పేద కుటుంబాలకు చేయూతనివ్వాలి
తమిళనాడు గవర్నర్ రోశయ్య
పేదజిల్లా ధనికంగా మారాలి: మంత్రి సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేసే ప్రజాహిత కార్యక్రమాలు అందుకోలేని వారికి సంఘాలు చేయూతనిచ్చి వారిని ప్రోత్సహించాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కోరారు. శనివారం బాదేపల్లి వాసవీకన్యకా పరమేశ్వరీ దేవాలయంలో జరిగిన ఆర్యవైశ్య యువజన సంఘం రజతోత్సవ కార్యక్రమానికి రోశయ్యతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్త తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోశయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అందించే పలు కార్యక్రమాలను అట్టడుగుస్థాయిలో ఉన్న ఆర్యవైశ్యులు ఆందుకోలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
మీకేం లక్ష్మిపుత్రులు మీకేందుకండి ఈ పథకాలు అంటారేమోనన్న సందేహంతో ఎన్నో వైశ్య కుటుంబాలు పేదరికంలో పూటగడవని స్థితిలో ఉన్నా ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే స్థితిలో లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ప్రభుత్వ హాస్టళ్లలో చేరడానికి సైతం బిడియ పడుతున్నారన్నారు. ఇటువంటి సందర్భంలో చదువుకు తదితర సంక్షేమ పథకాలను వారికి అందించేందుకు సేవాదృక్పథంతో సహకరించాలని సూచించారు.
ధనిక జిల్లాగా మారబోతుంది
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేద జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా సీఎం కేసీఆర్ చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో రాబోయే రోజుల్లో ధనిక జిల్లాగా మారబోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు తగ్గుతున్న కాలంలో గవర్నర్ రోశయ్య తనదైన శైలిలో విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారని కొనియాడారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంతో పాటు కొత్తగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
తాగు, సాగునీరుతో జిల్లా సస్యశ్యామలం కానుందన్నారు. వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మంచి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గల వైద్య విధానాలను తెలంగాణలో అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సేవలు ప్రశంసనీయమన్నారు.
ఎమ్మెల్యే గణేష్ గుప్త మాట్లాడుతూ వైశ్యులు రాజకీయరంగంలో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, రోశయ్య తమకు రోల్‌మోడల్‌గా నిలిచారని ప్రశంసించారు. 16సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రిగా రోశయ్య ప్రత్యేకత కలిగి ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో జేసీ రాంకిషన్, ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినర్సింహ, యువజన సంఘం అధ్యక్షుడు జయకృష్ణ, రాంమోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.