ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని పెద్దవాగు, చిర్రకుంట, చిలాటిగూడ, రెబ్బెన మండలం కొండపెల్లి తదితర గ్రామాల్లోని వాగులు, ఒర్రెల నుంచి నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు రాత్రివేళ పెద్ద వాగు నుంచి జేసీబీ ద్వారా ఇసుక తోడి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా నిల్వ చేస్తున్నారు.
అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అభివృద్ధి పనులు, గృహనిర్మాణ పనుల పేరుతో స్మగ్లర్లు ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. పెద్దవాగు నుంచి ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను ఇటీవల పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయినా స్మగ్లర్లు వెనుకంజ వేయకుండా దందా అలాగే కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆసిఫాబాద్ నుంచి వాంకిడి, కెరమెరి, జైనూర్, ఉట్నూర్, ఆదిలాబాద్‌కు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.600 నుంచి రూ.800, వాంకిడికి రూ.1200 నుంచి రూ.1600, కెరమెరికి రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కైతే టిప్పర్ల ద్వారా తరలిస్తూ ఒక్కో టిప్పర్ ఇసుకకు రూ.20 వేల వరకు దండుకుంటున్నారు.
టెండర్ల ప్రక్రియ
స్థానిక పెద్దవాగు నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండడంతో ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. నియోజకవర్గం లోని వాగులు, ఒర్రెల్లో ఇసుక సేకరణకు టెం డర్లు నిర్వహిస్తే ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదా యం సమకూరుతుంది. ఇటీవల ఇసుక టెండర్ల నిర్వహణకు సర్వే నిర్వహించిన అధికారులు ఆపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు.
నిబంధనలకు తూట్లు
వంతెనలు, కల్వర్టుల వద్ద ఇరువైపులా ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులో ఉన్నా స్మగ్లర్లు ఖాతరు చేయడంలేదు. అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు సాగిస్తూ అందినంత ఇసుక తరలిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదముందని, పర్యావరణానికి ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
జోరుగా ఇసుక దందా
Published Mon, Feb 17 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement