చందర్లపాడు, న్యూస్‌లైన్ : మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. కాసరబాద, ఏటూరు గ్రా మాల పరిధిలో కృష్ణానది, మునేరుల నుంచి రాత్రివేళల్లో కొంత మంది ట్రాక్టర్లతో ఇసుకను తరలించి గ్రామాల్లో కుప్పలుగా పోస్తున్నారు. తరువాత రాత్రి వేళల్లో పొక్లెయిన్‌తో లారీల్లోకి నింపి, ఎగుమతి చేస్తున్నారు. ఈ తతంగమంతా తెల్లవారుజాములోపు ముగించి ఇసుక లారీలను 20 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి పైకి ఎక్కిస్తున్నారు. హైవే మీదకు చేరుకున్నాక వాటిని అధికారులు పట్టుకోరు. దీంతో మండలంలో ఇసుక అక్రమ రవాణాదారుల పని ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇసుక నాణ్యమైనది కావడంతో హైదరాబాద్‌లో మంచి ధర పలుకుతోంది.
టన్ను రూ.1,000 ధర పలుకుతుండటంతో అక్రమ రవాణాదారులు మండలంలో ఈ ప్రాం తంపై కన్నేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా మండలంలోని వివిధ శాఖల అధికారులు విధులకు హాజరు కాకపోవడం ఇసుక అక్రమ రవాణాదారుల పాలిట వరంగా మారింది. ఇసుక అక్రమ రవాణా గురించి ఇటీవల స్థానిక ఎస్సైకి కొందరు సమాచారమందించగా ఆయన సిబ్బందితో దాడి చేసి లారీ, ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలకు భారీగా జరిమానా విధిస్తుండటంతో అక్రమ రవాణాదారులు వాటిని విడిపించుకోవడంలేదు. గతంలో అక్రమంగా ఇసుక రవాణా చేసిన వాహనాలపై వాల్టా చట్టం కింద అధికారులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అధికారులు ఆ చట్టం కింద కేసులు నమోదు చేయకపోవడంతో ఇసుక అక్రమ రవాణాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో అక్రమ ఇసుక రవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై దాడి చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, ఇసుక అక్రమ రవాణా నిరోధానికి తమ సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారన్నారు. ప్రజలు కూడా తమకు సమాచారమందిస్తే వెంటనే దాడులు చేస్తామన్నారు.
ఆగని ఇసుక అక్రమ రవాణా
Published Wed, Aug 28 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement