కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వడంతో నేతల్లో ఉత్సాహం నెలకొంది. జూలై చివరన మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్ల ఖరారుతో రేపోమాపో ఎన్నికల తేదీ విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అదే సమయంలో రాష్ర్ట విభజన అంశంపై కేంద్రంలో కదిలిక మొదలవడంతో ఎన్నికల నిర్వహణ అంశం వెనక్కి వెళ్లింది.
అప్పటినుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూసిన ఆశావాహలు ఇక రెండు రాష్ట్రాల ఏర్పాటుతోనే జరుగుతాయని నిర్ణయించుకొని స్తబ్దంగా ఉన్నారు. ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనతో మున్సిపాలిటీల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సంఘం కూడా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుస్తోంది. దీంతో ఇక ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఎదుైరె ంది. ఈసారి ఎన్నికలు తప్పనిసరిగా జరుగుతాయనే నమ్మకం నాయకుల్లో ఏర్పడింది. ఇక తమ అస్త్రశస్త్రాలకు మరోమారు పదును పెట్టేందుకు పార్టీలు, శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
ఎన్నికలకు అంతా సిద్ధం
ఎన్నికల కోసం జూలైలోనే మున్సిపాలిటీలలో సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేం సిద్ధమే అన్నట్లు అధికారులు గైడ్‌లైన్ ప్రకారం పనులు పూర్తిచేశారు. డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు తయారుచేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లను లెక్కించడం, పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేయడం, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవడం, ఈవీఎంలు తెప్పించి భద్రపరచడం తదితర పనులన్నీ పూర్తిచేశారు.
ఎన్నికల కోసం ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలను, ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల, సిరిసిల్ల, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలు, హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ, పెద్దపల్లి, జమ్మికుంట నగరపంచాయతీల్లో 100 డివిజన్లు, 226 వార్డులకు పోటీపడనున్న అభ్యర్థుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఈసారైనా జరిగేనా?
మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లయింది. 2005 సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగగా, 2010 సెప్టెబర్‌లో పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి ఎన్నికలు ఇప్పుడు, అప్పుడు అంటూ ప్రభుత్వం దాటవేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఆరుసార్లు ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించారు. కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేయడంతో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపి ఏదో ఓ సాకుతో ప్రభుత్వం తప్పించుకుంది.
చివరకు ఎన్నికల సంఘం ఒత్తిడితో డిసెంబర్‌లో ఎన్నికలు పూర్తిచేస్తామని మరోమారు కోర్టుకు హామీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఎంత వరకు సాద్యమవుతుందనే విషయంపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన ఊపందుకున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యమవుందనేది మేధావులు అభిప్రాయం. ఈసారైనా ప్రభుత్వం ఎన్నికలు జరుపుతుందో, మరేదైనా సాకుతో వాయిదా కోరుతుందో వేచిచూడాల్సిందే.
మున్సిపోల్స్ సందడి
Published Sun, Oct 27 2013 3:36 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement