తడారుతున్న గొంతులు
వరుణుడు ముఖం చాటేశాడు. చినుకు నేలరాలడం గగనమైంది. వంకలు, వాగులు, కుంటలు..ఇలా ఎక్కడా చుక్కనీరు లేదు. బోర్లన్నీ బావురుమంటున్నాయి. పంటల సాగు పూర్తిగా పడకేసింది. కనీసం తాగేందుకూ గుక్కెడు నీరు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెసీమల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
సరిగ్గా 20 రోజుల కిందట జిల్లాలో 220 గ్రామాలకు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేవారు. తాజాగా ఈ సంఖ్య 266కు చేరింది. జిల్లాలో తాగునీటి సమస్య ఎంత జఠిలంగా ఉందనేందుకు ఈ లెక్కలే
నిదర్శనం.
- జిల్లాలో గుక్కెడు తాగునీరూ కరువే
- వరుణుడి జాడ లేక అడుగంటిన భూగర్భజలాలు
- 37 మండలాల్లో 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా
- పది మండలాల్లో 22 అద్దె బోర్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. 37 మండలాల పరిధిలోని 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అధికంగా పుట్లూరు మండలంలో 25 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అలాగే ఆమడగూరు మండలంలో 24, తనకల్లు మండలంలో 21, ఓబుళదేవచెరువులో 18, యల్లనూరులో 18, నల్లమాడలో 17, తలుపులలో 14, ధర్మవరంలో 13, ముదిగుబ్బలో 12 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అసలే నీరులేని గ్రామాలకు మనిషికి 40 లీటర్ల మేరకు సరఫరా చేస్తున్నారు. అలాగే 96 గ్రామాల్లో పశువులకు నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కో పశువుకు 30 లీటర్ల లెక్కన అందిస్తున్నారు. వివిధ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి 22 వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకున్నారు. ఒక్కో బోరుకు నెలకు రూ. 6 వేలు అద్దె చెల్లిస్తున్నారు.
జఠిలమవుతున్న సమస్య
బోర్లలో నీరు అడుగంటుతుండడంతో తాగునీటి సమస్య రోజురోజుకు జఠిలమవుతోంది. గతేడాదికంటే ఈసారి సమస్య మరీ తీవ్రతరం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 200 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటే ఈసారి 266 గ్రామాలకు చేస్తున్నారు. అలాగే గతేడాది ఈ సమయానికి కేవలం 7 మాత్రమే వ్యవయబోర్లు అద్దెకు తీసుకుని ఉంటే, ఈసారి 22కు పెరిగింది. రానున్న వారం పదిరోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు గ్రామీణ నీటి పథకం అధికారులు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న రూ. 21.78 కోట్లు ఖర్చు చేశారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
సమస్య ఎక్కువవుతోంది
- కాంతానాథ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ
వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతూ తాగునీటి సమస్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఇప్పటిదాకా రూ. 21.78 కోట్లు ఖర్చు చేశాం. డిసెంబరు దాకా రూ. 12.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.