2న ఎక్కడున్నా నవనిర్మాణ దీక్ష చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం బాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జూన్ రెండోతేదీన నవ నిర్మాణదీక్షపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జూన్ రెండో తేదీ ఉదయం 11 గంటలకు అందరూ ఎక్కడున్నా నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు.
అశాస్త్రీయ విభజన-రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులపైన జూన్ 3న, ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలు, ప్రభుత్వం సాధించిన విజయాలపైన 4న సదస్సులు నిర్వహిస్తామన్నారు. 5న వ్యవసాయరంగంలో ప్రగతి, ఆరున పరిశ్రమలు, సేవారంగాల్లో ప్రగతి, 7న గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. 8వ తేదీన ఒంగోలు లేదా రాజమండ్రిలో మహాసంకల్ప దీక్ష చేపడతామన్నారు.