రోజంతా టీవీ ముందే!
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా, డివిజన్, మండల అధికారులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు టీవీ ముందు అతుక్కుపోయారు. విజయవాడలో ముఖ్య మంత్రి నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను వీక్షించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ పూర్తి వివరాలను జిల్లా నుంచి మండల స్థాయి అధికారులందరూ వీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి కలెక్టర్, డ్వామా, ఆర్‌డీఓ, తహశీల్దారు కార్యాలయాల్లోని వీడియో కాన్ఫరెన్స్‌కు పరిమితమయ్యారు. కలెక్టర్ చాంబర్ పక్కన ఉన్న వీడియో కాన్ఫరెన్స్ రూము నుంచి జేసీ హరికిరణ్, జేసీ-2 రామస్వామి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ తదితర అధికారులందరూ కలెక్టర్ కాన్ఫరెన్స్‌ను వీక్షించారు. మంగళవారం కూడా ఉదయం 10 నుంచి రాత్రి వరకు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు టీవీ ముందు ఉండాల్సిందే.
ముఖ్యమంత్రి చెప్పే ప్రాధాన్యత అంశాలను అనుసరించి అన్ని శాఖలు అధికారులు పనిచేస్తారని ప్రభుత్వ ఉద్దేశం. అవసరాన్ని బట్టి జిల్లా, డివిజన్, మండల అధికారులతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి నిర్వహించిన సదస్సులో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నీటి సమస్య పరిష్కారానికి జిల్లాకు రూ.25 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. నీరు- చెట్టు, ఎన్టీఆర్ జలసిరి, పంటల సంజీవని ప్రగతి గురించి వివరించారు.