కాసుల కోసం కట్ట తెగ్గొట్టారు! | ruling party leaders | Sakshi
Sakshi News home page

కాసుల కోసం కట్ట తెగ్గొట్టారు!

Published Thu, Feb 4 2016 2:11 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ruling party leaders

బరితెగించిన అధికార పార్టీ నేతలు   
కాంట్రాక్టు పనుల కోసం కట్టమంచి చెరువుకు గండి
 సహకరించిన కార్పొరేషన్ అధికారులు   
వేసవిలో చిత్తూరు నగరానికి నీటి సమస్య?   ప్రజల ఆగ్రహం

 
 కరువు సీమలో చాలా ఏళ్ల తర్వాత కురిసిన వర్షాలకు చెరువులు నిండాయి. భూగర్భ జలాలూ పుష్కలమయ్యాయి. అయితే చెరువుల్లో పూడిక తీసేందుకు కాంట్రాక్టులు దక్కించుకున్న తెలుగుదేశం నాయకులు బరితెగించారు. డబ్బులు మంజూరైందే తడవుగా చెరువు కట్టలను తె గ్గొట్టారు. ముందూ వెనకా చూడకుండా  నీటిని వృథాగా వదిలేస్తున్నారు. నాయకులు తమ జేబులు నింపుకోవడానికి ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
 
 చిత్తూరు (అర్బన్): ఇటీవల చిత్తూరు లో విస్తారంగా వర్షాలు కురవడంతో నగరంలోని కట్టమంచి చెరువు పూర్తిగా నిండింది. అయితే కట్టమంచి చెరువులో పూడిక తీసి బోటింగ్ ఏర్పాటు చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆదేశించడంతో కార్పొరేషన్ అధికారులు, పాలకులు కలిసి చెరువు కట్టను తెగ్గొట్టి నీళ్లను మురుగునీటి కాలువలో బయటకు వదిలేశారు. చిత్తూరు నగరంలో అధికారపార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. పేరుకు సీఎం సొంత జిల్లా అయినా... టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో చిత్తూరు నగరం అభివృద్ధికి దూరంగానే ఉంది. వేసవి వస్తోందంటే నగర వాసులకు కన్నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 1.82 లక్షల జనాభా ఉన్న చిత్తూరు నగరానికి రోజుకు 22 లక్షల లీటర్ల నీళ్లు అవసరం. కానీ కార్పొరేషన్ అధికారులకు ప్రజలకు ఇస్తున్నది  సగటున 15 లక్షల లీటర్ల నీళ్లు మాత్రమే. అది కూడా 120 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్న కార్పొరేషన్ యంత్రాంగం నెలకు రూ.44 లక్షలు కరువు నిధులను ట్యాంకర్లకు అద్దె రూపంలో చెల్లిస్తోంది. మిగిలిన 7 లక్షల లీటర్ల నీళ్లను ప్రజలు డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఇంత నీటి ఎద్దడి ఉన్న చిత్తూరు నరంలో మూడు నెలల క్రితం విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు నిండాయి. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. అప్పటి మేయర్ కటారి అనురాధ(టీడీపీ) కార్పొరేషన్ సాధారణ పద్దుల నుంచి నగరంలోని కట్టమంచి చెరువుపై
 
కాసుల కోసం కట్టతెగ్గొట్టారు!
8 బోర్లు డ్రిల్ చేయడానికి ప్రతిపాదించగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ.20 లక్షల వ్యయంతో చెరువు కట్టపై బోర్లు వేసి ప్రజలకు నీళ్లందిస్తూ 60 అద్దె నీటి ట్యాంకర్లను తగ్గించారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మేయర్ హత్యకు గురవడం తెలిసిందే. అయితే కట్టమంచి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయాలని, నీరు-చెట్టు కింద పూడిక పనులు చేయించాల్సి ఉందని వెంటనే చెరువులో నీళ్లను ఖాళీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే డీఏ.సత్యప్రభ (టీడీపీ) ఆర్డీవో, కార్పొరేషన్ అధికారులకు గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. రానున్నది వేసవి కాలం, రూ.20 లక్షలతో వేసిన బోర్లు ఎందుకూ పనికిరాకుండాపోయి ప్రజలకు నీటి కష్టాలు వస్తాయనే విషయాలు అధికారులకు తెలిసినా ఎదురు చెప్పలేక కట్టమంచి చెరువును తెంపేశారు. ప్రస్తుతం ఇక్కడున్న నీళ్లన్నీ మురుగునీటి కాలువలో కలిసి వృథాగా పోతున్నాయి. దీనిపై అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి గండి కొట్టిన ప్రాంతాన్ని పూడ్చేస్తే, పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ అధికారులు మళ్లీ చెరువుకు గండి కొట్టి నీళ్లను బయటకు పంపేస్తున్నారు. ప్రతీ వ్యక్తి ఇంకుడు గుంతలు తవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు ఊదరగొడుతుంటే సొంతలాభం కోసం అదేపార్టీకి చెందిన నాయకులు ఇలాంటి పనులు చేయడంపై చిత్తూరు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement