వనపర్తిని తీర్చిదిద్దుతా | municipality | Sakshi
Sakshi News home page

వనపర్తిని తీర్చిదిద్దుతా

Published Mon, Feb 23 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

municipality

జిల్లా కేంద్రం తరువాత పెద్ద మున్సిపాలిటీ వనపర్తి. ఈ పట్టణంలో లక్ష జనాభా ఉంది. దీనికి చారిత్రక పట్టణంగా కూడా పేరుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వనపర్తి తన ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు చాటుకుంటోంది. త్వరలో జరగనున్న జిల్లా కేంద్రాల పునర్విభజనలో ఈ పట్టణాన్ని జిల్లాకేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పట్టణంలో సమస్యలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. పట్టణంలో నెలకొన్న సమస్యలు తెలుసుకునేందుకు వనపర్తి మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్ ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారారు. పలు వార్డుల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు
 తెలుసుకున్నారు.
 
 
 ఎన్.భువనేశ్వరి, కౌన్సిలర్ : గాంధీచౌక్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. రోడ్లు పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు కూడా రోడ్ల వెంట వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. కూరగాయల వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా విశాలంగా ఉండే విధంగా మార్కెట్ ఏర్పాటు చేయాలి.
 
 రమేష్‌గౌడ్: తప్పకుండా చేస్తామమ్మ. ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉన్నా అది వ్యాపారులకు సరిపోవడం లేదు. దానిని షరాబ్ బజారు (బంగారు మార్కెట్)కు కేటాయించి. కూరగాయలకు వేరేచోట మార్కెట్ కేటాయించాలన్న ఆలోచన ఉంది. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటాం.
 
 రమేష్‌గౌడ్: మీది ఏ ఊరు చెప్పండమ్మా..
 ఎన్నాళ్లుగా కూరాగాయలు అమ్ముతున్నారు?
 కృష్ణమ్మ కూరగాయల రైతు: మాది ఖిల్లాఘణపురం మండలం జంగమయ్యపల్లి గ్రామం. కూరగాయలు పండిస్తాం. ఆకు కూరలు, కూరగాయలు వనపర్తి గాంధీచౌక్‌కు తెచ్చి ఇక్కడ రోడ్డుపై పె ట్టుకుని అమ్ముకుంటాం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. పందులు, పశు వులు కూరగాయలు తింటుంటాయి. రోడ్డుపై వెళ్లే వాహనాలు స్థలం లేక కూరగాయలు తొక్కి వెళ్తుంటాయి. ఇలా మాకు చాలా నష్టం వస్తోంది. కూరగాయల రైతుల కోసం మాకు రైతు బజారు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
 
 రమేష్‌గౌడ్: తప్పకుండా ఆలోచిస్తాం. వనపర్తిలో కందకం స్థలం వృథాగా ఉంది. దాదాపు కిలోమీటరు మేర ఉన్న కందకాన్ని పూడిస్తే రైతు బజారు, కూరగాయల మార్కెట్‌కు స్థలం సరిపోతుంది. ఆ దిశగా ఆలోచిస్తాం.
 
 జగదీష్ : మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. వాటిని పరిరక్షించండి. వనపర్తిలో చిల్డ్రన్ పార్కు కోసం పాత బజారులో ఏర్పాటు చేసిన స్థలం వృథాగా ఉంది. ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తే బాగుంటుంది.
 
 రమేష్‌గౌడ్: మున్సిపల్ స్థలాలు ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ప్రజలు తమ దృష్టికి వచ్చిన కబ్జాలను లిఖిత పూర్వకంగా పిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం, చిల్డ్రన్ పార్కు స్థలాన్ని అభివృద్ధి చేసే అంశంపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
 
 నగేష్ : వనపర్తిలో సంతకు స్థలం లేక ఇబ్బందిగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సంతపై ఆధారపడి తమ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. దానిని పునరుద్ధరించాలి.
 
 రమేష్‌గౌడ్: వనపర్తి సంతకు స్థలాన్ని కేటాయిస్తాం. కందకంలో సంతకు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటా.
 
 అనురాధ:వనపర్తిలో రోడ్లు విస్తరించాలి. రోడ్లు చిన్నగా ఉన్నందుకు పార్కింగ్ లేక వ్యాపారాలు పడిపోయాయి. పాతబజారు, గాంధీచౌక్‌లతో వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
 రమేష్‌గౌడ్: వనపర్తి రోడ్ల విస్తరణ అంశం పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డిలు విస్తరణ విషయంలో సానుకూలంగా స్పందిం చారు. మున్సిపాలిటీ ఇందుకు తీర్మానాన్ని కూడా సేసింది. త్వరలో ఈ పనులు మొదలవుతాయి.
 
 చంద్రశేఖర్: వనపర్తిలో రామన్‌పాడు నీళ్లు సరిగా అందడం లేదు. వేసవి వస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది కదా.
 
 రమేష్‌గౌడ్: పట్టణంలో ప్రతి ఇంటికీ రోజూ కృష్ణాజలాలు అందింస్తాం. ఇం దుకు రామన్‌పాడ్ తాగునీటి పథకాలకు కొత్త మోటార్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిని కోరాం. అంచనాలు పంపాలని చెప్పారు. కొత్త మోటార్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు కృష్ణా జలాలు వనపర్తివాసులకు అందిస్తాం.
 
 పోచ రవీందర్‌రెడ్డి : ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వ్యర్థాలు విచక్షణా రహితంగా పారబోయడం వల్ల రోగాలు ప్రబలుతున్నాయి. దీనిని ఖాళీ చేయించండి.
 రమేష్‌గౌడ్: సుమారు నాలుగు ఎకరాల ఈ స్థలం కోర్టు వివాదంలో ఉన్నందున కంపచెట్లు మొలిచాయి. దీంతో పందులు, దోమలు పెరిగాయి. దీనివల్ల ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఈ విషయంపై కౌన్సిల్‌లో మాట్లాడి చదును చేయిస్తాం. లేదా స్థలం సొంత దారులకు నోటీసులు జారీచేసి శుభ్రం చేయిస్తాం.
 
 రమేష్‌గౌడ్ ఇచ్చిన హామీలు
 వనపర్తి ప్రజలు వేసవిలో తాగు నీటిఎద్దడి ఎదుర్కోకుండా రామన్‌పాడ్ తాగునీటి పథకాలకు కొత్త మోటార్లు బిగిస్తాం. వనపర్తిలో కూరగాయల మార్కెట్‌కు విశాలమైన స్థలాన్ని కేటాయిస్తాం. రైతుల కోసం ప్రత్యేకంగా రైతుబజారు,పూల రైతులకు పూల బజారులకు స్థలాలు కేటాయిస్తాం. రోడ్ల విస్తరణకు అన్ని పార్టీల మద్దతు తీసుకుని త్వరలో ఈ తంతును పూర్తి చేస్తాం. వనపర్తిలో అవసరం అయిన ప్రాంతాలలో పార్కింగ్‌లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తాం. మున్సిపల్ స్థలాలలను పరిరక్షిస్తాం. అక్రమ కట్టడాలు, అనుమతి లేని నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతాం. కబ్జాలపై ఫిర్యాదులు చేస్తే తక్షణం స్పందిస్తాం.క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement