గొంతెండుతోంది!
పాలమూరులో వేసవికి ముందే దాహం..దాహం
► అల్లాడుతున్న గ్రామ, నగరవాసులు
► భవిష్యత్‌లో గుక్కెడు నీటికీ కష్టకాలమే
► గరిష్ట స్థాయికి పడిపోయిన భూగర్భ జలాలు
► వట్టిపోతున్న బోర్లు, బావులు
► ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో ఖాళీ అయిన జలాశయాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో కరువు కోరల్లో చిక్కుకున్న జిల్లా ప్రజలకు ఈసారి గొంతు తడవడం సైతం గగనంగా మారింది. ప్రతి సంవత్సరం నీటిఎద్దడి జిల్లాలో షరా మామూలే అయినా ఈసారి అప్పుడే తాగునీటిని అందించే జలాశయాలు ఎండిపోవడం.. ఎప్పుడూ లేనంతగా భూగర్భజలాలు అడుగంటడంతో ప్రజల దాహం తీరే పరిస్థితి కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. జిల్లాలో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి వందకోట్ల రూపాయలను కేటాయించడానికి ప్రభుత్వం అంగీకరించినా.. దీనికి సంబంధించిన నిధులు క్షేత్రస్థాయికి రాకపోవడంతో పనులు ప్రా రంభం కాని దుస్థితి నెలకొంది.
ఇప్పటికే జిల్లాలోని అనేక మండలాల్లో భూగర్భ జ లాలు వందల అడుగుల లోతుల్లోకి వెళ్లా యి. ఏ జలాశయం చూసినా ఏమున్నదోయ్ గర్వకారణం అన్న రీతిలో గుక్కెడు నీ టిని అందించలేని స్థితిలో ఎండిపోతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీటి నిల్వలు జిల్లా ప్రజల దాహార్తిని ఎన్ని రోజులు తీ రుస్తాయో అనుమానాస్పదంగానే ఉంది. ముందస్తు ప్రణాళికలు ఎన్ని వేసుకున్నా జలాశయాల్లో ఉన్న నీటిని తాగునీటి కోసం ఎన్ని నెలలు వినియోగించుకోవచ్చన్న అంశంపై సరైన ప్రణాళికలతో కసరత్తు చేయాల్సిన అధికారులు దానిపై పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో పట్టణ వాసులతో పాటు పల్లె గొంతుకలు ఇప్పటికే ఎండిపోతున్నాయి.
అడుగంటిన నీటి నిల్వలు
మహబూబ్‌నగర్‌తో పాటు అనేక మున్సిపల్ ప్రాంతాల్లో కనీసం 10 రోజులకొకసారి తాగునీటిని సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాకు తాగునీరు అందించే జూరాల, రామన్‌పాడు, కోయిల్‌సాగర్‌లో రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటి పోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రామన్‌పాడు ద్వారా ఇప్పటికే జడ్చర్ల, అచ్చంపేట పట్టణాలకు నీటి సరఫరాను నిలిపివేశారు. భూగర్భ జలాలు అడుగంటి నీటిని పంపించే పరిస్థితి లేకపోవడంతో ఆ రెండు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వచ్చే నాలుగు నెలలు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో సామాన్య ప్రజలకే అంతుబట్టడం లేదు.
సాధారణంగా జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉంది.
సాగునీటి ప్రాజెక్టులకు పై ప్రాంతాల నుంచి వరదనీరు వస్తేనే ఆయా సమయాల్లో జిల్లా ప్రజల గొంతు తడుస్తుంది. రెండేళ్లుగా జూరాల జలాశయానికి వరద నీరే లేకపోవడంతో ఉన్న నీరునే రాజకీయ కారణాలతో పంటలకు ఉపయోగించేలా ఒత్తిళ్లు రావడంతో ఇ ప్పుడు తాగునీటికి కటకట ఏర్పడింది. ఇ దే పరిస్థితి మహబూబ్‌నగర్, మున్సిపాలిటీలైన వనపర్తి, గద్వాల, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో నెలకొంది.
కోయిల్‌సాగర్‌లో తగ్గిన నీటిమట్టం
దేవరకద్ర : కోయిల్‌సాగర్‌లో ప్రస్తుతం 12.8 అడుగుల మేర నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగ పాత అలుగు స్థాయి నీటి మట్టం 26.6 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటిని పాలమూరు ప్రజల తాగునీటి అవసరాల కోసం రిజర్వ్ చేసి ఉంచారు. ర బీ సీజన్ పంటలకు నీటిని వదిలేది లేదని అధికారులు ఇంతకుముందే ప్రకటించారు. అయితే తాగు నీటి అవసరాల కోసం వాగు ద్వారా కొంతమేర నీటిని వదలాలని వాగు పరీవాహక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.