తాగునీటి ఎద్దడి నివారణకు రూ.4.48 కోట్లు | Rs .4.48 crore to the prevention of water scarcity | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి నివారణకు రూ.4.48 కోట్లు

Published Thu, Jul 31 2014 5:09 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

Rs .4.48 crore to the prevention of water scarcity

  •     రాబోవు రెండు నెలలు గడ్డుకాలంగా పరిగణిస్తున్నఅధికారులు
  •      సమస్యను అధిగమించేందుకు కరువు నివారణ నిధులు మంజూరు
  •      జిల్లాలో తాత్కాలికంగా బోర్ల డ్రిల్లింగ్ నిలుపుదల
  •      టైఅప్, ట్రాన్స్‌పోర్ట్‌లకే ప్రాధాన్యం
  • చిత్తూరు (టౌన్): జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 4.48 కోట్లతో అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రానున్న రెండు నెలల పాటు జిల్లాలో తాగునీటి పరిస్థితిని అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాలు నానాటికీ అడుగంటిపోతుండడంతో జిల్లాలో వర్షాలు కురిసేంతవరకు కొత్తబోర్ల తవ్వకాలను చేపట్టరాదనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. టైఅప్‌కు మొద టి ప్రాధాన్యతనిస్తూ, విధిలేని పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కూడా నిర్ణయించారు.

    ఆ మేరకు జిల్లా ప్రజాపరిషత్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులుతో కలిసి ముందస్తు ప్రణాళికలతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తాగునీటి ఎద్దడి నుంచి జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. జెడ్పీ సీఈవో వారంలో రెండుమూడు రోజులు జిల్లాలోని ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, డీఈఈలతో సమీక్షలు, వైర్‌లెస్ సెట్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ తాగునీటి ఎద్దడిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
     
    918 గ్రామాల్లో నీటిఎద్దడి
     
    ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని 10,872 హ్యాబిటేషన్లకుగాను మొత్తం 18,537 చేతిపంపులు ఉండగా వాటిలో 785 ఎండిపోయాయి. 8,594 రక్షిత మంచినీటి పథకాలు ఉండగా వాటిలో 225 పనిచేయడం లేదు. 2,278 గ్రామాల్లో డెరైక్ట్ పంపింగ్ ద్వారా నీటిసరఫరా జరుగుతోండగా వాటిలో సగానికి పైగా బోర్లు ఎండిపోయాయి. దాంతో 866 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా 52 గ్రామాల్లో టైఅప్ చేపట్టారు. జిల్లా మొత్తం మీద 918 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొని ఉంది. ఇది ఇప్పటివరకు జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి పరిస్థితి. అయితే జిల్లాలో వర్షాలు కురవని కారణంగా మరో రెండు నెలల పాటు తాగునీటి ఎద్దడి మరింత తీవ్రతరం కానుంది.

    ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలోని 41 మండలాల పరిధిలో మొత్తం 2,259 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 994 గ్రామాల్లో పరిస్థితి తీవ్రంగా వుండగా, 1,265 గ్రామాల్లో మరింత తీవ్రంగా ఉండనుందని అధికారులు గుర్తిం చారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు గాను సీఆర్‌ఎఫ్ (కెలామిటీ రిలీఫ్ ఫండ్) ద్వారా రూ.4.48 కోట్లను కలెక్టర్ ప్రత్యేకంగా విడుదల చేశారు. దాంతో టైఅప్, ట్రాన్స్‌పోర్ట్‌లను చేపట్టనున్నారు.
     
    బోర్ల తవ్వకాలకు బ్రేక్

     
    జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్ల తవ్వకాలను కలెక్టర్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇప్పటివరకు జిల్లా ప్రజాపరిషత్‌కు చెందిన 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 13 కోట్లను తాగునీటి ఎద్దడి నివారణ కోసం విడుదల చేయగా వాటిలో చాలావరకు కొత్తబోర్ల తవ్వకాలకే ఖర్చు చేశారు. అయితే వాటిలో 30 శాతం కూడా విజయవంతం కాలేదు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ వర్షాలు కురిసేంత వరకు జిల్లాలో కొత్త బోర్ల తవ్వకాలను నిలుపుదల చేశారు. తాగునీటి ఎద్దడి నివారణ కోసం టైఅప్, ట్రాన్స్‌పోర్ట్‌లు మాత్రమే చేపట్టాలని ఆదేశించారు. అందులోనూ టైఅప్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తూ విధిలేని పరిస్థితిలోనే ట్రాన్స్‌పోర్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించి ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement