్వంలో కంటే మూడు నాలుగు రెట్లు అధిక ధరకు విక్రయించారు. గతంలో ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేది. ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి చేరుతోంది. దొరికిన చోట 18 టన్నుల లారీ రూ.35 వేల పైనే.. ఓ వైపు ఇసుక నిల్వల గురించి పట్టించుకోకుండానే మరోవైపు సీఎం చంద్రబాబు తాపీగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు. దోచేయగా మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ.. దానికీ రేటు పెట్టారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఉచితం పేరుతో దోచుకున్నారు. ఇప్పుడూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 టన్నుల ఇసుక లారీ రూ.35 వేలకు పైగా పలుకుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు ఇసుకను దొంగచాటుగా తరలించి, ఏకంగా రూ.60 వేల వరకు అమ్ముకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఉచిత ఇసుక విధానంలో జనానికి ఉపయోగం లేదని, ప్రభుత్వానికీ ఆదాయం లేకుండా పోయిందని.. బాగుపడింది మాత్రం టీడీపీ నేతలు మాత్రమేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇసుక నిల్వలన్నీ తరిగి పోవడంతో అసలు ఇసుకే దొరకడం లేదని చెబుతున్నారు. ఇసుక బుకింగ్ ఒక ప్రహసనం ఎక్కడైనా మిగిలిన కొద్దిపాటి ఇసుకకు ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ పెట్టి దాన్ని ప్రహసనంగా మార్చింది. ఇసుక పోర్టల్‌లో బుకింగ్ చేసుకోవచ్చని చెప్పినా, దాని ద్వారా వారానికి ఒకసారి కూడా బుకింగ్ చేసుకోవడం కుదరడం లేదు. వారంలో ఎప్పుడో ఒకసారి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇసుక పోర్టల్‌లో బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు. నిమిషాల్లోనే వారం రోజుల బుకింగ్‌లన్నీ అయిపోతున్నాయి. సాధారణ జనం ఎవరైనా దాని కోసం ప్రయత్నిస్తే నిద్ర లేకుండా ఎదురు చూడడం తప్ప ఉపయోగం ఉండడం లేదు. నాలుగు వారాలు ప్రయత్నించి ఇటీవల రాజమండ్రి స్టాక్ పాయింట్ నుంచి 20 టన్నుల ఇసుకను బుక్ చేసుకున్న చింతకాయల వీరబాబు అనే వినియోగదారుడి నుంచి భారీగా కట్టించుకున్నారు. ఇక ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నది ఎక్కడన్న ప్రశ్నకు జవాబు లేదు. గతంలో రూ.4 వేలు, 5 వేలకే దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.15 వేలు, రూ.20 వేలు పలుకుతోంది. మరోవైపు ఇసుక దొరక్కపోవడంతో పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా పెరిగిపోయింది. నదులు, వాగుల నుంచి అక్రమంగా తవ్వి దాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. విశాఖ పరిసర ప్రాంతాలకు ఒడిశా నుంచి భారీ ఎత్తున అక్రమంగా రవాణా అవుతోంది. మన రాష్ట్రంలో దొరక్క పోవడంతో అక్కడి నుంచి కొందరు అక్రమార్కులు ఇసుకను రవాణా చేసి విక్రయిస్తున్నారు. వర్షాల వల్ల నదుల్లో ఇసుక తవ్వకాలు జరగడం లేదని అందువల్లే ఇసుక కొరతని ప్రభుత్వం చెబుతోంది. కానీ వర్షాకాలం కోసం నిల్వ చేసిన నిల్వలు ఏమయ్యాయంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు.నిర్మాణాలన్నీ ఆగిపోతున్నాయి..ఇసుక అందుబాటులోకి తెచ్చి తమ ఉపాధి కాపాడాలని వేలాది మంది కార్మీకులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సంక్షోభం నెలకొంది. వెరసి రాష్ట్రంలో నిర్మాణ రంగం స్తంభించిపోయింది. చిన్న, మధ్య తరహా నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. ఒక ట్రాక్టర్ ఇసుక దొరికినా సాగిపోయే పనులు కూడా ఆగిపోయాయి. చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్లు కూడా ఇసుక దొరక్క నిర్మాణాలు ఆపేశారు. కనీసం చిన్నపాటి రిపేర్లు చేయించుకోవడానికి సైతం ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయి. దీంతో దానిపై ఆధారపడి పని చేస్తున్న కార్మీకులు సుమారు 45 లక్షల మంది ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో బిల్డింగ్ పనులు చేసే స్థానిక కార్మీకులు 27 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది కార్మీకులు బిల్డింగ్ పనుల కోసం వలస వచ్చారు. ఒక్క సీఆర్డీఏ పరిధిలోనే 8 లక్షల మంది వలస కార్మీకులున్నట్లు అంచనా. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగం బాగా విస్తరించింది. ఈ నేపథ్యంలో ఇసుక లేక నిర్మాణాలు నిలిచిపోవడంతో లక్షలాది మంది కార్మీకుల ఉపాధికి విఘాతం ఏర్పడింది.100 రోజులైనా ఉచిత ఇసుక లేదుఇసుక లభ్యం కాక నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్లాక్‌లో అక్కడక్కడా దొరుకుతున్నా అంత ధర చెల్లించలేక పనులను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధార పడిన కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉచిత ఇసుక ఇస్తామని అధికారంలోకి వచ్చి 100 రోజుల దాటినా, నేటికి ఇవ్వడంలేదు. మరింత రేట్లు పెంచేశారు.– గొట్టిపాటి సాల్మన్ రాజు, సెంట్రింగ్ మేస్త్రీ, సత్తెనపల్లి, పల్నాడు జిల్లారాష్ట్రమంతా అదే దందా⇒ వైఎస్సార్ జిల్లాలో ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవడానికి వీలవ్వడం లేదు. ఒక వేళ ఎవరికైనా బుకింగ్ అయినా సరఫరా కావడం లేదు. జిల్లాలో ఒకే ఒక్క స్టాక్ పాయింట్ వీరపునాయునిపల్లె మండలం ఎర్రబల్లి ప్రాంతంలో మాత్రమే ఉంది. అక్కడ నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఇసుక కొరత వల్ల జిల్లాలో సుమారు 16 వేల వరకు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అన్నమయ్య జిల్లాలో బుడుగుంటపల్లె వద్ద ఒకే ఒక ఇసుక రీచ్, స్టాక్ పాయింట్ ఉంది. అక్కడా ఇదే పరిస్థితే. దాదాపు 15వేల మంది భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదు.⇒ పల్నాడు జిల్లాలోని ఆరు స్టాక్ పాయింట్స్లలో ఇసుక ఖాళీ అయ్యింది. దీంతో ఇసుక బుకింగ్ నిలిపివేశారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భవన నిర్మాణ రంగంపై ఆధార పడిన 90 వేల మంది ఉపాధి కోల్పోయారు. ఇసుక ధర భారీగా పెరగడంతో ఓ మోస్తరు ఇంటి నిర్మాణానికి రూ.70 వేల నుంచి రూ.90 వేలు అదనంగా భారం పడుతోంది. సుమారు 20 వేల ఇళ్ల నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలినాళ్లలో పెద్దాపురం స్టాక్ పాయింట్ నుంచి కాకినాడ జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలు ఐదారు రోజుల వ్యవధిలోనే ఇసుకను ఖాళీ చేసేశారు. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో తప్ప అధికారికంగా ఎక్కడా దొరకడం లేదు. జగ్గంపేట నియోజకవర్గంలో 18 టన్నుల లారీకి రూ.27–30 వేలు పెట్టాల్సి వస్తోంది. 97 వేల మందికి ఉపాధి కరువైంది.⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా ఇసుక లభ్యత లేదు. బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. భీమవరానికి లారీ ఇసుక తెచ్చేందుకు రూ.35 వేలు, ఉండికి రూ.32 వేలు, నరసాపురానికి రూ.26 వేలు, తాడేపల్లిగూడేనికి రూ.30 వేలు ఖర్చవుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే లారీకి రూ.10 వేలకు పైగానే అదనపు భారం పడుతోంది. దీంతో పనులు ఆగిపోయాయి. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్లిపోతున్నారు.⇒ అనంతపురం జిల్లాలోని 31 మండలాలకు ఒకే ఒక ఇసుక స్టాక్‌పాయింట్‌ను రాయదుర్గం మండలం జుంజురాంపల్లిలో ఏర్పాటు చేశారు. అక్కడ సైతం ఇసుక అరకొరగానే అందుబాటులో ఉంది. దీంతో జిల్లా కేంద్రానికి తరలించాలంటే అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో 25 వేల ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారికంగా ఇసుక లభ్యత లేదు. విజయవాడలో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక రూ.30 వేలు పలుకుతోంది. అంత ధర పెట్టలేక సుమారు 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలు ఎడ్ల బండ్లతో ఇసుకను బయటకు తెప్పించి, అధిక ధరతో విక్రయిస్తున్నారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఇసుక లభ్యత లేదు. గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ పాయల్లో వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రస్తుతం ఇసుక ర్యాంపులు తెరిచేందుకు అవకాశం లేదు. కూటమి నేతలు అనాలోచితంగా జూలై నాటికే స్టాక్ పాయింట్లలోని ఇసుకను కాజేశారు. ప్రస్తుతం చిన్న చిన్న రిపేర్ల పనులు మాత్రమే సాగుతున్నాయి. కొంత మంది దళారులు ఇసుక నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. సుమారు లక్ష మందికి ఉపాధి కరువైంది.⇒ ఉమ్మడి కర్నూలు, విజయనగరం జిల్లా గుంటూరు, తూర్పుగోదావరి, ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లా , శ్రీకాకుళం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖ జిల్లా, ప్రకాశం జిల్లాల్లో కూడా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. గతంలో కంటే ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో నిర్మాణాలను ఆపేస్తున్నారు. కొత్తగా నిరి్మస్తున్న ఒక్కో ఇంటిపై రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు అదనపు భారం పడుతోంది. ఒక్కో అపార్ట్మెంట్ నిర్మాణానికి అదనంగా రూ.30 లక్షల వరకు ఖర్చవుతోంది.ఉపాధి కోల్పోతున్నాంప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇసుక కొరత వేధిస్తోంది. పనులు ఎక్కడిMý్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నగదు వసూళ్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? – మునస్వామి, భవన నిర్మాణ కార్మికుడు, చిత్తూరుమాకు ప్రత్యేక భృతి ఇవ్వాలిభవన నిర్మాణ పనుల్లో కార్మికులుగా పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇప్పుడేమో ఇసుక కొరత వల్ల పనుల్లేవు. ఇంటి వద్ద ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. మా సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోదు. మా ఇల్లు గడవాలంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా భృతి ఇవ్వాలి. లేదా ఇసుక కొరత అయినా తీర్చాలి. – డేవిడ్, భవన నిర్మాణ కార్మికుడు, చిత్తూరుఇలా జరగడం ఇదే ప్రథమంకమ్మి, ఇటుకలు, సిమెంట్ దొరక్క ఇంటి నిర్మాణాలకు ఆటంకాలు చూశాం. తొలిసారిగా ఇసుక కొరతతో ఇళ్ల నిర్మాణం ఆగిపోవడం చూస్తున్నాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్వర్ణముఖి నది నుంచి ఇసుక రావాలి. అధికార పార్టీ నేతలు అనధికారికంగా మాత్రమే ఇసుక తీసి అధిక ధరకు అమ్ముతున్నారు. దీంతో నిర్మాణాలు నిలిచి పనులు కోల్పోయాం. – గడ్డం గురవయ్య, తాపీ మేస్త్రీ, వాకాడుపనులు ఆపేస్తున్నారుఇసుక అందుబాటులో లేని కారణంగా ఉపాధి కోసం భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఉచిత ఇసుక ఇవ్వలేకపోతోంది. ధర బాగా ఎక్కువగా ఉందని ఇంటి యజమానులు నిర్మాణ పనులు ఆపేస్తున్నారు. దీంతో మాకు పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం. – సురేష్, తాపీ మేస్త్రీ, నెల్లూరువలస వెళ్తున్నారు ఇసుక కొరతతో పనులు లేక కుటుంబ పోషణ భారంగా మారడంతో కార్మికులు పనుల కోసం తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. కానీ డబ్బులు పెట్టినా దొరకడం లేదు. – షేక్ ఖాజావలి, తాపీ మేస్త్రీ, కంభంఇసుక కొరత తీర్చకపోతే ఆత్మహత్యే శరణ్యంనేను 20 ఏళ్లుగా బిల్డర్‌గా కొనసాగుతున్నాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక కొరత మమ్మల్ని వేధిస్తోంది. ఇళ్ల యజమానులకు నిర్ణీత సమయంలో భవనం పూర్తి చేసిస్తామని వారి నుంచి కొంత మొత్తం తీసుకున్నాం. ఇసుక దొరక్క బ్లాక్‌లో అధిక ధరలు పలకటంతో భవనాలు మధ్యలో ఆపేశాను. ఇంటి యజమానులు మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇసుక బ్లాక్‌లో కొని కట్టిద్దామనుకుంటే ఒక బిల్డంగ్పై దాదాపు రూ.2 లక్షలు అధికంగా ఖర్చు వస్తుంది. ఇలాగైతే మాకు లాభాలు రావాల్సింది పోయి భారీగా నష్టాలు వస్తాయి. ప్రభుత్వం ఇసుక కొరత లేకుండా మమ్మల్ని ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం.– సుధాకర్, బిల్డర్, నంద్యాల -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి/ కాకినాడ: కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందినట్లు చెప్పుకుంటూ.. జిల్లాల వారీగా అక్రమ విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వివిధ జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) టెండర్ల ద్వారా అనుమతి పొందిందినట్లు చెప్పారు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ‘జేపీవీఎల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అక్రమార్కులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా వివధ పేర్లతో కాకినాడ జిల్లా పరిధిలో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తాం.’ అని గట్టి హెచ్చరికలు జారి చేశారు. అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎస్ఈబీ ఏర్పాటు.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పడం జరిగిందన్నారు ఎస్పీ. ఎస్.ఇ.బి అధికారులు జిల్లాలో నిత్యం వాహన తనిఖీలు చెక్ పోస్టుల వద్ద నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు, అక్రమ రవాణా నిర్మూలన కొరకు SEB అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా అక్రమ రవాణా సమాచారాన్ని నిర్భయంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చునని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఖండించిన జేపీవీఎల్.. కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందారని, జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను జేపీవీఎల్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించింది. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటిసి ద్వారా నిర్వహింపచేసిన టెండర్లలో జయప్రకాశ్ పవర్ వెంచర్స లిమిటెడ్ (జేపీవీఎల్) ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఆపరేషన్స్ నిర్వహణను దక్కించుకుంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడుతూ జేపీవీఎల్ సాంకేతికంగానూ, ఆర్థికంగానూ తన సామర్థ్యంను చాటుకుని ఈ టెండర్లలో కాంట్రాక్ట్ పొందింది. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని నిబంధనలను జేపీవీఎల్ సంస్థ పాటిస్తోంది. జేపీవీఎల్ సంస్థ విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో వ్యాపార అనుభవం కలిగిన సంస్థ. జేపీవీఎల్ సంస్థకు ఎటువంటి రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా జేపీవీఎల్ సంస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలను, తప్పుడు వార్తలను జేపీవీఎల్ సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది.’ అని పత్రిక ప్రకటన విడుదల చేశారు జేపీవీఎల్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్. ఇదీ చదవండి: పారదర్శకంగా ఇసుక విధానం -
ఒడిశా నుంచి ఇసుక రవాణా; పట్టుకున్న పోలీసులు
సాక్షి, విజయనగరం : ఒడిశాలోని కెరడ నుంచి విశాఖకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులతో కలిసి పార్వతీపురం ఏఎస్పీ డాక్టర్ సుమిత్ గరుడ పట్టుకున్నారు. పట్టుకున్న ఇసుక సుమారు 375 టన్నులుంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ.. పక్కా సమాచారం ఆధారంగా లారీలను పట్టుకొని, పాత తేదీలతో ఉన్న బిల్లులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిబంధనల ప్రకారం అంతర్రాష్ట్ర ఇసుక రవాణాకు అనుమతులు లేవని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇరు రాష్ట్రాల ఇసుక విధానానికి విరుద్ధంగా అక్రమ రవాణా జరుగుతుందని తేలిందన్నారు. పట్టుబడిన లారీలపై కేసులు నమోదు చేశామని, మరికొన్ని లారీలు సరిహద్దుల్లో నిలిచిపోవడం వల్ల వాటిని పట్టుకోవడం కుదర్లేదని స్పష్టం చేశారు. మరోవైపు పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని, సంబంధిత యజమానులు సరైన పత్రాలు ఉంటే వాటిని కమిటీకి అందజేయవచ్చని తెలియజేశారు. -
ఇసుక స్థావరాలపై దాడులు
చిన్నకోడూరు(సిద్దిపేట) : అక్రమ ఇసుక స్థావరాలపై ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 3లారీలను, ఒక ట్రాక్టర్, ఒక టిప్పర్‌ను సీజ్ చేశారు. మండల పరిధిలోని అల్లీపూర్ శివారులో రహస్య ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమచారం అందుకున్న సిద్దిపేట రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్‌లు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. ఇసుక డంప్‌లు నిర్వహిస్తున్న నిర్వాహకులు అనిల్, సంతోష్, బాలయ్య, తిరుపతిరెడ్డి, మహేందర్‌లపై కేసునమోదు చేశారు. అనిల్‌కు సంబంధించిన టిప్పర్ సీజ్ చేశారు. అలాగే సిరిసిల్ల రాజన్న జిల్లా కొదురుపాక క్వారీ నుంచి హైదరాబాద్ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3లారీలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్‌లు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా ఇసుక నిల్వలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే అక్రమ వ్యాపారాలు కొనసాగించినా వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. -
ముగ్గురి ఉసురు తీసిన అక్రమ ఇసుక రవాణా
-
ఇసుక టిప్పర్ల పోటీ.. కుటుంబం బలి
రాజధాని ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇసుక టిప్పర్ల మధ్య పోటీతో.. ఒక దానిని ఇంకొకటి ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో భర్త, భార్య, 18 నెలల పసిపాప అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ల ఆగడాలకు ఆ కుటుంబం బలి కావడం స్థానికులను కలచివేసింది. మరోవైపు ఇదే రాజధాని పరిధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు.. చిత్తూరు జిల్లాలో మహేంద్ర బొలెరో మాక్స్ వాహనం, ఈచర్ లారీ ఢీకొన్న ఘటనలో తిరుమల దైవదర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించారు. తాడేపల్లిరూరల్/రేణిగుంట(చిత్తూరు): రాజధాని ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇసుక టిప్పర్ల మధ్య పోటీతో.. ఒక దానిని ఇంకొకటి ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో భర్త, భార్య, 18 నెలల పసిపాప అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ల ఆగడాలకు తమ పెళ్లి రోజునే ఆ కుటుంబం బలి కావడం స్థానికులను కలచివేసింది. మరోవైపు ఇదే రాజధాని పరిధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు.. చిత్తూరు జిల్లాలో మహేంద్ర బొలెరో మాక్స్ వాహనం, ఈచర్ లారీ ఢీకొన్న ఘటనలో తిరుమల దైవదర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించారు. నులకపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు పెళ్లి రోజే చివరిరోజు.. రాజధాని పరిధిలోని రోడ్లు రక్తమోడాయి. 18 గంటల వ్యవధి.. 25 కిలోమీటర్ల దూరంలో జరిగిన మూడు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక ఇసుక టిప్పర్‌ను మరో ఇసుక లారీ ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొమ్మతోటి శ్రీకాంత్ (27), భార్య సరిత (24), అక్షర (ఏడాదిన్నర) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్, సరితల పెళ్లిరోజు సోమవారం కావడంతో బంధువుల ఇంటికి వెళ్లి, అక్కడ నుంచి మంగళగిరిలో కొత్త దుస్తులు తెచ్చుకోవడానికి కుమార్తెతో బయల్దేరారు. మార్గమధ్యలో అనుకోకుండా ఇసుక టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడి వారిని బలిగొన్నది. ఈ ప్రమాదంలో కొమ్మతోటి శ్రీకాంత్‌కు తలకు బలమైన గాయమై, మెదడు బయటకు వచ్చింది. భార్య సరితకు ముక్కులు, చెవుల్లోనుంచి తీవ్ర రక్తస్రావమై మృతి చెందారు. పాప అక్షర మాత్రం 108 వచ్చేంత వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. రోడ్డుపక్కన వెళ్లేవారు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఎటువంటి ఫలితం దక్కలేదు. అలాగే రాజధాని ప్రాంతమైన కురగల్లులో శనివారం రాత్రి పెట్రోలు కొట్టించుకుందామని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చావలి గోపిరాజు(26)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుళ్లూరు మండలం మందడం వద్ద శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బత్తులూరి వెంకటేశ్వరరావు(50) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. శ్రీవారి దర్శనానికి వెళ్తూ.. చిత్తూరు జిల్లా రేణిగుంట–కోడూరు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులందరినీ కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఏడాదిన్నర పాప ఉంది. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపిన వివరాల మేరకు... రేణిగుంట–కోడూరు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న మహేంద్ర బొలెరో మాక్స్ వాహనం, ఈచర్ లారీ ఢీకొన్నాయి. బొలెరో మాక్స్ వాహనంలో తిరుమల దర్శనార్థం వస్తున్న కర్నూలు జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరటమద్దికి చెందిన నాగరాజశెట్టి(55), అతని భార్య రమాదేవి(50), తల్లి నారాయణమ్మ(72), కుమారులు సురేంద్ర(22), మధుజయకుమార్(18), కుమార్తె రేణుక(24), అల్లుడు ప్రవీణ్‌కుమార్(35) వారి పిల్లలు దేవాన్ష్(ఏడాదిన్నర), తనీష్(7).. ఇలా తొమ్మిది మంది బృందంతో కలసి తిరుమల దర్శనార్థం శనివారం రాత్రి 10 గంటలు దాటాక బయలుదేరారు. ఆదివారం ఉదయం రేణిగుంట మండలం మామండూరు సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నాగరాజుశెట్టి, అతని భార్య రమాదేవి, తల్లి నారాయణమ్మ, అల్లుడు ప్రవీణ్‌కుమార్, అతని కుమార్తె ఏడాదిన్నర చిన్నారి దేవాన్ష్ అక్కడికక్కడే మృత్యుపాలయ్యారు. గాయపడిన రేణుక, తనీష్, సురేంద్ర, మధుజయకుమార్, వాహన డ్రైవర్ కరీముల్లా తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి తనీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. -
సాక్షి కథనాలతో ప్రభుత్వంలో చలనం
అమరావతి: కృష్ణానదిలో 100 ఎకరాలను కబ్జా చేసిన టీడీపీ నేతల ఇసుక మాఫియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి మంత్రులు చినరాజప్ప, సుజయకృష్ణ రంగారావు, రెవెన్యూ, హోం, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం మంత్రి సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ... సామాన్యుడికి ఉచితంగా ఇసుక అందించేందుకు ప్రయత్నిస్తామని, అక్రమ రవాణా నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కఠినమైన చట్టాలైతే ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా అమలు జరగడం లేదన్నారు. కేసుల నమోదు బాగానే ఉందని, ఆ తర్వాతే ఏం జరగడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. యంత్రాల ద్వారా ఇసుక తవ్వడానికి అనుమతిచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. 44 చెక్‌పోస్టులున్నాయని, ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇసుక ర్యాంప్‌లను ఉపాధి హామీ కూలీల ద్వారా నిర్వహించేందుకు యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక రవాణా నియంత్రణ బాధ్యతను ఆర్డీవో, డీఎస్పీలకు అప్పగిస్తామని చినరాజప్ప తెలిపారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తే పీడీ యాక్టు
