రూ.450 కోట్ల వ్యయంతో నిర్మాణానికి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు వరద ముంచెత్తటంతో వాగులు, వంకలపై ఉండే కాజ్‌వేలు నీటమునిగి కొద్దిరోజులపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటం వర్షాకాలంలో సహజంగా కనిపిస్తుంది. ఇటీవల దాదాపు పది రోజులపాటు తెరిపివ్వకుండా కురిసిన వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కాజ్‌వేలు వరదలోనే మునిగి ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలాంటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. తొలి విడతగా వంద ప్రాంతాల్లో కాజ్‌వేలను తొలగించి వాటి స్థానంలో వంతెనలు నిర్మించాలని భావిస్తోంది. దీనికి రూ.450 కోట్ల వరకు ఖర్చవుతుందని రోడ్లు భవనాల శాఖ ప్రాథమిక అంచనా సిద్ధం చేసింది. దీన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది.
ఢిల్లీ నుంచి నిధులు..
ఇటీవలి వానల్లో తీవ్ర ఇబ్బంది ఏర్పడిన వంద ప్రాంతాలను గుర్తించిన అధికారులు కాజ్‌వేల స్థానంలో వంతెనలు నిర్మిస్తే బాగుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తెచ్చారు. దానికి ఆయన సమ్మతించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. వరదలకు దెబ్బతిన్న రోడ్ల వివరాలను అందజేసే సందర్భంలో వంతెనల అంశాన్ని జోడించారు. కాజ్‌వేలు రోజుల తరబడి నీట మునిగి రాకపోకలకు ఇబ్బంది ఎదురైన ప్రాంతాల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. వాటి స్థానంలో వంతెనలు నిర్మించాలని అందులో పేర్కొన్నారు. భారీ వర్షాలకు జరిగిన నష్టం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం అందులో ఈ ఖర్చునూ జోడించింది. ప్రాథమికంగా రూ.450 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన రోడ్లు భవనాల శాఖ.. దానితో కలుపుకొని వర్షాల వల్ల రోడ్లకు జరిగిన నష్టాన్ని రూ.866 కోట్లుగా చూపింది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కొంతభాగం ఈ వంతెనలకు కేటాయించనున్నారు. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
వంద కాజ్‌వేల స్థానంలో వంతెనలు
Published Mon, Oct 3 2016 2:32 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM
Advertisement
Advertisement