రైతన్నల ఉసురు తీస్తున్న అప్పులు | farmers are suicides with debts | Sakshi
Sakshi News home page

రైతన్నల ఉసురు తీస్తున్న అప్పులు

Published Thu, Dec 4 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

రైతన్నల ఉసురు తీస్తున్న అప్పులు

రైతన్నల ఉసురు తీస్తున్న అప్పులు

కష్టాలను తీరుస్తాడన్న వరుణుడు నిలువునా ముంచేశాడు. దీనికితోడు భూగర్భజలాలు ఎండిపోవడంతో సాగు చేసిన పంటలు కళ్లె ఎదుటే ఎండిపోవడంతో ఆ ఇద్దరు రైతులూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఓ రైతు ఉరేసుకుని ప్రాణాలను వదలగా.. మరో రైతు గుండె పోటుకు గురై పొలంలోనే మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన వల్లపు కిష్టయ్య (35)కు సొంత భూమి పది గుంటలు మాత్రమే ఉండడంతో ఏటా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈసారి ఖరీఫ్‌లో ఆరు ఎకరాలకుపైగా భూమిని ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లించి కౌలుకు తీసుకున్నాడు. ఇందులో పత్తి సాగు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దెబ్బతింది. రెండ్రోజుల క్రితం సుమారు పది క్వింటాళ్ల పత్తి ఏరి అమ్మాడు కూడా. ఈ విధంగా వచ్చిన డబ్బులు కౌలు కూడా చెల్లించడానికి సరిపోకపోవడం, రెండోసారి తీయడానికి పత్తి లేకపోవడంతో కలత చెందాడు.

తన శ్రమంతా వృథా అయ్యిందని మనోవేదన చెందాడు. అప్పటికే కుటుంబ అవసరాల కోసం చేసిన సుమారు రూ.3 లక్షలకుపైగా అప్పులున్నాయి. అప్పులకు పత్తి నష్టం తోడై పుట్టి మునిగే స్థితి వచ్చిందని భావించిన కిష్టయ్య ఆత్యహత్య చేసుకోవాలనే నిర్ణయించాడు. ఈ క్రమంలోనే బుధవారం భార్య, పిల్లలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధర్రాతి నిద్రలేచి కుటుంబీకులకు పడుకున్న గది పక్కనున్న మరో గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గమనించిన భార్య యాదమ్మ, పిల్లలు సందీప్ (12), సతీష్ (10)లు రోదించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ రమేష్ గ్రామానికి  చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుండెపోటుతో..

శివ్వంపేట : మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన చెంది రాములు (55) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇందులో వరి, కూరగాయలు సాగు చేశాడు. నెల రోజుల క్రితం మూడు బోరుబావులు తవ్వించగా చుక్క నీరు పడలేదు. ఈ క్రమంలో ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేశాడు. బోర్లు వేసేందుకు, పంటపెట్టుబడులు, కుమార్తెల వివాహాల కోసం సుమారు రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడు. వ్యవసాయాన్ని నమ్ముకుని అప్పు తీర్చవచ్చని భావించిన రైతు ఆశలు అడి ఆశలయ్యాయి. సాగుచేసేందుకు నీటి వసతి లేకపోవడం, కాలం కలిసి రాకపోవడం చేసిన అప్పుడు తీర్చే పరిస్థితి కనిపించ లేదు.

మూడు రోజులుగా ఇదే విషయమై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చెప్పుకుని మనోవేదనకు గురయ్యాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే గుండె పోటుకు గురయ్యాడు. కాగా రాత్రి అయినా రాములు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పొలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ విగతజీవుడై కనిపించాడు. మృతుడి భార్య పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ ఇసుబ్ తెలిపారు.
 
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం : డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి

నర్సాపూర్ రూరల్ : అప్పులబాధతో మనోవేదనకు గురై గుండె ఆగి మృతి చెందిన శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామానికి చెందిన రైతు రాములు మృతదేహాన్ని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి గురువారం స్థానిక ఆస్పత్రిలో సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగాఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రుణమాఫీ పథకం ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

కొత్తరుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ సరైన వర్షాలు పడకపోవడం, తీవ్ర కరెంట్ కోతల కారణంగా వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దీంతో అప్పులపాలై, వాటిని తీర్చలేక కొందరు ఆత్మహత్మలకు పాల్పడుతుంటే మరి కొందరు గుండెపోటుకు గురై మృతి చెందుతున్నారని తెలిపారు.రైతులతో పాటు ఇతర అర్హులైన పింఛన్‌దారుల సమస్యల కోసం తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement