తీరనున్న నీటికష్టాలు!
► రూపాయికే నల్లా కనెక్షన్
► జిల్లాలో 86,200 కుటుంబాలకు ప్రయోజనం
► ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
► జిల్లాలో 86,200కుటుంబాలకు ప్రయోజనం
► పైపులు, రోడ్‌కట్టింగ్భారం కూడా మున్సిపాలిటీలదే
► అనుమతిలేని నల్లాలక్రమబద్ధీకరణకు స్పెషల్ డ్రైవ్
పాలమూరు : మున్సిపాలిటీ, నగర పంచాయతీ వాసుల నీటికష్టాలు త్వరలో తీరనున్నాయి. ఒక్క రూపాయకే మంచినీటి నల్లా కనెక్షన్ పథకం అమలులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లరేషన్ కార్డు ఉండి వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపున్న వారికే ఈ అవకాశం. గతంలో తీసుకున్న అక్రమ నల్లా కనెక్షన్లు తొలగించడంతో పాటు ప్రజలకు తాగునీటిని అందించాలనే ఉద్ధ్యేశ్యతో ప్రభుత్వం ముందడుగు వేసింది. కొత్త నల్లా కనెక్షన్ కోసం కావల్సిన పైపులు, రోడ్డు తవ్వకాల వ్యయాన్ని సైతం స్థానిక నగర, పురపాలక సంస్థలే భరిస్థాయి.
86,200 కుటుంబాలకు ప్రయోజనం
జిల్లాలో అయిదు మున్సిపాలిటీలు, ఆరు నగర పంచాయతీల పరిధిలో 1,47,318 మంది నివాసముంటున్నారు. వారిలో కేవలం 61,118 ఇళ్లకు మాత్రమే అధికారికంగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 86,200 ఇళ్లలో నల్లా కనెక్షన్లు లేవు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో ఈ కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో మూడేళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన షాద్‌నగర్, అచ్చపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అయిజ నగరపంచాయతీలకు రూపాయి నల్లా కనెక్షన్‌తో ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది.
ఇప్పటివరకు పేద ప్రజలకు రూ.200కు, మిగతా వారికి రూ.2,500లకు కనెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ విధానం లేకపోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా ఇన్నాళ్లు అనుమతి లేకుండా తీసుకున్న నల్లా కనెక్షన్‌లను క్రమబద్ధీకరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మున్సిపాలీలలో అధికారులు అక్రమ కనెక్షన్‌ల వివరాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నారు.