రైతుకు చేరని జలసిరి
► దరఖాస్తుల దశ దాటని ఎన్టీఆర్ పథకం
► క్షేత్రస్థాయిలో ప్రచారం కరువు
► రైతులకు అవగాహన కల్పించడంలో విఫలం
ఇప్పటికి రెండుసార్లు గడువు పొడిగింపు
అయినా వచ్చిన దరఖాస్తులు లక్ష్యంలో సగమే
సమర్థంగా అమలు చేస్తే తీరనున్న సాగునీటి కొరత
సాక్షి ప్రతినిధి, గుంటూరు : క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రైతుల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, పథకానికి విసృ్తత స్థాయిలో ప్రచారం కల్పించకపోవడం తదితర కారణాలతో ఎన్‌టీఆర్ జలసిరి పథకానికి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యంలో సగం మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన జిల్లాల్లోని రైతులు పథకం పట్ల సానుకూలంగా ఉన్నారని పంచాయతీరాజ్ కమిషనర్ బి.రామాంజనేయులు ఇటీవల గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. వాణిజ్య పంటల సాగుకు అనువుగా ఉండే గుంటూరు జిల్లాలో ఈ పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసు కోవాలని సూచించారు. పథకాన్ని సమర్థం గా అమలు చేస్తే రైతులకు సాగునీటి కొర త తీరుతుందనే అభిప్రాయాన్ని వ్యవసాయరంగ నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు.
200 అడుగులు దాటితే ఖర్చు రైతుదే..
వర్షాభావం వెన్నాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం ద్వారా వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసి, పంటలకు సాగునీటి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. బోర్లు వేసుకునే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిధులు సమకూర్చుతోంది. జిల్లాలో భూగర్భ జలాలు అందుబాటులో ఉండే 32 మండలాల్లోనే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక్కడ బోర్లు వేసుకోవడానికి ముందుకు వచ్చే రైతులకు 200 అడుగుల వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. ఆపై బోరు వేసిన ప్రతీ అడుగుకు అయ్యే ఖర్చు రైతులే భరించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 13,386 బోర్లు ఏర్పాటు చేసేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల నుంచి దరఖాస్తులు కోరింది. ఖరీఫ్‌లో పంటల దిగుబడి ఆశాజనకంగా రాకపోవడం, ప్రస్తుత రబీలో సాగులో ఉన్న పంటను కాపాడుకునేందుకు సాగునీటికి రైతులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పథకాన్ని అమలుపరిచే మండల స్థాయి అధికారులు కూడా రైతులకు పథక ప్రయోజనాలను వివరించడంలో విఫలమయ్యారని స్పష్టమవుతోంది.
ప్రచారంతోనే ప్రయోజనం..
యూనిట్ విలువ రూ.1.19 లక్షలు ఉంటే ఎస్సీ, ఎస్టీలు ఇందులో 5 శాతం భరించాలి. ఓసీ, బీసీ వర్గానికి చెందిన రైతులు లబ్ధిదారుని వాటాగా రూ.18 వేలు చెల్లించాలి. జిల్లా యంత్రాంగం గుర్తించిన కమాండ్ ఏరియాలో ఎస్సీ, ఎస్టీ రైతులకు సొంతంగానే భూములు ఉన్నాయి. వీరికి మంజూరయ్యే యూనిట్ ఖర్చు దాదాపు కేంద్రమే భరిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ రైతులను అధికారులు సంప్రదించి పథకం ప్రయోజనాలు వివరిస్తే ముందుకు వచ్చి ఉండేవారనే అభిప్రాయం వినపడుతోంది. అలాగే కమాండ్ ఏరియాలోని ఓసీ, బీసీ రైతులు యూనిట్‌కు తన వాటాగా చెల్లించాల్సిన రూ.18 వేలు భారం కాక పోవచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. లేనిదల్లా పథకానికి ప్రచారమేనంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుల నుంచి 9 వేల వరకే దరఖాస్తులు వచ్చాయి. దీంతో గడువు తేదీని పొడిగించినట్టుగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ప్రకటించి, పథకానికి విస్తృత ప్రచారం కలిగించాలని అధికారులకు సూచించారు. అధికారులు మండలస్థాయి సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. మండల స్థాయి అధికారులు, సిబ్బందిని రైతుల వద్దకు వెళ్లాలని, దరఖాస్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు.