ఆర్మూర్ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో బోధన్, బాన్సువాడ, నిజామాబాద్, కామారెడ్డి,ఆర్మూర్‌లలో ఇటీవల నిర్వహించిన వికలాంగ నిర్ధార ణ శిబిరాలు విజయవంతమైనట్లు వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ చిన్నయ్య అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కలెక్టర్ సూచన మేరకు శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరాలలో దరఖాస్తు చేసుకున్న వికలాంగులందరికి నెల రోజుల్లో తిరిగి శిబిరాలను ఏర్పాటు చేసి పరికరాలను అందజేస్తామన్నారు. వికలాంగులను వివాహం చేసుకున్నవారికి తమ శాఖ ద్వారా రూ.50 వేల ప్రోత్సాహం అందజేస్తున్నట్లు చెప్పారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్, ఇంటర్, ఆపై తరగతులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికలాంగులకు జీవనోపాధి కోసం రుణాలు అందిస్తున్నట్లు వివరించారు.
జిల్లాకేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక వసతిగృహాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో ఉండి చదువుకునే విద్యార్థులకు భోజన, వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మానసిక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలో నెలకు రూ. వెయ్యి చొప్పున ఎంఆర్ ఉపకార వేతనాలను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 250 మంది విద్యార్థులకు ఎంఆర్ ఉపకార వేతనాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా కేంద్రంలో గ్రేసి ఆర్గనైజేషన్ వారు మూగ, చెవిటి పాఠశాల, స్నేహా సొసైటీ వారు మానసిక వికలాంగుల, అంధుల పాఠశాల, ఏపీ ఫోరం వారు మానసిక వికలాంగుల పాఠశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పాఠశాలలో 450 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరా రు. వికలాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారికోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. వికలాంగులకు రుణాలు ఇప్పించడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి శంకర్‌రావు, ఎంపీడీవో రాములు పాల్గొన్నారు.
వికలాంగ శిబిరాలు సక్సెస్
Published Sat, Dec 21 2013 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement