NTR jalasiri scheme
-
జలసిరి.. కిరికిరి!
► బోరులో నీరు పడకపోతే బిల్లు రైతులదే..! ► ఎన్టీఆర్ జలసిరి పథకంలో కొత్త ట్విస్ట్ ► 200 అడుగులు దాటినా అదనపు భారం రైతులపైనే ► అడుగుకు ఏకంగా రూ.90 మేర చెల్లింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ఆయకట్టు పరిధిలోని రైతులకు ఎన్టీఆర్ జలసిరి కింద ఉచితంగా బోర్లు వేయిస్తాం..రండి..దరఖాస్తు చేసుకోండి’’ అని మా ఊరు-జన్మభూమి సందర్భంగా ఊదరగొట్టిన ప్రభుత్వం తాజాగా బాంబు పేల్చింది. నీళ్లు పడితేనే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుందని.. లేదంటే రైతులే చెల్లించాలని తిరకాసు పెట్టింది. అంతేకాదు నీళ్లు పడినా... 200 అడుగులు దాటితే మాత్రం ఆ అదనపు భారం కూడా రైతులే భరించాల్సి ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పింది. ఫలితంగా ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు వేయించుకోవాలని దరఖాస్తులు సమర్పించిన రైతులు..ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కోనున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ జలసిరి పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టే విధంగా తయారయ్యింది. భారీగా దరఖాస్తులు. జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి కింద 5 ఎకరాల్లోపు బ్లాక్‌ను ఒక గ్రూపుగా గుర్తించి.. బోర్లు వేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ బోర్లనుకేవలం ఆయకట్టు ప్రాంతంలో మాత్రమే వేయనున్నారు. వర్షాలు సరిగా పడక కాల్వలకు నీరు రాకపోయినా బోర్ల ద్వారా ఈ పంటలను కాపాడవచ్చునని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో ఈ విధంగా 10,223 బోర్లను వేయాలని నిర్ణయించారు. వీటి కోసం 16,480 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 360 గ్రామాల్లో మాత్రమే ఎన్టీఆర్ జలసిరి పథకం వర్తించేందుకు అవకాశం ఉంది. ఈ గ్రామాలను భూగర్భ జలాల అధికారుల నివేదిక ఆధారంగా ఎంపిక చేశారు. ఎక్కడ బోరు వేయాలనే విషయాన్ని భూగర్భ శాస్త్రవేత్తల ద్వారా గుర్తించి... అక్కడే వేస్తారు. ఈ పనిని ప్రభుత్వమే చేస్తుంది. ఇక్కడే కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. మాపై భారమా? ఎక్కడ బోరు వేయాలనే విషయాన్ని స్వయంగా భూగర్భ శాస్త్రవేత్తలు చూపించిన తర్వాత నీరు పడకుంటే... ఆ భారం రైతులపై ఎలా వేస్తారనేది కీలకంగా మారింది. అంతేకాకుండా ఆయకట్టు ప్రాంతంలోనే 200 అడుగులకు మించి లోపలికి బోరు వేయాల్సి రాదనేది భూగర్భజల శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ 200 అడుగులు దాటితే ఆ అదనపు భారం రైతులే భరించాలని ప్రభుత్వం చెబుతుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా ఉచితంగా వేస్తామన్న బోర్లు..అంతిమంగా రైతులపై అదనపు భారం మోపే విధంగానే తయారయ్యాయి. అంతేకాకుండా ఏకంగా అడుగుకు రూ.90లుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ పథకం తమకు అదనపు భారంగా తయారుకానుందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. లబ్ధిదారులను గుర్తించలేదు జిల్లాలో 10,223 బోర్లను ఎన్టీఆర్ జలసిరి కింద వేయనున్నాం. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించాం. ఇంకా లబ్ధిదారులను గుర్తించలేదు. రైతులందరూ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. లబ్దిదారులు చిన్న, సన్నకారు రైతులై ఉండటంతో పాటు 5 ఎకరాల బ్లాక్ ఉండాలి. ఒక రైతుకు 3 ఎకరాలు ఉండి, ఇంకో రైతుకు 2 ఎకరాలు ఉంటే ఇద్దరికీ కలిపి ఒకే బోరును వేస్తాం. ఈ విధంగా గ్రూపింగ్ చేయడంపై దృష్టి సారించాం. మొత్తం బోరు వేసేందుకు రూ.24 వేలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఒకవేళ బోరు పడకపోతే రైతులే చెల్లించాలనే విషయంలో మాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. పుల్లారెడ్డి, డ్వామా పీడీ -
రైతుకు చేరని జలసిరి
► దరఖాస్తుల దశ దాటని ఎన్టీఆర్ పథకం ► క్షేత్రస్థాయిలో ప్రచారం కరువు ► రైతులకు అవగాహన కల్పించడంలో విఫలం ఇప్పటికి రెండుసార్లు గడువు పొడిగింపు అయినా వచ్చిన దరఖాస్తులు లక్ష్యంలో సగమే సమర్థంగా అమలు చేస్తే తీరనున్న సాగునీటి కొరత సాక్షి ప్రతినిధి, గుంటూరు : క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రైతుల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, పథకానికి విసృ్తత స్థాయిలో ప్రచారం కల్పించకపోవడం తదితర కారణాలతో ఎన్టీఆర్ జలసిరి పథకానికి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యంలో సగం మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన జిల్లాల్లోని రైతులు పథకం పట్ల సానుకూలంగా ఉన్నారని పంచాయతీరాజ్ కమిషనర్ బి.రామాంజనేయులు ఇటీవల గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. వాణిజ్య పంటల సాగుకు అనువుగా ఉండే గుంటూరు జిల్లాలో ఈ పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసు కోవాలని సూచించారు. పథకాన్ని సమర్థం గా అమలు చేస్తే రైతులకు సాగునీటి కొర త తీరుతుందనే అభిప్రాయాన్ని వ్యవసాయరంగ నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. 200 అడుగులు దాటితే ఖర్చు రైతుదే.. వర్షాభావం వెన్నాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం ద్వారా వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసి, పంటలకు సాగునీటి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. బోర్లు వేసుకునే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిధులు సమకూర్చుతోంది. జిల్లాలో భూగర్భ జలాలు అందుబాటులో ఉండే 32 మండలాల్లోనే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక్కడ బోర్లు వేసుకోవడానికి ముందుకు వచ్చే రైతులకు 200 అడుగుల వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. ఆపై బోరు వేసిన ప్రతీ అడుగుకు అయ్యే ఖర్చు రైతులే భరించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 13,386 బోర్లు ఏర్పాటు చేసేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల నుంచి దరఖాస్తులు కోరింది. ఖరీఫ్‌లో పంటల దిగుబడి ఆశాజనకంగా రాకపోవడం, ప్రస్తుత రబీలో సాగులో ఉన్న పంటను కాపాడుకునేందుకు సాగునీటికి రైతులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పథకాన్ని అమలుపరిచే మండల స్థాయి అధికారులు కూడా రైతులకు పథక ప్రయోజనాలను వివరించడంలో విఫలమయ్యారని స్పష్టమవుతోంది. ప్రచారంతోనే ప్రయోజనం.. యూనిట్ విలువ రూ.1.19 లక్షలు ఉంటే ఎస్సీ, ఎస్టీలు ఇందులో 5 శాతం భరించాలి. ఓసీ, బీసీ వర్గానికి చెందిన రైతులు లబ్ధిదారుని వాటాగా రూ.18 వేలు చెల్లించాలి. జిల్లా యంత్రాంగం గుర్తించిన కమాండ్ ఏరియాలో ఎస్సీ, ఎస్టీ రైతులకు సొంతంగానే భూములు ఉన్నాయి. వీరికి మంజూరయ్యే యూనిట్ ఖర్చు దాదాపు కేంద్రమే భరిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ రైతులను అధికారులు సంప్రదించి పథకం ప్రయోజనాలు వివరిస్తే ముందుకు వచ్చి ఉండేవారనే అభిప్రాయం వినపడుతోంది. అలాగే కమాండ్ ఏరియాలోని ఓసీ, బీసీ రైతులు యూనిట్‌కు తన వాటాగా చెల్లించాల్సిన రూ.18 వేలు భారం కాక పోవచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. లేనిదల్లా పథకానికి ప్రచారమేనంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుల నుంచి 9 వేల వరకే దరఖాస్తులు వచ్చాయి. దీంతో గడువు తేదీని పొడిగించినట్టుగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ప్రకటించి, పథకానికి విస్తృత ప్రచారం కలిగించాలని అధికారులకు సూచించారు. అధికారులు మండలస్థాయి సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. మండల స్థాయి అధికారులు, సిబ్బందిని రైతుల వద్దకు వెళ్లాలని, దరఖాస్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ఎన్టీఆర్ జలసిరికి నిబంధనల కొర్రీ
దరఖాస్తునకు రోజుకో నిబంధన అమలు జాబ్‌కార్డు, సన్నకారు సర్టిఫికెట్ల కోసం నిరీక్షణ ఉపాధి, మీసేవ కార్యాలయాల వద్ద పడిగాపులు ఈ నెల 25తో ముగియనున్న దరఖాస్తు గడువు తెరుచుకోని జలసిరి ఆన్లైన్ ఆందోళనలో రైతులు రాపూరు/సైదాపురం: బంజరు భూములకు సాగునీటిని అందించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత ఎన్టీఆర్ జలసిరి పథకం లక్ష్యం నెరవేరేలా లేదు. జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం రోజుకో నిబంధన అమలు చేస్తుండడంతో రైతులు తలలుపట్టుకుంటున్నారు. దర ఖాస్తునకు సన్న,చిన్నకారు రైతుగా గుర్తింపు సర్టిఫికెట్, ఉపాధి జాబ్‌కార్డు తప్పనిసరి చేయడంతో వాటి కోసం రైతులు ఉపాధి, మీసేవ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అన్ని సర్టిఫికెట్లు తీసుకున్నా దరఖాస్తు చేసుకునేందుకు జలసిరి సైట్ తెరుచుకోకపోతుండంతో రైతులు నిరాశ చెందుతున్నారు. పథకం లక్ష్యం ఇదీ.. ఎస్సీ,ఎస్టీలతో పాటు సన్న, చిన్నకారు రైతులకు చెందిన బంజరు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రభుత్వం బోర్లతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది. ఇందుకు సంబంధించి యూనిట్‌కు రూ.1.27,000 కేటాయించింది. 300 మీటర్ల లోతు వరకు బోర్ వేసుకునేందుకు అడుగుకు రూ.80 వంతున రూ.24వేలు, కేసింగ్‌పైపు 20 మీటర్లు అడుగుకు రూ.400 వంతున రూ.8వేలు, పిట్టింగ్కు రూ.5వేలు, మోటారుకు రూ.40వేలు, విద్యుత్ కనెక్షన్‌కు రూ.50 వేలు వంతున విడుదల చేసింది. ఈ పథకం కింద ఎంపికైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు తమ వాటాగా 5శాతం అంటే రూ.4,500, ఇతర రైతులు 20 శాతం అంటే రూ.18వేలు చెల్లించాల్సి ఉంటుంది. 5 ఎకరాలలోపు భూములున్న ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు మాత్రమే పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు పాసుపుస్తకం, 1బీ, ఆదార్‌కార్డు, జాబ్‌కార్డు, సన్న, చిన్నకారు సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందుపర్చాలి. అన్నదాతలకు దరఖాస్తు కష్టాలు ప్రభుత్వం విధించిన నిబంధనలతో ఎన్టీఆర్ జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సన్న, చిన్నకారు రైతు సర్టిఫికెట్ కోసం రైతులు మీసేవలో నమోదు చేసుకోవాలి. ఇందుకోసం పాసుపుస్తకం జెరాక్స్, 1బీ, రేషన్‌కార్డు, ఆదార్‌కార్డు, దరఖాస్తు ఫారంతో పాటు 45 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. అక్కడి నుంచి సంబంధిత వీఆర్వోకు దరఖాస్తు వెళ్తుంది. వీఆర్వో చేతులు తడిపితే తప్ప తహశీల్దార్ నుంచి సన్న,చిన్నకారు సర్టిఫికెట్ అందడం లేదని రైతులు తెలిపారు. లేకపోతే పనులు మానుకుని రెండు, మూడు రోజుల పాటు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందేనని చెబుతున్నారు. అలాగే ఉపాధి జాబ్ కార్డు కోసం ఉపాధి కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెరుచుకోని జలసిరి సైట్ ప్రభుత్వం తొలుత ఎన్టీఆర్ జలసిరి దరఖాస్తుల సేకరణ బాధ్యతలను ఎంపీడీఓ, ఏపీఓలకు అప్పగించింది. ఈ మేరకు రైతులు ఎంపీడీఓ, ఏపీఓలకు దరఖాస్తులు అందజేశారు. అనంతరం ప్రభుత్వం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రైతులను పిలిచి ఆ విధంగా చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10తోనే దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ మళ్లీ 25వతేదీ వరకు గడువు పెంచారు. మీసేవలో దరఖాస్తు చేసుకునేందుకు సైట్ ఓపెన్ కాకపోతుండడంతో రైతులు మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మీసేవ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం ఎన్టీఆర్ జలసిరి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రం చుట్టూ రెండు రోజులుగా తిరుగుతున్నా. జలసిరి సైట్ ఓపెన్ కావడం లేదని మీసేవ సిబ్బంది చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలే తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి సైట్ ఓపెన్ అయ్యేలా చూడాలి. -గోపిదేశి రామయ్య (తురిమెర్ల, సైదాపురం మండలం) సర్టిఫికెట్ల కోసం తిరగ డానికే సరిపోతోంది ఎన్టీఆర్ జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు సన్న,చిన్నకారు సర్టిఫికెట్ కావాలన్నారు. మూడు రోజులుగా సర్టిఫికెట్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. జాబ్‌కార్డు కోసం ఇంకెన్ని రోజులు తిరగాల్సి వస్తుందో. ప్రభుత్వం స్పందించి దరఖాస్తు గడువును పెంచాలి. -నాగా ప్రకాష్‌రెడ్డి(రాపూరు) -
రోజంతా టీవీ ముందే!
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా, డివిజన్, మండల అధికారులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు టీవీ ముందు అతుక్కుపోయారు. విజయవాడలో ముఖ్య మంత్రి నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను వీక్షించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ పూర్తి వివరాలను జిల్లా నుంచి మండల స్థాయి అధికారులందరూ వీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి కలెక్టర్, డ్వామా, ఆర్డీఓ, తహశీల్దారు కార్యాలయాల్లోని వీడియో కాన్ఫరెన్స్‌కు పరిమితమయ్యారు. కలెక్టర్ చాంబర్ పక్కన ఉన్న వీడియో కాన్ఫరెన్స్ రూము నుంచి జేసీ హరికిరణ్, జేసీ-2 రామస్వామి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ తదితర అధికారులందరూ కలెక్టర్ కాన్ఫరెన్స్‌ను వీక్షించారు. మంగళవారం కూడా ఉదయం 10 నుంచి రాత్రి వరకు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు టీవీ ముందు ఉండాల్సిందే. ముఖ్యమంత్రి చెప్పే ప్రాధాన్యత అంశాలను అనుసరించి అన్ని శాఖలు అధికారులు పనిచేస్తారని ప్రభుత్వ ఉద్దేశం. అవసరాన్ని బట్టి జిల్లా, డివిజన్, మండల అధికారులతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి నిర్వహించిన సదస్సులో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నీటి సమస్య పరిష్కారానికి జిల్లాకు రూ.25 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. నీరు- చెట్టు, ఎన్టీఆర్ జలసిరి, పంటల సంజీవని ప్రగతి గురించి వివరించారు.