బాన్సువాడ/కోటగిరి, న్యూస్‌లైన్ : అక్రమ ఇసుక రవాణకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్రమార్కులు అర్ధరాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నారు. మంజీర పరీవాహక ప్రాంతాలైన హున్సా, మందర్నా, సుంకిని గ్రామాల నుంచి ప్రతిరోజు 10 నుంచి 20 వరకు ట్రాక్టర్ల ఇసుకను తోడుకెళ్తున్నారు. టెండర్‌లు లేకుండానే, పట్టా భూముల నుంచి అనుమతి లేనప్పటికీ కొందరు అక్రమార్కులు సిండికేట్‌గా మారి యథేచ్ఛగా దందాను సాగిస్తున్నారు.
ఇసుకను టాక్లీ గ్రామ శివారులో డంప్ చేసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా బోధన్, నిజామబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ‘న్యూస్‌లైన్’ నిఘాలో తేలింది. ఒక్కో టిప్పర్‌ను రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ ఇసుక రవాణాకు పలువురు రాజకీయ నాయకుల అండదండలతో పాటు కొందరి అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వారం రోజుల క్రితం పోలీసులు రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, జరిమానా విధించి వదిలేశారు. ఇదిలా ఉండగా అక్రమార్కులు ఇందిరమ్మ గృహాల నిర్మాణం పేరిట ఇసుక తరలింపునకు తహశీల్దార్‌ల నుంచి అనుమతి పొందుతున్నారు. అనుమతికి మించి ట్రాక్టర్‌లలో ఇసుకను తరలించి ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలకు అమ్ముకుంటున్నారు. పొతంగల్ శివారు నుంచి ఇలా ఇసుకను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో హున్సా, మందర్నా నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారులు తనిఖీ చేసినా...
ఇసుక అక్రమ రవాణాపై బోధన్ సబ్ కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. పుల్కల్, వాజీద్‌నగర్, బీర్కూర్, బరంగేడ్గి గ్రామాల్లోని క్వారీలను ఇటీవల నిలిపివేయించారు. అయితే తాజాగా మళ్లీ ఆ క్వారీలు ప్రారంభమయ్యాయి. పట్టాల ద్వారా అనుమతి పొందిన క్వారీలే కాకుండా, అనుమతులు లేకుండా కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు కేసులు పెట్టినా, జరిమానాలు విధిస్తున్నా ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు.
బాన్సువాడ మండలం చింతల్ నాగా రం, బీర్కూర్, కోటగిరి మండలం హంగర్గ, మందర్నా, హున్సా, పోతంగల్, బిచ్కుంద మండలం బండరెంజల్, గుండెనెమ్లి, వాజీద్‌నగర్, పుల్కల్, హస్గుల్, ఖద్‌గాం, శెట్లూర్ పిట్లం మండలం మద్దెల్ చెరువు గ్రామాలకు ఆనుకొని ఉన్న మంజీర నది నుంచి ప్రతి రోజు పెద్ద మొత్తంలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ ప్రాంతంలోని రెవె న్యూ, పోలీసు అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ఇసుక రవాణాకు అడ్డుకట్ట వే యలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
అదుపులేని ఇసుక రవాణా
Published Thu, Jan 30 2014 3:09 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement