పాతాళంలోనే ‘గంగ’
♦ పడిపోతున్న భూగర్భ జలాలు
♦ భారీ వర్షాలు కురిస్తేనే పెరిగే అవకాశం
♦ సాగుపై రైతుల్లో ఆందోళన
ఒకపక్క వర్షాలు రేపుమాపంటూ ఊరిస్తూ అడపాదడపా ముంచెత్తుతున్నాయి. ఈ అరకొర వానను నమ్ము కుని రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కానీ, మరోపక్క భూగర్భ జలమట్టాలు జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా ఆందోళనకరస్థాయిలో అడుగంటిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3.81 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం ముబారస్‌పూర్ గ్రామంలో 54.20 మీటర్ల లోతుకు వెళ్తే కానీ.. భూగర్భజలం జాడ దొరకని దుస్థితి..
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో భూగర్భ జలమట్టాలు ఆందోళన కరస్థాయిలో పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసవికాలం ఆరంభం నుంచి జిల్లాలో క్రమంగా భూగర్భజలమట్టాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం 25.52 మీటర్ల లోతుకు భూగర్బజలాలు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3.81 మీటర్ల మేర భూగర్భజలాలు పడిపోయాయి. జిల్లాలో అత్యధికంగా దౌల్తాబాద్ మండలం ముబారస్‌పూర్ గ్రామంలో 54.20 మీటర్ల మేరకు భూగర్బజలమట్టాలు పడిపోయాయి. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లిలో 7.53 మీటర్ల లోతునే భూగర్భజలాలు ఉన్నాయి.
జిల్లాలో జలమట్టాలు పడిపోతుండటంతో తాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతుండటంతో బోరుబావుల నుంచి నీళ్లు రాని పరిస్థితి ఉంది. దీంతో చాలా గ్రామాల్లో బోరుబావులు ఎండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సివస్తోంది. మరోవైపు వ్యవసాయ బోరుబావుల్లో సైతం భూగర్భజలాలు ఇంకిపోవ టం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రబీలో కరువు, భూగర్భజలాలు పడిపోవటంతో వ్యవసాయ బోరుబావుల కింద రైతులు పెద్దగా పంటలు సాగు చేయలేదు.
వరి, కూరగాయల పంటలు సాగుచేసినా నీళ్లులేక వరి పంట ఎండిపోయింది. కొన్ని ప్రాంతాల్లో పంటచేతికి వచ్చినా దిగుబడి సగానికిపడిపోయింది. కూరగాయల పంటల దిగుబడి అంతంతమాత్రంగా నే ఉండటంతో రైతులు నష్టాలను చవిచూడాల్సివచ్చింది. దీంతో రైతులు ఖరీఫ్‌పై ఆశలు పెట్టు కున్నారు. బోరుబావుల్లో నీళ్లు అడుగంటడంతో ఖరీఫ్ సాగు ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా బోరుబావుల కింద రైతులు పంటలు సాగు చేసుకునేందుకు వీలవుతుంది. భారీ వర్షాలు కురిసి భూగర్భ జలమట్టాలు పెరగాలని రైతులు కోరుకుంటున్నారు.
పడిపోతున్న భూగర్భ జలాలు...
వర్షాభావానికితోడు భూగర్భ జలాలు అవసరానికి మించి తోడుకోవటంతో జిల్లాలో భూగర్భ జల మట్టాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 25.52 మీటర్ల లోతుకు భూగర్భజలాలు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో భూగర్భ జలమట్టాలు 21.71 మీటర్ల మేర ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3.81 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. రాయికోడ్ మండలంలో అత్యధికంగా 44.39 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టాలు చేరుకున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా 30.25 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోగా మెదక్ నియోజకవర్గంలో 19.39 మీటర్ల మేర జలాలు ఉన్నాయి.
నర్సాపూర్ నియోజకవర్గంలో 28.37, అందోలులో 27.91, సంగారెడ్డిలో 16.45, పటాన్‌చెరులో 26.23, జహీరాబాద్‌లో 24.33, సిద్దిపేటలో 24.18, గజ్వేల్‌లో 23.43 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. భారీ వర్షాలు కురిస్తే భూగర్భజలమట్టాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు, కుంటల్లో పెద్దఎత్తున పూడికతీత పనులు సాగుతున్నాయి. వర్షాలు బాగా కురిసిన పక్షంలో భూగర్భ జలాలు వచ్చే మాసం నాటికి పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో ఎర్రనేలలు ఉండటానికి తోడు భూగర్భంలోని శిలాజలాలు నీటిని వేగంగా ఇంకించుకునేందుకు వీలుగా ఉన్నాయని దీంతో వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని జియాలజిస్టులు చెబుతున్నారు. భూగర్భ జలమట్టాలు పెరిగిన పక్షంలో ఖరీఫ్‌లో బోరుబావుల కింద పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అయితే బోరుబావుల కింద రైతులు వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే మేలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.