తాండూరు రూరల్: కాగ్నా నది పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు హెచ్చరించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో పర్యటించారు. బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం తాండూరు ఎంపీడీఓ అతిథి గృహాంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని, యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇకనుంచి ఇసుక అక్రమ రవాణాపై నిఘాపెంచుతామని, రాత్రి వేళ తనిఖీలను ముమ్మరం చేయాలని సిబ్బందికి సూచించామని కలెక్టర్ వెల్లడించారు. తాండూరు పరిసరాల్లో అక్రమంగా నాపరాతి తవ్వకాలు చేపడితే యజమానులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో అధికారులు తాండూరులో పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని, కానీ వాటికి స్థలాలు చూపలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మట్లాడి వివరాలు సేకరిస్తానన్నారు. క్రమబద్ధీకరణలో 42 వేల దరఖాస్తుల పరిశీలన జిల్లాలో ఇప్పటి వరకు 42,462 క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించామని, జిల్లా వ్యాప్తంగా లక్షా 50 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మిగతా దరఖాస్తులను త్వరలోనే విచారిస్తామన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలుగు వర్షిణి ఉన్నారు. ఆకస్మిక తనిఖీ బషీరాబాద్: బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అనంతరం రెవెన్యూ, మండల పరిషత్, ఉపాధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బషీరాబాద్ ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు సునిత, బషీరాబాద్ సర్పంచ్ జయమ్మలు కలెక్టర్‌ను మండల సమస్యలను విన్నవించారు. బషీరాబాద్- తాండూరు రోడ్డు మార్గం పనులు కొనసాగడం లేదని, పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరారు. మండల పరిధిలోని కొర్విచెడ్, నవల్గ, క్యాద్గిరా గ్రామాలకు చెందిన నాపరాతి కార్మికులకు నాపరాతిని తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రవికుమార్, ఏపీఓ వీరాంజనేయులు తదితరులున్నారు. -
వారంతే..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో కొందరు పోలీసుల దందాలు హద్దుమీరుతున్నాయి. ఉన్నతాధికారి హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ.. ఎవరికి వారే బాసుల్లా రెచ్చిపోతున్నారు. ఇటీవలే కొత్త బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఆ.. ఇటువంటివి మామూలే అన్నట్లు కొందరు ఎస్సైలు, సీఐలు కొరకరాని కొయ్యల్లా తయారవుతున్నారు. వారి పనితీరు మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. గత నెలరోజు రోజుల్లో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో తమ సిబ్బంది పనితీరుపైనే నిఘా పెట్టాల్సివస్తోందని ఉన్నతాధికారులే వాపోతున్నారు. డీజీపీ నిర్ణయానికే ఠికానా లేదు ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్‌శాఖ చోరీ కేసులను తెరమీదకు తెచ్చిం ది. ఇన్నాళ్లూ మైనింగ్, ఇతర శాఖలే ఇసుక అక్రమ రవాణాపై కన్నేసేవి. సీజ్ చేసిన ఇసుక, వాహనాలను పోలీసులకు అప్పగించేవి. అయితే కొన్నాళ్ల క్రితం డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇసుక అక్రమార్కులపై పోలీస్ శాఖ పరంగా చోరీ కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా సంబంధిత నివేదికను ఆయా ప్రభుత్వ విభాగాలకు పంపిస్తున్నారు. ఆ మేరకు ఇటీవల గార పరిధిలో సీసీఎస్ పోలీసులు ఇసుక అక్రమరవాణాపై నిఘా పెట్టారు. కొన్ని వాహనాలను పట్టుకున్నారు. తొలుత స్టేషన్‌కు తరలించినా తరువాత వాహనాలు మాయమైపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ తక్షణ విచారణకు ఆదేశించడంతో బాధ్యులు నీళ్లు నమిలారు. ఆయా వాహనాలు చట్ట ప్రకారమే ఇసుకను తరలిస్తున్నాయని, పత్రాలు చూపించడంతో వాటిని వదిలేశామంటూ వివరణ ఇచ్చి తప్పించుకున్నారు. అయితే అసలు కథ వేరేగా వినిపిస్తోంది. వాహనాల్ని అధికారులకు తెలియకుండా పంపించేయడం వెనుక నేతల ఒత్తిళ్లు బాగా పనిచేశాయన్న ఆరోపణలొచ్చాయి. ఈ కేసులోనే కాదు. దాదాపు ఇసుక మాఫియా కేసులన్నీ రాజకీయ ఒత్తిళ్లతో నీరుగారిపోతున్నాయి. దీనికి తోడు ఇసుక అక్రమ రవాణాదారులు నెలవారీ మామూళ్లతో పోలీస్, మైనింగ్, ఇతర శాఖల చేతులు కట్టేస్తున్నారు. నాయకులే సిండికేట్లుగా మారి ఈ మాఫియాను తెర వెనుక నుంచి నడిపిస్తున్నారు. రాత్రి వేళల్లో విశాఖకు పెద్ద సంఖ్యలో తరలుతున్న ఇసుక లారీల నుంచి రూ.2వేల నుంచిరూ.5వేల వరకు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలపైనే ఎదురు కేసులు పెదబొమ్మిడి ప్రాంతంలో మంత్రి కుటుంబ సభ్యులుపేదల భూముల్ని సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నడంతో పాటు అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యాలకు దిగినట్టు కోటబొమ్మాళి స్టేషన్లో ఫిర్యాదు దాఖలు కాగా.. స్థానిక పోలీసులు రివర్స్ గేర్‌లో వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. నాయకుల ఒత్తిళ్లతో ఫిర్యాదు ఇచ్చినవారిపైనే తిరిగి కేసులు నమోదు చేశారని తెలిసింది. వారిచ్చిన ఫిర్యాదు వెనక్కు తీసుకుంటేనే నాయకులిచ్చిన ఫిర్యాదును కొట్టి వేస్తామని బాధితులపై పోలీసులే ఒత్తిడి తేవడం విడ్డూరంగా ఉంది. ఈ విషయమై పలు ప్రజా సంఘాలు కూడా కలిసి ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఎస్పీ కేసు విచారణను వేగవంతం చేయాలని స్థానిక డీఎస్పీ, సీఐలను ఆదేశించారు. అదే విధంగా సింగుపురం ప్రాంతంలో ఇటీవల అక్రమ మైనింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతపై కేసు నమోదు, అరెస్టులో పోలీసులు నాన్చుడు ధోరణి అవలంభించారు. జూదంపై ఏదీ నిఘా? జిల్లాలోని పలు ప్రాంతాల్లో జూదం నిర్విరామంగా కొనసాగుతున్నా ఆయా ప్రాంతాల పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో కూడా పలు హోటళ్లు, లాడ్జీల్లో వారాంతాల్లో చతుర్ముఖ పారాయణం జరుగుతోంది. నెలవారీ మామూళ్లు తీసుకుని పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణ శివార్లలోని తోటల్లో జోరుగా ఆట ఆడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నా కొంతమంది పోలీసు అధికారులే అడ్డుతగులుతున్నారన్న విమర్శలొచ్చాయి. ఇటీవల వంగర పోలీసులపై అనేక ఆరోపణలు రావడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. అయినా మార్పు కనిపించడం లేదు. ఆమదాలవసలోనూ అంతే.. చిల్లర వర్తకులు నడుపుకొంటున్న ఆమదాలవలస కూరగాయల మార్కెట్ విషయంలోనూ అదే జరిగిం ది. నోటీసులు లేకుండా, కోర్టు నుంచి స్టే వస్తుందని చెబుతున్నా వినకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లతో బల వంతంగా రాత్రివేత విద్యుత్ సరఫరా నిలిపివేయిం చి మరీ మార్కెట్‌ను కూలగొట్టారు. శాంతిభద్రతల విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉన్నా అక్కడి పోలీసు అధికారులు పట్టించుకోలేదు. వ్యాపారులు, మున్సిపల్ అధికారులు, నాయకులతో చర్చలు జరి పించి కథ సుఖాంతం చేయాల్సిన స్థానిక పోలీసులు నేతల ఒత్తిళ్లకు లొంగిపోయి ఉద్రిక్తతలకు తావిచ్చారన్న విమర్శలొచ్చాయి. తీరా చూస్తే.. ఆ మరుసటి రోజే హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఎవరి అండతో.. పోలీస్‌శాఖలో పెత్తనం కొందిరిదే. నాయకుల అండ ఉన్న తమకేమీ కాదనే నమ్మకంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు యూని యన్ల పేరిట హడావుడి చేస్తున్నారు. బదిలీ చేసే అవకాశం కనిపించేసరికి ఎవరికి వారు తమకు తెలిసిన నాయకులతో పోలీస్ అధికారులపై సిఫారుసు ఒత్తిళ్లు తెప్పిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకునే సమయానికి అధికారులే ఇరుకున పడేలా చేయిస్తున్నారని తెలిసింది. -
జోరుగా ఇసుక దందా
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని పెద్దవాగు, చిర్రకుంట, చిలాటిగూడ, రెబ్బెన మండలం కొండపెల్లి తదితర గ్రామాల్లోని వాగులు, ఒర్రెల నుంచి నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు రాత్రివేళ పెద్ద వాగు నుంచి జేసీబీ ద్వారా ఇసుక తోడి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అభివృద్ధి పనులు, గృహనిర్మాణ పనుల పేరుతో స్మగ్లర్లు ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. పెద్దవాగు నుంచి ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను ఇటీవల పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయినా స్మగ్లర్లు వెనుకంజ వేయకుండా దందా అలాగే కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆసిఫాబాద్ నుంచి వాంకిడి, కెరమెరి, జైనూర్, ఉట్నూర్, ఆదిలాబాద్‌కు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.600 నుంచి రూ.800, వాంకిడికి రూ.1200 నుంచి రూ.1600, కెరమెరికి రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్కైతే టిప్పర్ల ద్వారా తరలిస్తూ ఒక్కో టిప్పర్ ఇసుకకు రూ.20 వేల వరకు దండుకుంటున్నారు. టెండర్ల ప్రక్రియ స్థానిక పెద్దవాగు నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండడంతో ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. నియోజకవర్గం లోని వాగులు, ఒర్రెల్లో ఇసుక సేకరణకు టెం డర్లు నిర్వహిస్తే ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదా యం సమకూరుతుంది. ఇటీవల ఇసుక టెండర్ల నిర్వహణకు సర్వే నిర్వహించిన అధికారులు ఆపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. నిబంధనలకు తూట్లు వంతెనలు, కల్వర్టుల వద్ద ఇరువైపులా ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులో ఉన్నా స్మగ్లర్లు ఖాతరు చేయడంలేదు. అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు సాగిస్తూ అందినంత ఇసుక తరలిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదముందని, పర్యావరణానికి ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. -
అదుపులేని ఇసుక రవాణా
బాన్సువాడ/కోటగిరి, న్యూస్‌లైన్ : అక్రమ ఇసుక రవాణకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్రమార్కులు అర్ధరాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నారు. మంజీర పరీవాహక ప్రాంతాలైన హున్సా, మందర్నా, సుంకిని గ్రామాల నుంచి ప్రతిరోజు 10 నుంచి 20 వరకు ట్రాక్టర్ల ఇసుకను తోడుకెళ్తున్నారు. టెండర్లు లేకుండానే, పట్టా భూముల నుంచి అనుమతి లేనప్పటికీ కొందరు అక్రమార్కులు సిండికేట్‌గా మారి యథేచ్ఛగా దందాను సాగిస్తున్నారు. ఇసుకను టాక్లీ గ్రామ శివారులో డంప్ చేసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా బోధన్, నిజామబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ‘న్యూస్‌లైన్’ నిఘాలో తేలింది. ఒక్కో టిప్పర్‌ను రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ ఇసుక రవాణాకు పలువురు రాజకీయ నాయకుల అండదండలతో పాటు కొందరి అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం పోలీసులు రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, జరిమానా విధించి వదిలేశారు. ఇదిలా ఉండగా అక్రమార్కులు ఇందిరమ్మ గృహాల నిర్మాణం పేరిట ఇసుక తరలింపునకు తహశీల్దార్ల నుంచి అనుమతి పొందుతున్నారు. అనుమతికి మించి ట్రాక్టర్లలో ఇసుకను తరలించి ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలకు అమ్ముకుంటున్నారు. పొతంగల్ శివారు నుంచి ఇలా ఇసుకను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో హున్సా, మందర్నా నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు తనిఖీ చేసినా... ఇసుక అక్రమ రవాణాపై బోధన్ సబ్ కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. పుల్కల్, వాజీద్నగర్, బీర్కూర్, బరంగేడ్గి గ్రామాల్లోని క్వారీలను ఇటీవల నిలిపివేయించారు. అయితే తాజాగా మళ్లీ ఆ క్వారీలు ప్రారంభమయ్యాయి. పట్టాల ద్వారా అనుమతి పొందిన క్వారీలే కాకుండా, అనుమతులు లేకుండా కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు కేసులు పెట్టినా, జరిమానాలు విధిస్తున్నా ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. బాన్సువాడ మండలం చింతల్ నాగా రం, బీర్కూర్, కోటగిరి మండలం హంగర్గ, మందర్నా, హున్సా, పోతంగల్, బిచ్కుంద మండలం బండరెంజల్, గుండెనెమ్లి, వాజీద్నగర్, పుల్కల్, హస్గుల్, ఖద్గాం, శెట్లూర్ పిట్లం మండలం మద్దెల్ చెరువు గ్రామాలకు ఆనుకొని ఉన్న మంజీర నది నుంచి ప్రతి రోజు పెద్ద మొత్తంలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ ప్రాంతంలోని రెవె న్యూ, పోలీసు అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ఇసుక రవాణాకు అడ్డుకట్ట వే యలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
చందర్లపాడు, న్యూస్‌లైన్ : మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. కాసరబాద, ఏటూరు గ్రా మాల పరిధిలో కృష్ణానది, మునేరుల నుంచి రాత్రివేళల్లో కొంత మంది ట్రాక్టర్లతో ఇసుకను తరలించి గ్రామాల్లో కుప్పలుగా పోస్తున్నారు. తరువాత రాత్రి వేళల్లో పొక్లెయిన్‌తో లారీల్లోకి నింపి, ఎగుమతి చేస్తున్నారు. ఈ తతంగమంతా తెల్లవారుజాములోపు ముగించి ఇసుక లారీలను 20 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి పైకి ఎక్కిస్తున్నారు. హైవే మీదకు చేరుకున్నాక వాటిని అధికారులు పట్టుకోరు. దీంతో మండలంలో ఇసుక అక్రమ రవాణాదారుల పని ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇసుక నాణ్యమైనది కావడంతో హైదరాబాద్‌లో మంచి ధర పలుకుతోంది. టన్ను రూ.1,000 ధర పలుకుతుండటంతో అక్రమ రవాణాదారులు మండలంలో ఈ ప్రాం తంపై కన్నేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా మండలంలోని వివిధ శాఖల అధికారులు విధులకు హాజరు కాకపోవడం ఇసుక అక్రమ రవాణాదారుల పాలిట వరంగా మారింది. ఇసుక అక్రమ రవాణా గురించి ఇటీవల స్థానిక ఎస్సైకి కొందరు సమాచారమందించగా ఆయన సిబ్బందితో దాడి చేసి లారీ, ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలకు భారీగా జరిమానా విధిస్తుండటంతో అక్రమ రవాణాదారులు వాటిని విడిపించుకోవడంలేదు. గతంలో అక్రమంగా ఇసుక రవాణా చేసిన వాహనాలపై వాల్టా చట్టం కింద అధికారులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అధికారులు ఆ చట్టం కింద కేసులు నమోదు చేయకపోవడంతో ఇసుక అక్రమ రవాణాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో అక్రమ ఇసుక రవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై దాడి చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, ఇసుక అక్రమ రవాణా నిరోధానికి తమ సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారన్నారు. ప్రజలు కూడా తమకు సమాచారమందిస్తే వెంటనే దాడులు చేస్తామన్నారు.