వారంతే..! | Police danda in srikakulam | Sakshi
Sakshi News home page

వారంతే..!

Published Mon, Sep 8 2014 1:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

వారంతే..! - Sakshi

వారంతే..!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో కొందరు పోలీసుల దందాలు హద్దుమీరుతున్నాయి. ఉన్నతాధికారి హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ.. ఎవరికి వారే బాసుల్లా రెచ్చిపోతున్నారు. ఇటీవలే కొత్త బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఆ.. ఇటువంటివి మామూలే అన్నట్లు కొందరు ఎస్సైలు, సీఐలు కొరకరాని కొయ్యల్లా తయారవుతున్నారు. వారి పనితీరు మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. గత నెలరోజు రోజుల్లో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో తమ సిబ్బంది పనితీరుపైనే నిఘా పెట్టాల్సివస్తోందని ఉన్నతాధికారులే వాపోతున్నారు.
 
 డీజీపీ నిర్ణయానికే ఠికానా లేదు
 ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్‌శాఖ చోరీ కేసులను తెరమీదకు తెచ్చిం ది. ఇన్నాళ్లూ మైనింగ్, ఇతర శాఖలే ఇసుక అక్రమ రవాణాపై కన్నేసేవి. సీజ్ చేసిన ఇసుక, వాహనాలను పోలీసులకు అప్పగించేవి. అయితే కొన్నాళ్ల క్రితం డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇసుక అక్రమార్కులపై పోలీస్ శాఖ పరంగా చోరీ కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా సంబంధిత నివేదికను ఆయా ప్రభుత్వ విభాగాలకు పంపిస్తున్నారు. ఆ మేరకు ఇటీవల గార పరిధిలో సీసీఎస్ పోలీసులు ఇసుక అక్రమరవాణాపై నిఘా పెట్టారు. కొన్ని వాహనాలను పట్టుకున్నారు. తొలుత స్టేషన్‌కు తరలించినా తరువాత వాహనాలు మాయమైపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ తక్షణ విచారణకు ఆదేశించడంతో బాధ్యులు నీళ్లు నమిలారు.
 
 ఆయా వాహనాలు చట్ట ప్రకారమే ఇసుకను తరలిస్తున్నాయని, పత్రాలు చూపించడంతో వాటిని వదిలేశామంటూ వివరణ ఇచ్చి తప్పించుకున్నారు. అయితే అసలు కథ వేరేగా వినిపిస్తోంది. వాహనాల్ని అధికారులకు తెలియకుండా పంపించేయడం వెనుక నేతల ఒత్తిళ్లు బాగా పనిచేశాయన్న ఆరోపణలొచ్చాయి. ఈ కేసులోనే కాదు. దాదాపు ఇసుక మాఫియా కేసులన్నీ రాజకీయ ఒత్తిళ్లతో నీరుగారిపోతున్నాయి. దీనికి తోడు ఇసుక అక్రమ రవాణాదారులు నెలవారీ మామూళ్లతో పోలీస్, మైనింగ్, ఇతర శాఖల చేతులు కట్టేస్తున్నారు. నాయకులే సిండికేట్లుగా మారి ఈ మాఫియాను తెర వెనుక నుంచి నడిపిస్తున్నారు. రాత్రి వేళల్లో  విశాఖకు పెద్ద సంఖ్యలో తరలుతున్న ఇసుక లారీల నుంచి రూ.2వేల నుంచిరూ.5వేల వరకు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
 పేదలపైనే ఎదురు కేసులు
 పెదబొమ్మిడి ప్రాంతంలో మంత్రి కుటుంబ సభ్యులుపేదల భూముల్ని సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నడంతో పాటు అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యాలకు దిగినట్టు కోటబొమ్మాళి స్టేషన్లో ఫిర్యాదు దాఖలు కాగా.. స్థానిక పోలీసులు రివర్స్ గేర్‌లో వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. నాయకుల ఒత్తిళ్లతో ఫిర్యాదు ఇచ్చినవారిపైనే తిరిగి కేసులు నమోదు చేశారని తెలిసింది. వారిచ్చిన ఫిర్యాదు వెనక్కు తీసుకుంటేనే నాయకులిచ్చిన ఫిర్యాదును కొట్టి వేస్తామని బాధితులపై పోలీసులే ఒత్తిడి తేవడం విడ్డూరంగా ఉంది. ఈ విషయమై పలు ప్రజా సంఘాలు కూడా కలిసి ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఎస్పీ కేసు విచారణను వేగవంతం చేయాలని స్థానిక డీఎస్పీ, సీఐలను ఆదేశించారు. అదే విధంగా సింగుపురం ప్రాంతంలో ఇటీవల అక్రమ మైనింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతపై కేసు నమోదు, అరెస్టులో పోలీసులు నాన్చుడు ధోరణి అవలంభించారు.
 
 జూదంపై ఏదీ నిఘా?
 జిల్లాలోని పలు ప్రాంతాల్లో జూదం నిర్విరామంగా కొనసాగుతున్నా ఆయా ప్రాంతాల పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో కూడా పలు హోటళ్లు, లాడ్జీల్లో వారాంతాల్లో చతుర్ముఖ పారాయణం జరుగుతోంది. నెలవారీ మామూళ్లు తీసుకుని పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణ శివార్లలోని తోటల్లో జోరుగా ఆట ఆడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నా కొంతమంది పోలీసు అధికారులే అడ్డుతగులుతున్నారన్న విమర్శలొచ్చాయి. ఇటీవల వంగర పోలీసులపై అనేక ఆరోపణలు రావడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. అయినా మార్పు కనిపించడం లేదు.
 
 ఆమదాలవసలోనూ అంతే..
 చిల్లర వర్తకులు నడుపుకొంటున్న ఆమదాలవలస కూరగాయల మార్కెట్ విషయంలోనూ అదే జరిగిం ది. నోటీసులు లేకుండా, కోర్టు నుంచి స్టే వస్తుందని చెబుతున్నా వినకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లతో బల వంతంగా రాత్రివేత విద్యుత్ సరఫరా నిలిపివేయిం చి మరీ మార్కెట్‌ను కూలగొట్టారు. శాంతిభద్రతల విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉన్నా అక్కడి పోలీసు అధికారులు పట్టించుకోలేదు. వ్యాపారులు, మున్సిపల్ అధికారులు, నాయకులతో చర్చలు జరి పించి కథ సుఖాంతం చేయాల్సిన స్థానిక పోలీసులు నేతల ఒత్తిళ్లకు లొంగిపోయి ఉద్రిక్తతలకు తావిచ్చారన్న విమర్శలొచ్చాయి. తీరా చూస్తే.. ఆ మరుసటి రోజే హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
 
 ఎవరి అండతో..
 పోలీస్‌శాఖలో పెత్తనం కొందిరిదే. నాయకుల అండ ఉన్న తమకేమీ కాదనే నమ్మకంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు యూని యన్ల పేరిట హడావుడి చేస్తున్నారు. బదిలీ చేసే అవకాశం కనిపించేసరికి ఎవరికి వారు తమకు తెలిసిన నాయకులతో పోలీస్ అధికారులపై సిఫారుసు ఒత్తిళ్లు తెప్పిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకునే సమయానికి అధికారులే ఇరుకున పడేలా చేయిస్తున్నారని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement