సదువులు.. సందిగ్ధం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అందని ద్రాక్షగా మారుతోంది. గత విద్యా సంవత్సరం బకాయిలు ఇంకా విడుదల కాకపోవడంతో వారి చదువులు సందిగ్ధంలో పడ్డాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళ న చెందుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రూ.92 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల యాజమాన్యాలు కూడా నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగిడినా గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నేటికీ విడుదల కాకపోవడంతో కొన్ని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల నిరుపేదల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆసరాగా నిలుస్తోంది.
ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందన్న భరోసాతోనే చాలామంది విద్యార్థులు ఉన్నత చదవులు చదివేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, డిప్లమా, డిగ్రీ, పీజీ విద్యనభ్యసించిన విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లక్ష మందికి పైగా విద్యార్థులను సర్కార్ అర్హులుగా తేల్చింది. అయితే వీరిలో 49,548 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.92 కోట్ల నిధులు ఫీజు రీయింబర్స్ కాలేదు. ఫీజు రీయింబర్స్ కాని విద్యార్థుల్లో బీసీ విద్యార్థులు 26,000 మంది, ఈబీసీ 3,578 మంది, ఎస్సీలు 12,000 మంది, ఎస్టీ విద్యార్థులు 6,000 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిసే లోపే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కావాలి. కానీ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ పథకం విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదు.
దీంతో తమకు ఫీజు వస్తుందో..? లేదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఫైనలియర్ పూర్తి చేసిన విద్యార్థులు ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలకు వెళ్లాలన్నా, ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హత పత్రాలు తీసుకోవాలన్నా ముందుగా ఫీజు మొత్తం చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఫీజు కడితేనే అర్హత పత్రాలు ఇస్తామని చెబుతుండడంతో విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక, అంత డబ్బు సొంతంగా కట్టలేక సతమతమవుతున్నారు.
అంతా అగమ్యగోచరం
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై భరోసాతోనే మారుమూల గ్రామాల్లోని నిరుపేదల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో చేరి విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఉన్నట్టుండి ఫీజు రీయింబర్స్ చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులను అడిగితే త్వరలో వస్తాయని సమాధానం చెబుతున్నారే కానీ, కచ్చితమైన సమయం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు మాత్రం తమను ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశపరీక్ష రాసి సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు.
నూతన విధానం ఎప్పుడు..?
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాష్ర్ట విద్యార్థులకే ఫీజు పథకం వర్తింపజేసేలా కసరత్తు చేస్తోంది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెబుతున్నా, మరోవైపు అడ్మిషన్ల సమయం సమీపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో పడిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ అభ్యసిస్తున్న విద్యార్థులు జిల్లాలో కొంతమంది మాత్రమే ఉన్నట్లు సంక్షేమ శాఖల అధికారులు పేర్కొంటున్నారు. 1956 ముందు విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణలో నివాసం ఉన్నట్లయితే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపజేయాలనే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఇది అమలైనా ఈ కేటగిరిలో జిల్లాలో కేవలం కొంతమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మిగతా అర్హులైన విద్యార్థులు అందరికీ ఫీజు విడుదలవుతుందని అధికారులు పేర్కొంటున్నా, విద్యార్థులు మాత్రం ఫీజు డబ్బుల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.