బాల్యమంతా నీళ్ల మోతే
బడిక ఎగనామం..నీటికి కోసం పక్క గ్రామం నిత్యం తప్పని నీటి పాట్లుఖేడ్’ తండాల్లోవిద్యార్థుల నీటి గోసక్షేత్రస్థాయిలో‘సాక్షి’ పరిశీలన విద్యార్థి.. స్కూల్ బ్యాగు మోస్తేనే దేశ పార్లమెంటు చలించి పోయింది. పుస్తకాల మోతతో విద్యార్థి బాల్యం బరువెక్కుతోందని ఉభయ సభలు తల్ల‘ఢిల్లి’పోయాయి. బ్యాగు బరువును దించాల్సిందేనని ఎంపీలు అంతా ఏకాభిప్రాయానికి వచ్చి ‘యశపాల్ కమిటీ’ వేశారు.. ఇదీ ఢిల్లీ, హైదరాబాద్ మెట్రో నగరాల్లోని విద్యార్థులకు దొరికిన భరోసా... ఇదిగో...వీళ్లూ విద్యార్థులే. నారాయణఖేడ్ తండాల్లో పుట్టారు. నీళ్ల కోసం స్కూల్ బ్యాగ్‌ను మూలకు పడేశారు. గుక్కెడు నీళ్ల కోసం బడికి ఎగనామం పెట్టి వ్యవసాయ బోరు బావుల దగ్గర పడిగాపులు గాస్తున్నారు. బ్యాగు బరువు కాదు...తమ కంటే మూడింతలు బరువుండే నీళ్ల బిందలతో కిలో మీటర్లు నడుస్తున్నారు. మెడ ఎము కలు చిట్లి పోతున్నా...వెన్నెముక వంగిపోతున్నా ఏ పాలకుడు ఇంత వరకు ఈ విద్యార్థుల వైపు కన్నెత్తి చూడలేదు. విద్యార్థుల నీళ్ల కష్టాలు అసెంబ్లీ వరకైనా తీసుకుపోతాననే భరోసా ఇవ్వలేదు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
ఎండాకాలం వస్తే మంజీర ఎండిపోతుంది. వాగులు, చెరువులు బావుల్లో చుక్కనీరు ఉండదు. బోర్లు ఎండిపోతాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతాయి. నీళ్ల కోసం జనం వలస బాట పడతారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పల్లెల్లో ఏళ్లకేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇప్పటి వరకు ఏ పాలకుడు ప్రజల కష్టాల వైపు చూడలేదు. గుక్కెడు నీళ్లు తెచ్చి జనం గొంతు తడిపే ప్రయత్నం చేయలేదు. ఇక్కడి జనం కూడా అంతే..! పాలకుల మీద ఆశలు పెట్టుకోకుండా వలసలను నమ్ముకుంటున్నారు. బడికి వెళ్లే పిల్లలను, వయసు మీద పడిన తల్లిదండ్రులను ఇంటి వద్ద వదిలేసి భార్యాభర్తలు ముంబాయి, దుబాయి, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలసపోయారు.ఈ ఏడాది దాదాపు 25 వేల కుటుంబాలు వలస పోయినట్లు అంచనా.సాక్షి ప్రతినిధుల బృందం రెండు రోజులుగా దాదాపు 45 గ్రామల్లో, గిరిజన తండాల్లో పర్యటించింది.
ప్రతి గ్రామంలో దాదాపు 20 శాతం మంది విద్యార్థులు నీళ్ల కోసం స్కూల్‌కు గైర్హాజరయ్యారు. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్, కల్హేరు మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉంది. భార్యభర్తలు, యువతీయువకులు వలసలు పోయి పల్లెలు బోసిపోయి ఉన్నాయి. వయసు మళ్లిన వృద్ధులు, బడికి వెళ్లే పిల్లలు మాత్రమే తండాల్లో కన్పించారు. కంగ్టి మండలం చాప్టా(బీ) గ్రామ తుకారం తండాలో.. స్కూల్ యూనిఫాంతో నెత్తిన నీళ్ల బిందులు బోస్తూ... నిక్కి నీలిగి నడుస్తున్న విద్యార్థుల గుంపులు కన్పించాయి . ‘ స్కూల్ లేదా’ అని సాక్షి ప్రతినిధి పలకరిస్తే.. బడి ఉంది గాని, ‘నీళ్ల కోసం బడికి పోలేదు సార్’ అని సమాధానం చెప్పారు. ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు అని అడిగితే...‘నిజామాబాద్ జిల్లా విఠల్‌వాడీ తండా నుంచి తెచ్చుకుంటున్నాం’ అని చెప్పారు. తుకారం తండాకు విఠల్‌వాడీ తండా దాదాపు 3 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అంతకు ముందు సర్ధార్ తండాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ తండాలో దాదాపు 117 మంది విద్యార్థులు వలస వెళ్లగా.. 25 మంది విద్యార్థులు నీళ్ల కోసం బడి మానేశారు.
వయసులో ఉన్న వారంతా పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లగా.. గ్రామాల్లో వృద్ధులు మాత్రమే ఉండటంతో పిల్లలకు నీటి కష్టాలు తప్పటం లేదు. పెద్దశంకరంపేట మండలం కోళాపల్లి, మల్కాపూర్, జి.వెంకటాపూర్, కమలాపూర్, బూర్గుపల్లి, తమ్మలకుచ్చ తండా, బూర్గుపల్లి తండాలతో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తల్లిదండ్రులు పనులు, వలసలు వెళ్లడంతో పిల్లలు నీళ్లు మోస్తూ కనిపించారు. నారాయణఖేడ్ మండలంలోని పంచగామ, పైడిపల్లి, తుర్కాపల్లి, ర్యాకల్, నిజాంపేట్, హన్మంత్‌రావుపేట్ తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు బడి మాని నీళ్ళు మోస్తున్నారు. వచ్చిరానీ కొద్దిపాటి నీటికోసం వేచి ఉండడం, ఒకరికి ఒక బిందె మాత్రమే నీరు పట్టుకొనే పరిస్థితి ఉండడంతో ఇంట్లో ఉన్న తమ ఆడపిల్లలను తల్లిదండ్రులు బడిమానిపించి నీరుమోయిస్తున్నారు. కుళాయి, బోరుబావి వద్ద గంటలపాటు వేచి ఉండడంతో బడి మానక విద్యార్థులకు తప్పడంలేదు.
మనూరులో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది.ఇంట్లో నీళ్లు అయిపోయాయంటే వారు ఆరోజు పాఠశాలకు వెళ్లడం మానెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనూరు మండలం మాయకోడ్ గ్రామంలో బోరుబావుల వద్ద స్కూల్ యూనిఫాంతో ఖాళీబిందెలతో నిలబడిన సాయికుమార్ అనే విద్యార్థి క న్పించాడు, ‘బడికి వెళ్లలేదా?’అని అడిగితే ‘రాత్రి నీళ్లు దొరకలేదు సారు.. పొద్దున బడి మానేసి నీళ్లకు వచ్చిన. ఇంకా కరెంటు రాలేదు, కరెంటు వచ్చాక నీళ్లు తీసుకొని పోతా నని చెప్పాడు. వారంలో రెండు మూడు సారు బడి మానేసి నీళ్ల కోసం వస్తున్నట్టు సాయికుమార్ చెప్పాడు. బోరుబావి యజమానికి నీళ్లు తీసుకోనివ్వకపోతే మరో కిలో మీటర్ దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పాడు. ఉపాధ్యాయుల పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్లి నీళ్లు నింపి మళ్లీ పాఠశాలలకు వెళుతున్న సంఘటన అనేకంగా నెలకొంటున్నాయని పాఠశాలల ఉపాధ్యాయులు సాక్షి ప్రతినిధికి చెప్పారు.