జలసిరి.. కిరికిరి!
► బోరులో నీరు పడకపోతే బిల్లు రైతులదే..!
► ఎన్టీఆర్ జలసిరి పథకంలో కొత్త ట్విస్ట్
► 200 అడుగులు దాటినా అదనపు భారం రైతులపైనే
► అడుగుకు ఏకంగా రూ.90 మేర చెల్లింపు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ఆయకట్టు పరిధిలోని రైతులకు ఎన్టీఆర్ జలసిరి కింద ఉచితంగా బోర్లు వేయిస్తాం..రండి..దరఖాస్తు చేసుకోండి’’ అని మా ఊరు-జన్మభూమి సందర్భంగా ఊదరగొట్టిన ప్రభుత్వం తాజాగా బాంబు పేల్చింది. నీళ్లు పడితేనే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుందని.. లేదంటే రైతులే చెల్లించాలని తిరకాసు పెట్టింది. అంతేకాదు నీళ్లు పడినా... 200 అడుగులు దాటితే మాత్రం ఆ అదనపు భారం కూడా రైతులే భరించాల్సి ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పింది. ఫలితంగా ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు వేయించుకోవాలని దరఖాస్తులు సమర్పించిన రైతులు..ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కోనున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ జలసిరి పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టే విధంగా తయారయ్యింది.
భారీగా దరఖాస్తులు. జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి కింద 5 ఎకరాల్లోపు బ్లాక్‌ను ఒక గ్రూపుగా గుర్తించి.. బోర్లు వేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ బోర్లనుకేవలం ఆయకట్టు ప్రాంతంలో మాత్రమే వేయనున్నారు. వర్షాలు సరిగా పడక కాల్వలకు నీరు రాకపోయినా బోర్ల ద్వారా ఈ పంటలను కాపాడవచ్చునని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో ఈ విధంగా 10,223 బోర్లను వేయాలని నిర్ణయించారు. వీటి కోసం 16,480 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 360 గ్రామాల్లో మాత్రమే ఎన్టీఆర్ జలసిరి పథకం వర్తించేందుకు అవకాశం ఉంది. ఈ గ్రామాలను భూగర్భ జలాల అధికారుల నివేదిక ఆధారంగా ఎంపిక చేశారు. ఎక్కడ బోరు వేయాలనే విషయాన్ని భూగర్భ శాస్త్రవేత్తల ద్వారా గుర్తించి... అక్కడే వేస్తారు. ఈ పనిని ప్రభుత్వమే చేస్తుంది. ఇక్కడే కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.
మాపై భారమా?
ఎక్కడ బోరు వేయాలనే విషయాన్ని స్వయంగా భూగర్భ శాస్త్రవేత్తలు చూపించిన తర్వాత నీరు పడకుంటే... ఆ భారం రైతులపై ఎలా వేస్తారనేది కీలకంగా మారింది. అంతేకాకుండా ఆయకట్టు ప్రాంతంలోనే 200 అడుగులకు మించి లోపలికి బోరు వేయాల్సి రాదనేది భూగర్భజల శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ 200 అడుగులు దాటితే ఆ అదనపు భారం రైతులే భరించాలని ప్రభుత్వం చెబుతుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా ఉచితంగా వేస్తామన్న బోర్లు..అంతిమంగా రైతులపై అదనపు భారం మోపే విధంగానే తయారయ్యాయి. అంతేకాకుండా ఏకంగా అడుగుకు రూ.90లుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ పథకం తమకు అదనపు భారంగా తయారుకానుందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
లబ్ధిదారులను గుర్తించలేదు
జిల్లాలో 10,223 బోర్లను ఎన్టీఆర్ జలసిరి కింద వేయనున్నాం. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించాం. ఇంకా లబ్ధిదారులను గుర్తించలేదు. రైతులందరూ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. లబ్దిదారులు చిన్న, సన్నకారు రైతులై ఉండటంతో పాటు 5 ఎకరాల బ్లాక్ ఉండాలి. ఒక రైతుకు 3 ఎకరాలు ఉండి, ఇంకో రైతుకు 2 ఎకరాలు ఉంటే ఇద్దరికీ కలిపి ఒకే బోరును వేస్తాం. ఈ విధంగా గ్రూపింగ్ చేయడంపై దృష్టి సారించాం. మొత్తం బోరు వేసేందుకు రూ.24 వేలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఒకవేళ బోరు పడకపోతే రైతులే చెల్లించాలనే విషయంలో మాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. పుల్లారెడ్డి, డ్వామా పీడీ